నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వను... | Sakshi
Sakshi News home page

నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వను...

Published Sat, Jan 9 2016 2:20 PM

నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వను... - Sakshi

‘‘ఒరేయ్ పిల్లలూ! ఇవ్వాళ అన్నంలోకి బంగాళదుంపలు వేయించి, ముద్ద పప్పు, ముక్కల పులుసు చేసి, నాలుగు అప్పడాలు, గుప్పెడు గుమ్మడి వడియాలు... అనుకుంటున్నా. కొబ్బరి పచ్చడి కొంచెమే అవుతుంది కాబట్టి ముందొచ్చిన వాళ్లకు. ఆనక మీ ఇష్టం. ఎక్కడ తిరిగినా పెందరాళే కొంపకి రండి’’ అని మా నాయనమ్మ పొద్దున్నే ఒక ప్రకటన చేసేది. దాంతో పిల్లలంతా ఆనందోత్సాహాలతో నానమ్మకి జేజేలు పలికేవారు. మేం ఏడుగురు సొంత పిల్లలం, నలుగురు చుట్టాల పిల్లలు. అందరం ఎవరికి వారే ముందుగా, కొంచెం ముందుగా, మరీ ముందుగా ఇంటికి చేరేవాళ్లు. బుద్ధిగా కాళ్లూ, చేతులూ కడుక్కుని మళ్లా మాట రాకుండా వరస క్రమంలో కూచునేవారం. తీరా వడ్డనలు మొదలయ్యేసరికి వాతావరణంలో తేడా వచ్చేది.

అప్పటిదాకా మతాబుల్లా వెలుగుతున్న పిల్లల ముఖాలు చీదేసిన చిచ్చుబుడ్డి చందంగా మారిపోయేవి. పొద్దుట్నించీ కలలు కంటున్న వేపుళ్లు, పాపడ్లు లేకపోగా, దోసకాయ కాల్చిన పచ్చడి, చారు నీళ్లు దర్శనమిచ్చేవి. ఏమి టిదని నానమ్మని అందరం నిలదీస్తే - రోజూ మిమ్మల్ని అన్నాలకి పిలవలేక చస్తున్నా. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని తేల్చి పారేసేది. ఇలా చిన్నప్పటి నుంచి ఆశపెట్టేవాళ్లని చూస్తూనే ఉన్నాం. మాయలో పడుతూనే వున్నాం. ఇదొక విచిత్ర వలయం.

రోజూ వార్తలు చూస్తున్నా, చదువుతున్నా నాకు నానమ్మ కబుర్లు గుర్తొస్తూ ఉంటాయి. ఏ ఊర్లో నిలబడితే ఆ ఊరిని ప్రపంచ ప్రఖ్యాతం చేసేస్తామనడం. ఏ సెంటర్లో నిలబడితే ఆ సెంటర్‌ని బంగారం చేస్తామనడం. జనం నమ్మే స్తున్నారనుకోవడం - ఇదంతా నిత్యం ఒక ఫార్స్‌లా తయారైంది. ‘‘ఒక నగరమంతా. వాటి నిండా కలువపూలు, రకరకాల చేపలు, తాబేళ్లు. అక్కడ ఈదుతూ కనువిందు చేయడానికి ఉత్తమ జాతి బాతులు. అవసరమైతే మానస సరోవరం నుంచి హంసలను తెప్పిస్తాం. దీన్నొక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. హంసలు వచ్చే దాకా నేను నిద్రపోను. మిమ్మల్ని నిద్రపోనివ్వను.

 

ఇంకో నగరాన్ని కాలువల నగరంగా తీర్చిదిద్దుతాం. చుట్టూ ఉద్యానవనాలు, అద్దరి ఇద్దరి షాపింగ్ మాల్స్‌తో కాశ్మీర్‌ని మరిపించే విధంగా ముందుకు పోతాం’’- అన్నప్పుడు జనం చప్పట్లు కొట్టారు. ‘‘అమరావతి దగ్గర్లో తెనాలి వుంది. అక్కడ ఊరు మధ్య నుంచి మూడు కాలువలు ప్రవహిస్తూ వుంటాయండీ. అయితే వాటి పక్కన వెళ్లేవారంతా చచ్చినట్లు ముక్కులు మూసుకుని ధ్యానం చేస్తూ వెళ్లాల్సిందే’’  అంటూ ఒక పెద్దా యన గొంతెత్తి అరిచాడు. ‘‘పాతవాటితో మనకు పనిలేదు. మళ్లీ కాలువలు తవ్వుకుందాం. అవసరమైతే కొత్త నీటిని తీసుకొస్తాం. దేనికీ వెనకాడే పనిలేదు. ఇకపై కశ్మీర్‌లో పర్యాటకులు కనిపించరని కూడా మీకు హామీ యిస్తున్నాను.’’

రోజూ పత్రికల పతాక శీర్షికలు దాదాపు ఇలాంటి వార్తలతోనే వస్తున్నాయి. నిజానికి వార్తలు కావివి, ప్రకటనలు. మునుపు ఎన్నికల తరుణంలో మాత్రమే విన్పించే వాగ్దానాలు యిప్పుడు రోజూ రెండు పూటలా వినిపి స్తున్నాయి. నిజానికి ఇలాంటి కబుర్లని కబుర్లుగా, ఆలోచనలుగా, ఊహలుగా స్పష్టంగా పేర్కొనాలి. నాయకులు, ఉపనాయకులు వారి వారి ఆలోచనల్ని ప్రారంభించిన పథకాల్లా ప్రకటిస్తే మీడియా అచ్చు వేయకూడదు. పూర్తయిన రోడ్లు, కట్టిన వంతెనలు, తవ్విన చెరువుల గురించి మాత్రమే సచిత్రంగా ప్రచురించాలి. బాబోయ్! ఎన్ని మాటలు! ఎన్ని ఊహలు! ఎన్ని కోట్లు! ఒక్కసారి వెనక్కి వెళదాం. గడచిన సంవత్సరంలో తెలుగు నేతలు ఉదారంగా వివిధ అభివృద్ధి పనులకు, సుందరీకరణకు, ఇంకా చెత్తాచెదారానికి ఖర్చు చేస్తామన్నది ఎన్ని లక్షల కోట్లు ఉంటుందో ఒక్కసారి గణాంకాలు చూడండి. నాలుగు సంవత్సరాల బడ్జెట్ మొత్తానికి మించే ఉం టుంది. దీనికో ఆనకట్ట ఉండాలి. అధికారంలో ఉన్న నేతల మాటల్లోని అంకెలను అప్ప టికప్పుడు విడగొట్టి ఒకచోట చేర్చాలి.

రోజూ ఆ సంఖ్యని వివిధ మాధ్యమాలలో చూపాలి. ఫలానివారు స్కోరు మైనస్ ఇన్ని కోట్లు అని. అప్పుడైనా కనీసం ఆచితూచి మాట్లాడతారని అనుకుంటే అదీ భ్రమే అవచ్చు. రాజకీయం ఏదైనా చేయిస్తుంది. ఆఖరికి ప్రజాసేవకి కూడా ఒడి గట్టిస్తుందని సామెత వుంది. ఇప్పుడు మైనస్ స్కోరుని వారు ప్లస్ పాయింట్‌గా వాడుకోవచ్చు. ‘‘నేను శతకోటి పథకాలను మీ కోసం సిద్ధం చేశా. కాని పైవారు, కిందివారు, ప్రతిపక్షాలు సహకరించడం లేదు’’ అనేస్తే, ఇంకేమీ అనలేరు, చెయ్యలేరు. ఆధునిక టెక్నా లజీ నిర్దిష్టంగా లెక్కలు వేసి, ఏ గంటకాగంట గ్రాండ్ టోటల్‌ని చూపించగలదు. కాని నేతల ప్రతిష్టను దెబ్బతియ్యలేదు. ఓటర్ల జాతకాలను బాగుచెయ్యలేదు. ఓటర్లెప్పుడూ నాయనమ్మ పిల్లలే!

  
శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Advertisement
Advertisement