శీతాకాలంలో పశువులపై దృష్టి పెట్టాలి | Sakshi
Sakshi News home page

శీతాకాలంలో పశువులపై దృష్టి పెట్టాలి

Published Thu, Nov 6 2014 2:58 AM

to focus on animal in winter season

ఖమ్మం వ్యవసాయం:  పశు పోషణలో మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని పశువ్యాధి నిర్ధారణ కేంద్రం డాక్టర్ జి.మోహనకుమారి తెలిపారు.  శీతాకాలంలో ఆచరించాల్సిన పద్ధతులను ఆమె వివరించారు.

 పాలను సాధారణంగా ప్రతిరోజు 12 గంటల వ్యవధిలో పితుకుతుంటారు. కానీ శీతాకాలంలో పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాలను చలికాలంలో ఉదయం 6-7 గంటలు, సాయంత్రం 4-5 గంటల సమయంలో పితకడం మంచిది.
 శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూడాలి. శరీరం వేడిగా ఉండటానికి అదనపు ఆహారం ఇవ్వాలి. లేని పక్షంలో మేత తినక పాల దిగుబడి తగ్గుతుంది.
 పశువులకు అందించే దాణాలో పిండి పదార్థాలు ఎక్కువగా, మాంసకృత్తులు తక్కువగా ఉండాలి.
 లూసర్న్, బర్సీం వంటి పశుగ్రాసాల సాగును చేపట్టి అధిక పాల దిగుబడి పొందాలి.
 వరి కోతలు పూర్తవగానే పొలంలో మిగిలి ఉన్న తేమతో జనుము వంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి.
 శీతాకాలంలో గేదెలు ఎక్కువగా ఎదకొచ్చి పొర్లుతాయి. కాబట్టి ప్రతిరోజు పశువులను కనీసం రోజుకు రెండు సార్లు ముందు, వెనుక పరిశీలించాలి. పశువు వెనుక భాగంలో పరిశీలిస్తే మూగ ఎదలో ఉన్న పశువులను గుర్తించటం వీలవుతుంది. గత ఎద పూర్తయిన తరువాత 16-25 రోజుల్లో పశువుల ప్రవర్తనలో మార్పు, పాల దిగుబడిలో తగ్గుదలను బట్టి ఎదను గుర్తించాలి. వెంటనే వీర్యదానం చేయించాలి.
 చలిగాలులు, మంచుకురవటం వల్ల న్యూమోనియా సోకే ప్రమాదం ఉంది. గొంతువాపు, గిట్టలు మెత్తబడటం, మేత తినకపోవటం వంటి సమస్యలుత్పన్నమవుతాయి.
 పశువులు, దూడలను ఆరుబయట కట్టివేయకూడదు. ఈదురుగాలి నిరోధించటానికి వాతావరణంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువైన సందర్భాల్లో పాకల చుట్టూ పరదాలు కట్టాలి.
 లేగ దూడల వెంట్రుకలను శీతాకాలంలో కత్తిరించ కూడదు.
 ప్రతిరోజు పశువులశాలలను రెండు సార్లు శుభ్రం చేయాలి. సోడాకార్బొనేట్, 4 శాతం బ్లీచింగ్ పౌడర్ వంటి క్రిమిసంహారక మందులతో శుభ్ర పరచాలి.  
 నీటి తొట్లను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. తరుచుగా వాటికి సున్నం వేస్తుంటే పశువులకు కాల్షియం, ఖనిజలవణాలు లభ్యమవుతాయి. ఫంగస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది.
 పశువులు తాగేందుకు రోజుకు 50-60 లీటర్ల నీరు అవసరం. శీతాకాలంలో 2-3 సార్లు తాగేందుకు నీరందించాలి. తాగే నీళ్లు పుష్కలంగా అందిస్తే పాల దిగుబడి బాగుంటుంది.
 పాలు పితికే గంట, రెండు గంటల ముందు లేదా పితికిన తరువాత దాణా ఇవ్వాలి.

 పాడి పశువులకు సమీకృత దాణాను తాగే నీళ్లతో కలిపి ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల పోషక పదార్థాలు ముఖ్యంగా మాంసకృత్తులు నీళ్లలో కరిగి పొట్టలోని నాల్గవ అర(అబోమేసం)లోకి నేరుగా వెళ్తాయి. రూమెన్‌లోని సూక్ష్మజీవులకు పోషకపదార్థాలు అందవు. తద్వారా రూమెన్‌లో వృద్ధి, ఉత్పాదక క్రియలు కుంటుబడి, ఆమ్లజనిత అజీర్తి చోటుచేసుకుంటుంది. కాబట్టి సమీకృత దాణాను తాగే నీళ్లతో కాకుండా విడిగా ఇవ్వటం మంచిది.

Advertisement
Advertisement