-
పాపం ప్రేమ
మార్గరెట్ మృత్యుశయ్య మీద వుంది. ఆమె వయస్సు 56 సంవత్సరాలే ఐనా, కనీసం డెబ్భై ఐదు సంవత్సరాల దానివలె కనిపిస్తోంది. దగ్గుతెరల్తో మెలికలు తిరుగుతూ, వూపిరి పీల్చుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఆమె అక్క సుజన్నీ ఆమెకన్న 6 సంవత్సరాలు పెద్దది. పొంగిపొరలే దుఃఖంతో చెల్లెలి పక్కమీద కూర్చున్నది. పక్కనేవున్న టేబుల్ మీద రెండు మైనపువొత్తులు వెలుగుతూన్నవి. మందుసీసాలు గదిలో చెల్లాచెదురుగా పడివున్నవి. మృత్యుదేవత తన విశాల పక్షాలను గదినంతటనూ పరిచి, వేచివున్నట్లే తోస్తుంది. యీ అక్క చెల్లెళ్ల కథ హృదయ విదారకమైనది. పెద్దామె సుజన్నీ ఒక యువకుని తన నాశనాన్ని కూడా లెక్క చెయ్యకుండా ప్రేమించింది. కాని ఆ ప్రియుడు హఠాత్తుగా మరణించాడు. సుజన్నీ దుఃఖసముద్రంలో మునిగి, తను జీవితంలో వివాహమాడనని శపథం చేసింది. విధవ వలెనే దుస్తులు ధరించి, విధవరికాన్ని భరిస్తూన్నట్లే బతికింది. ఒకనాటి ఉదయం పన్నెండు వసంతాల్ని మాత్రం ఎరిగిన మార్గరెట్ వచ్చి, అక్కను కావలించుకుని ఇలా అంది: ‘అక్కా! నీవు సుఖపడటం లేదని నాకెంతో విచారంగా వుంది. నీకు తోడునీడగా జీవితమంతా వెళ్లబుచ్చుతాను. నేను కూడా జీవితంలో వివాహమాడను.’ చెల్లెలి శపథం మీద సుజన్నీకి నమ్మకం లేకపోయినా, ఆమె కనబరిచిన ఆపేక్షకు చెల్లెల్ని కావలించుకుంది. తల్లిదండ్రులూ, అక్కా ఎంతమంది ఎంతదూరం బతిమాలినా మార్గరెట్ తనకు వరులుగా వొచ్చినవారందర్నీ తిరస్కరించింది. ∙∙l జీవితమంతా ఆ అక్కచెల్లెళ్లు కలిసే వున్నారు. మార్గరెట్ ఎప్పుడూ కుంగిపోయి ఉంటూండేది; తన కొరకై త్యాగం చేయటం వల్లనేమో సుజన్నీ చెల్లెలి కన్నా బాధపడుతున్నట్లు కనిపించేది. మార్గరెట్ మీద కాలం తన ప్రభావాన్ని ఘోరంగా చూపింది. అక్క కన్నా త్వరలోనే ముసలితనం ఆమెను ఆవరించింది. 30 సంవత్సరాలకే వెంట్రుకలు తెల్లబడినవి. ఏదో నిగూఢవ్యాధి ఆమెను తినేస్తోందనిపిస్తుంది. గత 24 గంటల్లో ఆమె మాట్లాడిన మాటలు ఇవి: ‘నా అంతం దగ్గర పడుతోంది; మతబోధకుని కోసం కబురంపు.’ ఆమె వెల్లకిలా పడుకుంది. దగ్గుతెరలతో గిలగిలలాడుతోంది. హృదయంలోని భయాన్ని దేన్నో తప్పించుకొని బైటపడేందుకు మాటలు పెదవుల దాకా వొచ్చి ఆగిపోతూన్నవి. ఆమె స్థితి జాలిని కలిగిస్తోంది. ఆమె అక్క ‘మార్గరెట్! తల్లీ’ అని వెక్కివెక్కి ఏడుస్తోంది. ఆమె మార్గరెట్‌ను ఎప్పుడూ ‘తల్లీ’ అని పిలిచేది; మార్గరెట్ మాత్రం ‘అక్కా!’ అనేది. మేడమెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించింది; ముసలి మతబోధకుడు తలుపు తెరుచుకొని ప్రవేశించాడు. అతణ్ని చూడగానే మార్గరెట్ ఎలాగో లేచి కూర్చుని, ఏదో గొణుక్కుని, పక్కబట్టల్ని పిచ్చిగా మెలిపెట్ట సాగింది. మతబోధకుడు ఆమె ఫాలభాగం మీద ముద్దు పెట్టుకుంటూ ‘‘అమ్మాయీ! భగవానుడు నిన్ను తప్పక క్షమిస్తాడు. ధైర్యంతో వుండు’’ అన్నాడు. ఆమె ఆపాదమస్తకమూ వొణికింది. ఇందుకు లయగా మంచమే వూగింది. పూడిపోయిన గొంతును బలవంతాన స్వాధీనంలోకి తెచ్చుకొని ‘‘అక్కా! కూర్చొని విను’’ అంది. మతబోధకుడు సుజన్నీని పక్కనేవున్న కుర్చీలో కూర్చోబెట్టాడు. మార్గరెట్ మాటలు ఒక్కొక్కటిగా దొళ్లసాగినవి. ‘‘అక్కా! నన్ను క్షమించు. నీ క్షమను వేడుకునేందుకు తగిన అవకాశం కోసం జీవితమంతా వేచివున్నాను. అది యీనాటికి లభించింది’’. సుజన్నీ కన్నీళ్ల మధ్య ‘‘నేను క్షమించటమేమిటి తల్లీ? నాకోసం నీవు సర్వస్వాన్నీ త్యాగం చేశావు. నీవు దేవకన్యవు’’ అంది. అక్క మాటలకు మార్గరెట్ అడ్డుపడుతూ, ‘‘కాదు... నన్ను మాట్లాడనీ. నిజం చెప్పనీ... హెన్రీ... హెన్రీ నీకు జ్ఞాపకమే కదూ? ‘‘యీ కథంతా వింటేనేకాని నీకు అర్థం కాదు. అప్పుడు నా వయస్సు 12 సంవత్సరాలే... నీకు గుర్తుంది కదూ? మనసుకు తోచిందల్లా చేసేదాన్ని. నేను ఎందుకు చెడిపోయినావని నీవు అడగొచ్చు... విను. మొదటిసారి హెన్రీ మన ఇంటికి వొచ్చినప్పుడు గుర్రపుస్వారీకి ఉపయోగపడే బూట్సు వేసుకొచ్చాడు. మెట్ల దగ్గిర గుర్రం దిగి, తన దుస్తుల విషయం క్షమించమన్నాడు. నాన్నగారికి ఏవో వార్తల్ని అతను తీసుకొచ్చాడు. హెన్రీని చూడగానే నా హృదయం స్వాధీనం తప్పిపోయింది. నాన్నగారితో అతను మాట్లాడుతూన్నంతసేపూ, నేను గదిమూలలో నిలబడి అతణ్ని తదేకంగా చూడసాగాను. ఆనాటినుంచీ అతణ్ని గూర్చి ఎన్నో కలలు కంటూండేదాన్ని. అతను మళ్లీ మళ్లీ రాసాగాడు. చూపులదాహం తీర్చుకునేదాన్ని. ప్రణయం శరీరాన్ని మించి ఆత్మవరకూ వెళ్లింది. వయస్సుకు తక్కువైనా వూహలకు పెద్దదాన్నే. అందరూ అనుకున్నంత అమాయకురాల్ని కాదు; జిత్తులమారిదాన్ని కూడాను. ‘‘ఆ తరువాత అతను నిన్ను వివాహమాడుతాడని విన్నాను. అది నా హృదయాన్ని ముక్కలు చేసేసింది. మూడు రాత్రులవరకూ నిద్ర లేకుండా, తెల్లవార్లూ ఏడుస్తూనే వున్నాను. అతను ప్రతి మధ్యాహ్నమూ భోజనమయ్యాక వొస్తుండేవాడు... నీకు జ్ఞాపకం వుంది కదూ... ఉష్ మాట్లాడకు... అతని కోసం నీవు వెన్న పూసిన కేకుల్ని చేసేదానివి. యీనాడు మళ్లీ వాటిని చేయాలంటే నేను చేయగలను. కేకు కాస్త కొరికి కొంచెం వైన్ తాగి ‘ఎంత మధురంగా వుంది!’ అంటూండేవాడు. ఎలా అనేవాడో నీకు గుర్తుంది కదూ? ‘‘నాలో ద్వేషం... ద్వేషాగ్ని ప్రజ్వరిల్ల సాగింది. నీ వివాహం దగ్గర పడుతోంది; ఇంకా రెండు వారాలే వుంది. నాకు పిచ్చెక్కినట్లయింది. అతను నిన్ను ఎప్పటికీ పెళ్లాడకుండా చేయాలని శపథం చేశాను. నేను పెద్దదాన్నయాక అతను నన్నే పెళ్లాడాలి.‘‘ఒకనాటి రాత్రి ఇంటిముందు అతనితో నీవు వెన్నెల్లో పచార్లు చేస్తున్నావు... దూరంగావున్న పైన్ చెట్టు కింద అతను నిన్ను తన చేతుల్లోకి లాక్కున్నాడు. నీవు అదంతా మరిచిపోలేదనుకుంటాను. ఆ సంఘటన అయాక, నీవు వెలవెలబోతూ గదిలోకి వొచ్చావు. నేను చాటుగా చూస్తూనే వున్నాను. నేను కోపంతో వొణికి పోతున్నాను. ఆ కోపజ్వాలలో మీరిద్దరూ మసి కావలసింది. అతను నన్ను తప్ప ఇంకెవర్ని వివాహమాడినా భరించలేను... కాని యీ క్షణంలో అతనంటే నాకు పరమ అసహ్యం కలిగింది. ‘‘నేనేం చేశానో తెలుసా? విను. తోటమాలి పిచ్చికుక్కల్ని చంపేందుకు మాంసంలో విషం కలపటం చూశాను. యీ విధానం నాకు నచ్చింది. ఒక సీసాను పగలగొట్టి మెత్తగా నూరివుంచాను. ఆ పొట్లం విప్పితే గాజుపొడి తళతళా మెరిసేది. మర్నాడు నీవు కేకుల్ని చేశాక, వాటిని జాగర్తగా కత్తితో చీల్చి యీ గాజుపొడి వేసి, మళ్లీ అతికించాను. అతడు మూడు కేకుల్ని తిన్నాడు. నేను ఒకటి తిన్నాను. ఇంకా మిగిలిన ఆరింటిని కొలనులో పారేశాను. మూడు రోజుల తర్వాత, కొలనులో యీదే రెండుబాతులూ చచ్చినవి... ‘‘నన్ను చెప్పనీ. ఆ కేకుల్ని తిన్నవాళ్లందరూ చచ్చారు; నేనుమాత్రం చావలేదు. మోతాదు సరిపోయివుండదు. ఆనాటినుంచే నా ఆరోగ్యం చెడింది. చచ్చిన హెన్రీ విషయం కాదు. కాని ఆనాటినుంచీ పిశాచునివలె అతను వెన్నాడుతూనే వున్నాడు.‘‘నా మనస్సులో యీ దుర్మార్గమంతా కరుడుకట్టి నన్ను జీవితమంతా బాధిస్తూనేవుంది. అక్కా! అది ఎంత ఘోరమో, ఎంత విషాదమో, ఎంత బాధో చెప్పలేను. మేల్కొనివున్న ప్రతి నిమిషంలోనూ చావబొయ్యే ముందు నీకీ సంగతులన్నీ చెప్పాలనే మాట జ్ఞాపకం చేసుకుంటూ వుండేదాన్ని. ఇప్పుడు నా హృదయం తేలికయింది. అక్కా! నేను నైతికంగా భయపడిపొయ్యాను. చనిపొయ్యాక అతణ్ని చూడటం తటస్థ పడుతుందనుకో... అతణ్ని చూడగలగటం అంటే– దాన్ని నీవు వూహించుకోగలవా? నాకు ముఖం చెల్లదు. నేను చనిపోబోతున్నాను. అక్కా! నాకు క్షమాభిక్ష ఇవ్వు. నీ క్షమ లేనిదే నేను అతణ్ని చూడలేను. ఫాదర్! మా అక్క చేత నాకు క్షమ ఇప్పించమని వేడుకుంటున్నాను. ఆమె క్షమించనిదే నేను చావలేను.’’భరించలేని నిశ్శబ్దం గదిని ఆవరించింది. మార్గరెట్ వూపిరి కోసం పెనుగులాడుతూ దుప్పటిని మెలి పెడుతోంది. సుజన్నీ తన ముఖాన్ని అరచేతుల్లో దాచుకొని కదలక మెదలక ఉండిపోయింది. ఆ వివాహమే ఐనట్లయితే తనెంత సుఖపడి ఉండేది! కాలంలోకి ఆమె మనస్సు వేగంగా వెనక్కు పరుగెత్తుతోంది. అతని నుంచి ఆమె పొందిన ఆ ముద్దు! ఆ ఒక్క ముద్దు తాలూకు మాధుర్యమే ఇన్నేళ్లపాటూ తనను బతికించగలిగింది. దాని తాలూకు జ్ఞాపకాన్నే ఆమె హృదయాంతరాళంలో దాచుకొంది. ఆ తరువాత– ఏం లేదు. మరెన్నడూ ఏం లేదు. అంతే! మతబోధకుడు లేచి నిలబడి, ఆజ్ఞాపూరిత స్వరంతో ‘సుజన్నీ! నీ చెల్లెలు చావబోతోంది’ అన్నాడు. సుజన్నీ కన్నీటితో తడిసిన తన ముఖం నుంచి చేతుల్ని తీసేసింది. చెల్లెల్ని ఆదరణతో, అభిమానంతో, అనురాగంతో కావలించుకొని ముద్దు పెట్టుకుంది.‘తల్లీ! నిన్ను క్షమించాను; హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను’ అందా అక్క. ఒక ముద్దు అక్కను జీవితకాలం బతికించగలిగినప్పుడు, అదే ముద్దు పాపభీతితో మృత్యుముఖంలోవున్న చెల్లి మనసును తేలిక చేయలేదా? ప్రేమ గొప్పతనాన్నీ, ప్రేమ రూపంలోని క్షమ గొప్పతనాన్నీ తెలియజేసే కథ ఇది. రచయిత మొపాసా (1850–1893). ఈ ఫ్రెంచ్ కథను ‘చేసిన పాపం’గా, ఇంద్రజిత్ కలంపేరుతో తెలుగులోకి అనువదించింది ధనికొండ హనుమంతరావు. సంక్షిప్తం: సాహిత్యం డెస్క్. -
గై డి మొపాస గెడైవ్వరు?
సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం ఆధునిక కథా రచయితలు గురువుగా భావించే ఫ్రెంచ్ రచయిత గై డి మొపాసాకు గురువు గుస్తావ్ ఫ్లోబేర్(Flaubert). మొపాసని తన ప్రియశిష్యుడిగా ప్రకటించుకున్న ఫ్లోబేర్, అనేక సందర్భాలలో కథారచన గురించిన మెళకువలు చెప్పాడు. అవన్నీ మొపాస తన తల్లికి రాసుకున్న ఉత్తరాల్లో నిక్షిప్తమై వున్నాయి. మొదట్లో మొపాస కవిత్వం రాశాడు. అది చదివి ఫ్లోబేర్- 'నీ దగ్గర కవి అయ్యే ప్రతిభ వుందా అని అడిగితే చెప్పలేను. కానీ నువ్వు నాకు చూపించిన దాంట్లో కొంత తెలివి కనపడుతోంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, సుదీర్ఘమైన ఓర్పు నుంచే ప్రతిభ వస్తుంది, రాస్తూనే వుండు.'అన్నాడు. మరో సందర్భంలో, ఫ్లోబేర్ తనకు చెప్పిన సంగతులను మొపాస మరో లేఖలో ఇలా పేర్కొన్నాడు: 'నువ్వు చెప్పాలనుకుంటున్న విషయం మీద తదేక దృష్టి నిలపాలి. చాలా కాలం అదే ఊహించాలి. అప్పుడు కానీ ఆ వస్తువు గురించి ఇంతవరకూ ఎవరూ చెప్పని కొత్తకోణం బయటపడదు. అతి సూక్ష్మమైన వస్తువులో కూడా కనిపెట్టబడని మరో పార్శ్వం వుంటుంది. అదేంటో కనుక్కోవాలి. మండుతున్న అగ్గి అయినా, అడవిలో మాను అయినా దానిని మన కళ్ళ ముందు నిలబెట్టుకోవాలి. వాటినే చూడాలి. ఆ మంట మరే మంటను పోలనంతవరకూ, ఆ చెట్టు మరింకే చెట్టులా అనిపించనంతవరకూ చూడాలి. ఒరిజినాలిటీని తీసుకురావాలంటే ఇదే మార్గం. ఈ విషయం ఫ్లోబేర్ పదే పదే చెప్పేవారు. 'ఈ ప్రపంచంలో ఏ రెండు వస్తువులు - అవి రెండు ఇసుక రేణువులైనా, రెండు ఈగలైనా, రెండు చేతులైనా, రెండు ముక్కులైనా - ఏవీ ఒకేలా ఉండవు. నువ్వు అలా నడుస్తూ ఓ అంగట్లో సరుకులను అమ్మే వర్తకుణ్ణి చూశావనుకో, లేకపోతే ఏదైనా హోటల్ బయట పైప్ కాలుస్తున్న కేర్ టేకర్‌ని చూశావనుకో, నాకు వాళ్ళని నీ వాక్యాలతో చూపించు. వాళ్ళు ఎలా కూర్చున్నారు? లేకపోతే ఎలా నిల్చున్నారు? వాళ్ళ శరీర భాష మొత్తం అర్థం అయ్యేలా చెప్పు. నీ పనితనం తెలిసేలా వాళ్ళ మనసులో వుండే అభిప్రాయాలని, లక్షణాలని కూడా వర్ణించు. కానీ, నువ్వు చెప్పే వ్యక్తే నాకు కనపడాలి. సరుకులు అమ్ముతున్న మరో వ్యక్తిని నేను చూసినా, అది అతను కాదని నేనే తెలుసుకునేలా చెయ్యి. నువ్వు చెప్పిన కేర్ టేకర్ లాంటి వాళ్ళు మరో యాభై మంది నాకు తెలిసినా, అతను నాకు వాళ్ళలో ఎవడో ఒకడులే అని అనిపించకూడదు. అతనే కనిపించాలి. నువ్వు వాళ్ళ గురించి చెప్పాల్సినదంతా మూడు పదాలలో అయిపోతుంది. ఒక నామవాచకం పరిచయం చేస్తుంది. ఒక క్రియాపదం కదిలిస్తుంది. ఒక విశేషణం వర్ణిస్తుంది. నువ్వు ఆ మూడు పదాలని- నామవాచకం, క్రియాపదం, విశేషణం- ఈ మూడింటిని దొరకబుచ్చు కోవాలి. అక్షరాలా అతణ్ని మాత్రమే వర్ణించే ఆ మూడు పదాలనే పట్టుకోవాలి. వాటికి దగ్గరగా వున్న పదంతో సర్దుకోకూడదు. వర్ణించడం కష్టమౌతోందని సులభమైన మాటల గారడీలు చెయ్యకూడదు.' ఫ్లోబేర్, మొపాస మధ్య కూడా తరచుగా ఉత్తర సంభాషణ జరుగుతుండేది. అలాంటి ఉత్తరాలలో కూడ శిష్యుణ్ణి ఉత్తమ రచయితగా నిలబెట్టాలన్న ఫ్లోబేర్ తాపత్రయం కనపడుతుంది. 'ఒంటరిగా పని చెయ్యి. ఒక పని చాలా కాలం చెయ్యి. ప్రతిఫలం కోసం కాదు, ప్రచురించడం కోసమూ కాదు. నేనలాగే చేశాను. అందుకే నాకు ముప్పై ఏడేళ్ళు వచ్చేదాకా 'మదాం బోవరీ' ముద్రించలేదు. నువ్వు చేస్తున్న పని నుంచి ఏదైనా లాభాన్ని ఆశించడం మొదలుపెట్టిన మరుక్షణం ఆ పనికి విలువ లేకుండాపోతుంది. కళలో కళని మాత్రమే చూడాలి. నీ కోసం దాన్ని సాధించుకోవాలి. మిగిలినవన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. అలాగని సాహిత్యకారుడి జీవితమంతా పూలబాట అనుకోకు. మళ్ళీ చెప్తున్నాను. నీకు నిజంగా సాహిత్యం మీద ప్రేమ వుంటే, నీ కోసం నువ్వు రాసుకో' మొపాస కథల్లో కనిపించే విషాదం ఆయన జీవితంలోనూ వుంది. ముఖ్యంగా ఒంటరితనం, అనారోగ్యం, ప్యారిస్ మహానగరపు ఇరుకుల్లో ఇమడలేనితనం. ఆ విషాదాన్నంతా ఫ్లోబేర్ దగ్గర వెళ్ళగక్కాడు మొపాస. 'ఏం చెప్పేది మాస్టర్? ఇక్కడేమీ బాలేదు. అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఉద్యోగం నాకు పిచ్చెక్కిస్తోంది. పని చెయ్యలేకపోతున్నాను. అక్షరం రాయలేకపోతున్నాను. రాసేది నచ్చటంలేదు. ప్రతిరోజూ పడుకునే ముందు- హమ్మయ్య ఇంకో రోజు అయిపోయిందని సంతోషపడుతున్నాను' మొపాస బాధని అర్థం చేసుకున్న ఫ్లోబేర్ దానికి జవాబు ఇలా రాశాడు: 'నీ ఉత్తరం చూసి చాలా సంతోషించాను. నీ కష్టం కూడా అర్థమైంది. కానీ నువ్వు సృష్టించబోయే సాహిత్యం కోసమైనా నువ్వు తట్టుకుని నిలబడాలి. నువ్వు సాధించాలనుకున్న ఆశయం గొప్పదైతే, నువ్వు నడవాల్సిన దారి దానికదే ఏర్పడుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో- ఒక కళాకారుడిగా బతకాలని నిర్ణయించుకున్న తరువాత సాధారణ ప్రజల్లా జీవించే హక్కుని ఆ వ్యక్తి కోల్పోతాడు' గురువు చెప్పిన మాటల మీద మొపాస గురి కుదుర్చుకున్నాడు. కొన్ని తరాల తర్వాత కూడా అబ్బురంతో గుర్తుచేసుకునే సాహిత్యాన్ని సృజించాడు. ఆధునిక కథకులెందరికో గురువుగా నిలిచాడు. అరిపిరాల సత్యప్రసాద్ 9966907771
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement