ఏపీ పథకాల వైపే అందరి అడుగులు | Sakshi
Sakshi News home page

ఏపీ పథకాల వైపే అందరి అడుగులు

Published Sun, May 1 2022 3:18 AM

Andhra Pradesh Village Secretariat system attracting other states - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఏపీని సందర్శించి ఆయా పథకాలు అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేసి వెళ్లాయి. ఆయా రాష్ట్రాల్లో కూడా అమల్లోకి తెస్తున్నాయి. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మెచ్చుకోవడమే కాకుండా ఆ రాష్ట్రంలోనూ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇదే కోవలో ఏపీలో అమలవుతున్న బైలింగ్వల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ (ద్విభాషా పాఠ్యపుస్తకాలు)ను మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించడానికి సిద్ధమైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ద్విభాషా పాఠ్య పుస్తకాలను తమ రాష్ట్రంలోని పాఠశాలల పిల్లలకు పంపిణీ చేయనున్నట్లు మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌ ఇటీవల వారి అసెంబ్లీలో ప్రకటించారు.

ఏపీలో ఇంతకు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం మాత్రమే అమల్లో ఉండేది. దీంతో ఆ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఉన్నత విద్యలో, ఉద్యోగావకాశాల్లో వెనుకబాటుకు గురయ్యేవారు. ఆంగ్ల భాష పరిజ్ఞానం లేనందున ఆయా సంస్థలు వీరివైపు దృష్టి సారించేవి కావు. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలోని పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. ఈ తరుణంలో సీఎం వైఎస్‌ జగన్‌.. దూర దృష్టితో ఆలోచించి, ప్రభుత్వ స్కూళ్లన్నింటిలో ఆంగ్ల మాధ్యమానికి శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ కింద అందించే కిట్లలో డిక్షనరీని కూడా చేర్పించారు.

ఆంగ్ల భాషా పదాలు సులభంగా అర్థమవ్వడంతో పాటు ఆ సబ్జెక్టు అంశాలను విద్యార్థులు సంపూర్ణంగా అవగాహన చేసుకొనేందుకు తెలుగు మాధ్యమంలో కూడా అవే పాఠాలు ఒకే పుస్తకంలో అందేలా ఏర్పాట్లు చేయించారు. టెక్టŠస్‌ పుస్తకంలో పాఠ్యాంశం ఒక పేజీలో ఆంగ్లంలో, మరోవైపు తెలుగులో (మిర్రర్‌ ఇమేజ్‌) ఉండేలా ఈ పుస్తకాలను తీర్చిదిద్దారు. ఇవి విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా మారాయి. పాఠ్య పుస్తకాలు తక్కువ బరువుతో ఉండేలా ఇంజనీరింగ్, డిగ్రీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో మాదిరిగా పాఠశాల స్థాయిలోనూ సెమిస్టర్‌ విధానంలో ముద్రించి ఇస్తున్నారు. 2020–21లో ఒకటి నుంచి 6వ తరగతి వరకు, 2021–22లో ఏడవ తరగతి వరకు ద్విభాషా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం (2022–23)లో 8వ తరగతి విద్యార్థులకు కూడా అందించనున్నారు.  

డిగ్రీలోనూ ద్విభాషా పాఠ్య పుస్తకాలు 
రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్విభాషా (ఇంగ్లిష్‌–తెలుగు) పాఠ్య పుస్తక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కోర్సులకు సంబంధించి మొత్తం 13 సబ్జెక్టుల్లో ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మొదటి సెమిస్టర్‌ పుస్తకాలను ఈ విధానంలో ముద్రించారు.

మన నాడు–నేడుపై తెలంగాణ మక్కువ
పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రంలో మనబడి నాడు–నేడు పథకాన్ని ప్రారంభించారు. తద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగు పడడమే కాకుండా, సర్వాంగ సుందరంగా రూపురేఖలు మార్చుకున్నాయి. ఈ పథకాన్ని ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ అనుసరిస్తోంది.

ఈ పథకానికి వినియోగించిన సాఫ్ట్‌వేర్‌ ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అందించాలని ఆ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఏపీ ప్రధాన కార్యదర్శికి కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. ఏపీ ఆ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణకు అందించడమే కాకుండా ఇతరత్రా సహకారం అందించేలా సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. ఈ ఏడాది మార్చి 22న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మన ఊరు – మనబడి పేరుతో వనపర్తి జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పథకాన్ని ప్రారంభించారు. 26,065 స్కూళ్లలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

నాడు–నేడుతో మహర్దశ
రాష్ట్రంలో నాడు–నేడు కింద రూ.16,450.69 కోట్లతో 61,661 స్కూళ్ల రూపు రేఖల మార్పునకు ప్రణాళిక రూపొందించారు. తొలిదశలో 15,713 స్కూళ్లను రూ.3,697.86 కోట్లతో సర్వాంగ సుందంగా తీర్చిదిద్దారు. మిగతా వాటిలో రెండో దశ కింద పనులు చేపట్టారు. మొత్తంగా ఈ పథకం కింద పనులు చేపట్టనున్న  స్కూళ్లు, వ్యయం వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement
Advertisement