మేడే నేర్పుతున్న పాఠం..! | Sakshi
Sakshi News home page

మేడే నేర్పుతున్న పాఠం..!

Published Sun, May 1 2016 12:26 AM

మేడే నేర్పుతున్న పాఠం..!

అది దశాబ్దాలుగా కార్మికులు కట్టుబానిసలుగా జీవితం గడిపిన కాలం. 19వ శతాబ్దం చివర్లో శ్రామిక ప్రజానీకం తమ యాజమాన్యాల ఉక్కుపాదాల కింద నలుగుతున్న రోజులవి. పారిశ్రామిక విప్లవంతో మనుషులే యంత్రాలుగా మారిన దుస్థితి. చట్టాల్లేవు, హక్కులు లేవు. అత్యంత అభద్రతా స్థితిలో రోజుకు 14 నుంచి 16 గంటల పాటు చట్ట బద్ధంగానే పనిచేయవలసి వచ్చిన ఆ రోజుల్లో పనిస్థలాల్లో గాయాలు, మరణాలు సర్వ సాధారణంగా ఉండేవి.

అమెరికాలో ఆప్టన్ సింక్లెయిర్ రాసిన ‘ది జంగిల్’, జాక్‌లండన్ రచన ‘ది ఐరన్ హీల్’ నాటి కార్మికుల దుస్థితిని కళ్లకు కట్టినట్లు చిత్రించాయి. వేతనంలో కోతలేకుండానే తక్కువ పనిగంటల కోసం 1860ల మొదట్లోనే కార్మికులు ఆందోళనలు చేశారు కానీ, 1880ల చివరికి సంఘటిత కార్మికవర్గం 8 గంటల పనిదినాన్ని డిమాండ్ చేయగలిగిన శక్తిని సాధించుకుంది.
 
అదే సమయంలో సోషలిజం ఒక నూతన, ఆకర్షణీయ భావనగా కార్మికులను ఆకట్టు కుంది. వస్తూత్పత్తిపై, సకల వస్తుసేవల పంపిణీపై కార్మికవర్గం యాజమాన్యం అనే భావన శ్రామికులను ఆకర్షించింది. వేలాది మంది స్త్రీ పురుషులు, బాలబాలికలు ప్రతి సంవత్సరం పనిస్థలాల్లోనే కన్నుమూస్తున్న భయానక పరిస్తితుల్లో సోషలిజం వారిలో ఆశలు రేపుతూ పలుకరించింది. ఆ సమయంలోనే అమెరికా, ఐరోపా దేశాల్లో హక్కులు ఊపిరి పోసుకున్నాయి.

1885 మే 1వ తేదీన చికాగో నగరంలో హే మార్కెట్ ప్రాంతంలో 8 గంటల పనిదినం కోసం లక్షలాది కార్మికులు ఆందోళనకు దిగారు. మే 3వ తేదీన చికాగోలోని మెకార్మిక్ వర్క్స్‌లో ఆందోళన చేస్తున్న 3 లక్షల మంది కార్మికులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో వందలాదిమంది నేలకొరిగారు. కార్మిక హక్కుల పోరులో మైలు రాయిగా నిలిచిన ఆ ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని నేడు వందకు పైగా దేశాల్లో అధికా రికంగా జరుపుకుంటున్నారు.
 
ఎనిమిది గంటల పనిదినాన్ని కల్పించాలని ఇంకా ఇతర డిమాం డ్లతో శ్రామిక ప్రజలు తమ రక్తం చిందించి సాధించుకున్న డిమాం డ్లకు 21వ శతాబ్దంలో కాల దోషం పడుతోందా? అనే అనుమానం ప్రబలుతోంది. 127 ఏళ్ల తర్వాత కూడా కార్మికుల జీవితాలకు భద్రత దినదిన గండంలా మారింది. భారత్ వంటి దేశాల్లోని కోట్లాది అసంఘటిత రంగ కార్మి కులు.. హక్కులు అనే భావనకూ దూరమైపోయారు. 1990ల వరకు బలంగా ఉన్న ట్రేడ్ యూనియన్ల కారణంగా సంఘటిత రంగంలో కార్మికులకు ఉన్న కాసింత భద్రత కూడా నేడు లోపిస్తోంది.

ఇక అసంఘటిత రంగంలో నేటికీ కార్మికులు బానిసల్లా గానే బతుకుతు న్నారు. దుస్తుల ఫ్యాక్టరీ వంటి చోట్ల రోజువారీ లక్ష్యం కాస్త తగ్గినా యాజమాన్యం విరుచు కుపడుతూ అదనపు పని గంటల్లో పనిచేయించడం నేడు సైతం నిత్య కృత్యంగా మారింది. పనిస్థలంలో నీళ్లుండవు. ఉద్యోగ భద్రత లేదు. ఇక దేశ మంతా విస్తరించిన పారిశ్రామిక సెజ్‌లలో యజమానులు ఏది చెబితే అదే నిబంధనలా మారిపోయింది.
 
ప్రైవేట్ రంగం తొలినుంచి పీడక స్వభావంతో ఉందనేది కాదనలేని సత్యమే కానీ.. ప్రభుత్వాలు సైతం కార్మికుల కనీస హక్కులను కూడా కాలరాస్తుండటం దారుణం. కార్మికులకు పదవీ విరమణానంతరం కాసింత భద్రతనిస్తున్న భవిష్యనిధినే మార్కెట్ పరం చేసే ధోరణులు పొడసూపుతున్నాయి. పీఎఫ్‌పై వడ్డీని తగ్గిస్తూ మోదీ ప్రభుత్వం కొద్ది రోజుల వ్యవధిలోనే ఎన్ని పిల్లిగంతులు వేసిందో చూశాం. భవిష్యత్తులో ప్రభుత్వో ద్యోగాలు ఉండవని ఏలికలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.

భవిష్యనిధిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కు తీసుకోవడంపై కూడా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై బెంగళూరు నగరంలో కార్మికులు, ఉద్యోగులు హింసాత్మక ప్రదర్శనలు చేస్తే ఆగని ఆ ఆంక్షలు రద్దు కాలేదు. సుపరిపాలన, పారదర్శక విధానాలు, ప్రజానుకూల ప్రభుత్వం వంటి కొత్త భావనలన్నీ పైపై చక్కెర పూతలేనని పీఎఫ్‌పై వడ్డీ తగ్గింపు వంటి చర్యలు నిరూపిస్తున్నాయి. చట్టాలున్నపుడే కనీస వేతనాల చట్టం అమలు చేయడం లేదు. పని భద్రత అమలు కావడంలేదు. అసంఘటిత కార్మికులకు మేలు జరగడంలేదు. ఇప్పుడు వాటి సవరణలు చేసి కార్మికులను మరింత కష్టాల్లోకి నెట్టారు. పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఎన్నో ఏళ్ళుగా సాధించుకున్న కార్మిక హక్కులు, ప్రయోజనాలు హరించుకుపోతున్నాయి.
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుతున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలనుంచి, కార్మిక వ్యతిరేకమైన ఈ చట్టాల నుంచి వారికి రక్షణ కల్పించడమే నేటి కార్మిక సంఘాల కర్తవ్యం. ఇలాంటి ప్రమాద ఘంటికలను కార్మిక సోదరులు ఐకమత్యంతో అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనాఉంది. లేదంటే రాబోయే రోజుల్లో కార్మిక సంక్షేమం, అవసరాలు, కనీస సదుపా యాల కల్పన వంటివి ఎండమావులుగా మారే ప్రమాదం ఉంది. రక్త ప్లావిత ఆచరణతో మేడే నేర్పిన, నేర్పుతున్న గుణపాఠం ఇదే.    
(నేడు మేడే సందర్భంగా)
కె. రాజశేఖరరాజు

Advertisement
Advertisement