దళిత, గిరిజనులను మోసం చేసిన కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

దళిత, గిరిజనులను మోసం చేసిన కేసీఆర్‌

Published Tue, Jun 27 2023 12:32 AM

 సమావేశంలో మాట్లాడుతున్న అన్వేశ్‌రెడ్డి - Sakshi

కడెం: సీఎం కేసీఆర్‌ దళిత, గిరిజనులను మోసం చేశారని కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుంకెట అన్వేశ్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని కొండుకూర్‌ గ్రామంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఉట్నూర్‌ జెడ్పీటీసీ, పీసీసీ సభ్యురాలు రాథోడ్‌ చారులత ఆధ్వర్యంలో సోమవారం దళిత, గిరిజన ఆత్మ గౌరవసభ నిర్వహించారు. ముఖ్య అథితిగా అన్వేశ్‌రెడ్డి హాజరయ్యారు. దళితబంధు పేరుతో లబ్ధిదారుల నుంచి కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు మూడు లక్షల వరకు వసూలు చేశారన్నారు. దళితులకు మూడెకరాల భూమి అని కొంతమందికి ఇచ్చి హామీని మరిచారన్నారు. ఇప్పటి వరకు ఖానాపూర్‌ నియోజవర్గంలో ఒక్క డబుల్‌బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్‌ హాయంలో ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టి గూడులేని ఎంతో మంది నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి సాయం అందించారని అన్నారు.

గతేడాది కడెం ప్రాజెక్ట్‌ నుంచి వచ్చిన భారీ వరదలతో ఎంతో మంది రైతుల భూములు, పంటలు నష్టపోయినా ప్రభుత్వం సాయం అందించకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. వరంగల్‌ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, ధరణి పోర్టల్‌ రద్దు, కిసాన్‌ కమిషన్‌ ఏర్పాటు, వ్యవసాయానికి ఉపాధిహామీ పథకం వర్తింపు, పోడు, అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు, కౌలు రైతులకు రూ.15 వేలు, భూమిలేని ఉపాధిహామీ కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం, భూమిలేని రైతులకు రైతుబీమా వర్తింపు, రూ.500లకే సిలిండర్‌, తదితర పథకాలను అమలు చేస్తామని వివరించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భరత్‌చౌహాన్‌, ఎల్‌డీఎం(లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌) పార్లమెంట్‌ ఇన్‌చార్జి రఘునాథరెడ్డి, నియోజవర్గ ఇన్‌చార్జి సత్యనారయణ, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, మహిళ విభాగం జిల్లా ఉపాధ్యాక్షురాలు గీతారెడ్డి, జిల్లా నాయకులు మల్లారెడ్డి, శంతన్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి, ప్రభాకర్‌, బాపురావు, సత్యం, వెంకటేశ్‌, సలీం, రహీం, శంకర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement