లండన్‌లో ఘనంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు | Sakshi
Sakshi News home page

లండన్‌లో ఘనంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు

Published Mon, Jul 10 2017 6:40 PM

OU 100 years festival celebrated in london

లండన్‌లోని చారిత్రాత్మక ఇండియన్ జింఖానా  క్లబ్‌లో చారిత్రాత్మక  ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ఆశ్ర అంజుమ్ ఉస్మానియా అలుమ్ని యూకే  &యూరోప్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ఉస్మానియా పూర్వ విద్యార్థి లార్డ్ కరణ్ బిలిమొరియా(చాన్సలర్, బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీ) విశిష్ట  అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు భారత్‌ నుంచి ముఖ్య అతిథులుగా ఉస్మానియా పూర్వ విద్యార్థులు నరపరాజు రాంచందర్ రావు(ఎమ్మెల్సీ), ప్రొఫెసర్ పుట్టి మనోహర్(NCERT మెంబర్), డాక్టర్ దాసోజు శ్రవణ్(సోషల్ వర్కర్), భారత ఎంబసీ నుంచి అంబాసిడర్ విజయ్ వసంత్, అంబాసిడర్ నాగేశ్వర్, వీరేంద్ర శర్మ(MP,లండన్)లు విచ్చేసి అమూల్య సందేశాలను ఇచ్చారు.

లార్డ్ బిలిమొరియా మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ ప్రపంచానికే ఆదర్శనీయులని అన్నారు. పురాతన విశ్వవిద్యాలయాలకు చిరునామా భారత్ అని ఆక్సఫర్డ్ యూనివర్సిటీకి వందల సంవత్సరాల ముందే నలంద, తక్షశిల ఉన్నాయని, అలాగే 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా నుండి నేను పట్టభద్రుణ్ణి అయినందుకు గర్వపడుతున్నానని తెలిపారు. బ్రిటన్, ఇండియా దేశాలు పరస్పరం సహకరించుకుని విద్యా విధానాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. దేశ సంపద సృష్టికర్త  పీవీ   నరసింహారావును దేశానికి అందించిన ఘనత ఉస్మానియాదేనని మాజీ క్రికెటర్ ఆశాబోగ్లే అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిలు తన క్లాస్‌మేట్ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు ఆశా.

ఉస్మానియా వైస్ చాన్సలర్ రాంచంద్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. వీసా, ప్రయాణ ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యి చివరి సమయంలో అత్యవసర పనుల వల్ల రాలేకపోతున్నాని చెప్పారు. విశ్వవ్యాప్తంగా ఉస్మానియా విద్యార్థులు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నారని, అలాగే విదేశాల్లో 100 ఏళ్ల పండుగ నిర్వహణ అద్భుతమని, పూర్వ విద్యార్థులు అందరూ ఉస్మానియా అభివృద్ధి లో బాగస్వామ్యులవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే ఉస్మానియా అల్యూమిని వ్యవస్థాపకులు గంప వేణుగోపాల్, రంగుల సుధాకర్, మహేష్ జమ్ముల, సురేష్ మంగళగిరిలను అభినందించారు.

ఎన్ రాంచందర్ రావు(ఎమ్మెల్సీ) మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మేధావులను అందించిన ఘనత ఉస్మానియాదేనని,
ఉస్మానియా అభివృద్ధిలో ప్రతి ప్రవాస పూర్వ విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఉస్మానియాతో తన కుటుంబానికి ఉన్న 80 ఏళ్ల అనుబంధాన్నిగుర్తు చేసుకున్నారు. పుట్టి మనోహర్(NCERT  మెంబర్) మాట్లాడుతూ.. హార్వర్డ్ యూనివర్సిటీని ప్రభుత్వ సహకారం లేకుండా ఎలా అల్యూమిని ద్వారా అభివృద్ధి చేసుకున్నారో.. ఉస్మానియా పూర్వవిద్యార్థులు కూడా అల్యూమిని ద్వారా విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఉస్మానియా గ్రేడింగ్ మెరుగు కొరకు పూర్వ విద్యార్థులు తమ మేధస్సును ఇవ్వాలని కోరారు. ప్రతి విశ్వవిద్యాలయం  చదువును నేర్పుతుంది. ఉస్మానియా చదువుతో పాటు జీవితాన్ని నేర్పుతుందని తెలిపారు.

దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. విదేశాల్లో నాణ్యమైన విద్యావ్యవస్థ, విజ్ఞాన సంపత్తిని మన దేశానికి తెచ్చేందుకు సహకారం అందించాలని అల్యూమినిను కోరారు. నాణ్యమైన విద్యావ్యవస్థ విధి విధానాలను రూపొందించాలని అన్నారు. ప్రవాసులు ఆర్ధికపరమైన సహకారమే కాకుండా తమ మేధస్సును, నైపుణ్యాన్ని ఇచ్చి ఉస్మానియా అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ లింబాద్రి(శతాబ్ది ఉత్సవాల కన్వీనర్) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. చివరి గంటల్లో అత్యవసర పనుల్లో రాలేకపోయానని  లండన్‌లో శతాబ్ది ఉత్సవాల నిర్వహణ ఉస్మానియాకు గర్వకారణమని అన్నారు.

అంబాసిడర్ విజయ్ వసంత్ మాట్లాడుతూ..  విద్యావ్యవస్థలో స్కిల్ డెవలప్‌మెంట్ అభివృద్ధికి పాటు పడాలని కోరారు. గ్రామీణ విద్యకు కృషి చేయాలని ప్రవాసులకు పిలుపునిచ్చారు. వీరేంద్ర శర్మ. ఉస్మానియాకు బ్రిటన్ ద్వారా ఏ రకమైన సహాయం కావాలన్న తన శక్తి మేరకు ప్రయత్నిస్తానని తెలిపారు. యూకేలో ఉస్మానియా అల్యూమిని ఏర్పాటుకు పునాదులు వేసిన వ్యవస్థాపకుడు.. గంప వేణుగోపాల్‌ను లార్డ్ బిలిమొరియా, రాంచందర్ రావు, మనోహర్ రావు, దాసోజు శ్రవణ్‌లు ఘనంగా సన్మానించారు. సభాధ్యక్షులుగా అల్యూమిని అధ్యక్షులు రంగుల సుధాకర్ వ్యవహరించి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రధాన కార్యదర్శి జమ్ముల మహేష్, కన్వీనర్ సురేష్ మంగళగిరిలు కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు.

కార్యక్రమంలో ఉస్మానియా విద్యార్థులు రాగసుధ, స్వాతి రెడ్డిలు నృత్యం, దేశభక్తి గీతాలు పాడి అలరించారు. అలాగే సమాజసేవలో భాగస్వాములైన ఉస్మానియా పూర్వ విద్యార్థులకు శతాబ్ది ఉత్సవాల్లో సన్మానం చేశారు. డా.కిల్లి పద్మ, డా.హరి  ,శంకర్ దేవరశెట్టి, శివరాజ్ కిరణ్ పసునూరి, గీత, కుమార్ ఉప్పల వారిని సన్మానించారు. శ్యామ్ కుమార్ పిట్ల, గుండా శ్రీనివాస్, మీనాక్షి, రంగు వెంకట్, వాణి అనసూరి, ఫారూఖ్, సత్య జిల్ల, తుకారాం, వెంకట్ రెడ్డి, నరేందర్, శ్రీధర్ మేడిశెట్టి , శ్రీకాంత్ తదితరులు కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు.

Advertisement
Advertisement