కోలుకుంటున్న రాకేశ్‌.. | Sakshi
Sakshi News home page

కోలుకుంటున్న రాకేశ్‌..

Published Sun, Jan 21 2024 11:56 PM

కోలుకుంటున్న రాకేశ్‌ను పరామర్శిస్తున్నబ్లడ్‌డోనర్‌ గ్రూప్‌ అడ్మిన్‌ సురేశ్‌ - Sakshi

భైంసాటౌన్‌: పట్టణంలోని కిసాన్‌గల్లికి చెందిన రాకేశ్‌(రోబో) ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. మెదడులో పలుచోట్ల రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు ఆపరేషన్‌ చేయాలని, అందుకు రూ.8లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో బాధితుడి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో ఈనెల 1న ‘ఆపన్నహస్తం అందించరూ’ అన్న శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన దాతలు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా తోచిన సహాయం అందజేశారు. వైద్యులు ఆపరేషన్‌ చేయడంతో ప్రస్తుతం రాకేశ్‌ కోలుకుంటున్నాడు. తనకు ఆర్థికసహాయం అందించి ఆదుకున్న దాతలకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఆదర్శంగా నిలుస్తున్న యువత..
సాటి మనిషికి ఏమైతే మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు భైంసాకు చెందిన కొందరు యువకులు. ఆపద ఏదైనా తామున్నామంటూ అండగా నిలబడుతున్నారు. వారు చేసేది చిన్నపాటి ఉద్యోగాలే అయినా.. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి సైతం అంతంతమాత్రమే అయినా సాటిమనిషిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటున్నారు. వారే భైంసాకు చెందిన బ్లడ్‌ డోనర్స్‌, అయోధ్యభారతి గ్రూప్‌ సభ్యులు రాకేశ్‌ స్నేహితులు అతనికి సాయం చేయాలనే ఉద్దేశంతో విరాళాల సేకరణకు విస్తృతంగా కృషి చేశారు. సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కోరారు. దీంతో దాతలు స్పందించి ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా ఆర్థికసహాయం అందజేశారు. పట్టణంలోని ప్రముఖులు, వైద్యులను కలిసి రూ.6 లక్షల వరకు విరాళాలు సేకరించి బాధిత కుటుంబానికి అందజేశారు. దీంతో ప్రస్తుతం రాకేశ్‌ కోలుకోగా, వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆపదలో అండగా నిలిచిన బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌ అడ్మిన్‌ సురేశ్‌తో పాటు అయోధ్య భారతి సేవా టీం సభ్యులను పలువురు అభినందిస్తున్నారు.

Advertisement
Advertisement