కురిసింది వాన.. జిల్లా అంతటా వర్షాలు అన్నదాతల్లో హర్షం | Sakshi
Sakshi News home page

కురిసింది వాన..జిల్లా అంతటా వర్షాలు అన్నదాతల్లో హర్షం

Published Tue, Jun 27 2023 12:32 AM

- - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: రుతుపవనాల రాకతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు జిల్లాలో ఓ మోస్తారు నుంచి సాధారణ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. విత్తనాలు విత్తుకునే అదను దాటుతున్నా వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమైంది. గతేడాది ఇప్పటికే విత్తనాలు విత్తుకోగా, ఈసారి కనీసం 20 శాతం కూడా రైతులు విత్తనాలు వేసుకోలేదు. పత్తి పంట విత్తుకునేందుకు జూలై రెండో వారం వరకు, సోయా పంట వేసుకునేందుకు జూలై మొదటి వారం వరకు గడువు ఉందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇన్నిరోజుల పాటు తీవ్ర ఉక్కపోతకు గురైన జిల్లా వాసులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఉపశమనం పొందారు.

జిల్లా అంతటా వర్షాలు..
ఇచ్చోడలో 56.0 మి.మీ, బజార్‌హత్నూర్‌లో 34.3 మి.మీ, నార్నూర్‌లో 39.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ ఏడాది సగటున 1,100 మి.మీ.లు కురువాల్సి ఉంది. జూన్‌కు సంబంధించి 190 మి.మీ.లు కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 29 నుంచి 35 మి.మీ.ల వర్షం కురిసిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా 87 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం ఉందని పేర్కొంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవనాలతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

తడిసి ముద్ద..
ఆదిలాబాద్‌ పట్టణంలో ఆదివారం రాత్రి నుంచి వర్షం కురువడంతో పట్టణమంతా తడిసి ముద్దయ్యింది. జనాలు వర్షంలో తడుస్తూ వెళ్లాల్సి వచ్చింది. ద్విచక్ర వాహనాలపై ఆయా పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు తడుస్తూ వెళ్లగా మరికొంతమంది రెయిన్‌ కోట్‌లు ధరించి వెళ్లారు.

1/1

Advertisement
Advertisement