Sakshi News home page

రాహుల్‌కు యూత్ షాక్

Published Thu, Nov 26 2015 3:11 AM

రాహుల్‌కు యూత్ షాక్ - Sakshi

స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియాలకు సానుకూల స్పందన
 
♦ మోదీ విధానాలను ఎండగట్టాలనుకున్న రాహుల్‌కు చుక్కెదురు  
♦ ప్రధాని నియంతృత్వ పోకడలపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ యువనేత
 
 బెంగళూరు: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బుధవారం బెంగళూరు యువతులు చుక్కలు చూపించారు. మోదీ సర్కారుపై దాడికి వేదికగా ఇక్కడి ప్రఖ్యాత మౌంట్ కార్మెల్ కాలేజ్‌ను ఎంచుకున్న రాహుల్‌కు ఊహించని ఎదురుదాడి ఎదురైంది. కాలేజ్ విద్యార్థినులతో ఇష్టాగోష్టిలో వారి ద్వారానే మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలనుకున్న రాహుల్‌కు చుక్కెదురైంది. ‘‘స్వచ్ఛ భారత్’ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలు విజయవంతమయ్యాయా?’ అన్న ప్రశ్నలకు.. వారినుంచి ఒక్కసారిగా ‘ఎస్’ అంటూ జవాబు రావడంతో ఆయన నిశ్చేష్టుడయ్యా రు. ఆ తరువాత ‘యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయా?’ అన్న ప్రశ్నకు కొందరు ‘ఎస్’ అని, కొందరు ‘నో’ అని జవాబివ్వడంతో కాస్త తేరుకున్నారు. ‘మీ దృష్టిలో స్వచ్ఛభారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు ఎలా ఉన్నాయోగానీ నా దృష్టిలో ఈ రెండూ విజన్ లేని కార్యక్రమాలు’ అని స్పష్టం చేశారు. మొత్తానికి కార్యక్రమంలో విద్యార్థినులు బుల్లెట్లలాంటి ప్రశ్నలతో రాహుల్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. స్టుడెంట్స్ రాహుల్‌ను అడిగిన కొన్ని ప్రశ్నలు..

► ఇరోమ్ షర్మిల సంవత్సరాలుగా నిరాహార దీక్ష చేస్తోంటే ఆమెతో చర్చలకు ఎందుకు సిద్ధపడలేదు?(ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒక స్టూడెంట్ ప్రశ్న)
► కేంద్రాన్ని మీరు సూటుబూటు ప్రభుత్వమని విమర్శిస్తున్నారు. కానీ అది ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంటే అందులో తప్పేముంది?(‘ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అది జరగడం లేదు. కేవలం ఆర్థికవృద్ధితో సమగ్రాభివృద్ధి సాధ్యం కాదు. ఆర్థికవృద్ధి ఫలాలు సాధారణ ప్రజలకూ అందాలి. అలా ఎక్కడ జరుగుతోంది? అందుకే ఇది సూటు బూటు సర్కారు’ అని సమాధానమిచ్చారు)
► జీఎస్టీ మీరు రూపొందించిన ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన ముఖ్యమైన బిల్లే కదా! ఇప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
► {పభుత్వాన్ని అడ్డుకోవడం కోసమే పార్లమెంటును సాగనివ్వడం లేదు కదా! ఎందుకలా?
► ఇప్పుడు యువత బీజేపీకో, ఆప్‌కో దగ్గరవుతోంది. కానీ కాంగ్రెస్ వైపు చూడటం లేదు. ఎందుకు?
► బిహార్లో ఆర్జేడీతో పొత్తు పెట్టుకోవడం అవినీతిపై రాజీ పడినట్లు కాదా?

 ఇలా వరుస ప్రశ్నలతో వారు కాంగ్రెస్ యువనేతను ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సగంమంది స్టూడెంట్స్ స్వచ్ఛభారత్‌కు వ్యతిరేకంగా, చాలామంది మేక్ ఇన్ ఇండియాకు వ్యతిరేకంగా స్పందించారంటూ వ్యాఖ్యానించారు. కానీ, ఆ కార్యక్రమాన్ని వివిధ వార్తాచానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేసిన విషయాన్ని రాహుల్ మర్చిపోయారేమోనన్న కామెంట్స్ అక్కడ వినిపించడం కొసమెరుపు. అంతకుముందు కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ, బీజేపీ, ఆరెస్సెస్‌లపై రాహుల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నుంచి దేశాన్ని నడపొచ్చని ఆయన భావిస్తున్నారు. నిర్ణయాలన్నీ ఒక్కరే తీసుకుంటున్నారు. ప్రతిపక్షాలను కనీసం సంప్రదించడం లేదు’ అంటూ ధ్వజమెత్తారు. దేశంలో అసహన వాతావరణం ఒక భారతీయుడిగా తనను వ్యాకులతకు గురి చేస్తోందన్నారు.

తమతో విబేధించేవారితో నూ చర్చించాలన్నది కాంగ్రెస్ విధానమైతే.. అందుకు పూర్తి విరుద్ధ విధానం బీజేపీ, ఆరెస్సెస్‌లదన్నారు. జీఎస్టీ బిల్లుకు తాము అనుకూలమేనని, అందులోని కొన్ని అంశాలకు సంబంధించి తమ ఆందోళనలపై ప్రభుత్వం స్పందించి, ప్రతిపక్షాలతో చర్చించాలన్నారు. ఈ సూటుబూటు సర్కారు పూర్తిగా విఫలమైందని, ఇది మాటలకే పరిమితమైందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కాలేజ్ విద్యార్థులతో మమేకమవాలనే రాహుల్ ఆలోచనల్లో భాగంగా మొదటగా ఆయన ఇక్కడి విద్యార్థులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. బెంగళూరులో రాహుల్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవడాన్ని ప్రస్తావిస్తూ.. రాహుల్ అజ్ఞానాన్ని బెంగళూరు యువత బయటపెట్టారని బీజేపీ వ్యాఖ్యానించింది. మోదీ ప్రభుత్వ విధానాలకు యువత నుంచి వస్తున్న సానుకూల స్పందనకు ఇదే నిదర్శనమని పేర్కొంది. మోదీ  కార్యక్రమాల్లో ప్రశ్నలను ముందే నిర్ణయిస్తారని, రాహుల్ అలా కాకుండా నిజాయితీగా ప్రశ్నలను ఎదుర్కొన్నారని, నిజమైన నేత వ్యవహరించాల్సింది అలాగేనని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.

Advertisement

What’s your opinion

Advertisement