డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న చోట సమాంతరంగా మరో వాల్‌ | Sakshi
Sakshi News home page

డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న చోట సమాంతరంగా మరో వాల్‌

Published Tue, Apr 11 2023 5:15 AM

Another wall is parallel to where the diaphragm wall is damaged - Sakshi

సాక్షి, అమరావతి: గోదావరి వరద ఉధృతికి పోలవ­రం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌) వద్ద ఏర్పడిన నాలుగు భారీ అగాధాలు పూడ్చి వయబ్రో కాంపాక్షన్‌ ద్వారా యథాస్థితికి తేవడం, దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌కు సమాంతరంగా మరో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించి పటిష్టం చేసే పనులకు  రూ.2022.05 కోట్లతో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు పనులను సక్రమంగా చేపట్టకపోవడం వల్ల 2019లో వచ్చిన వరదలకు ప్రాజెక్టు పలు చోట్ల తీవ్రంగా దెబ్బతింది.

ప్రధాన డ్యామ్‌తో పాటు దిగువ కాఫర్‌ డ్యామ్, డయాఫ్రమ్‌ వాల్‌ల వద్ద పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంతో పాటు అదనపు వ్యయమూ అవుతోంది. గోదావరి వరద ఉధృతికి ప్రధాన డ్యామ్‌ వద్ద ఏర్పడిన భారీ అగాధాల పూడ్చివేత, డయాఫ్రమ్‌ వాల్‌ను సరిదిద్దడానికి అయ్యే అదనపు వ్యయాన్ని భరిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ గత ఏడాది హామీ ఇచ్చారు. డీడీఆర్‌పీ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం దిగువ కాఫర్‌ డ్యామ్‌లో దెబ్బ తిన్న ప్రాంతాలను ఇసుకతో నింపిన జియోమెంబ్రేన్‌ బ్యాగులతో పూడ్చి వయబ్రో కాంపాక్షన్‌ చేసి రాష్ట్ర ప్రభుత్వం య«థాస్థితికి తీసుకువచ్చింది. ఆ తరువాత దిగువ కాఫర్‌ డ్యామ్‌ను 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసింది.

నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించిప్రధాన డ్యామ్‌ అగాధాల పూడ్చివేత, డయాఫ్రమ్‌ వాల్‌ భవితవ్యాన్ని తేల్చడానికి దేశంలో అత్యున్నత సంస్థ్ధలైన సీడబ్ల్యూసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఐఐటీ నిపుణు­లతో 15 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం మేధోమథనం చేయించింది. ఈ బృందం పోల­వ­రం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించి, చేప­ట్టాల్సి­న పనులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది.  అగాధాలను ఇసుకతో పూడ్చి వయబ్రో కాంపాక్షన్‌ చేయాలని సూచించింది.

ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2లో 1,396 మీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రమ్‌ వాల్‌లో నాలుగు చోట్ల 30 శాతం మేర దెబ్బతిందని తేల్చింది. ఆ నాలుగు ప్రాంతాల్లో ‘యు’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించి పాత దానికి అనుసంధానం చేయాలని ఆదేశించింది. ఈ పనులకు రూ.2022.05 కోట్లు వ్యయం అవుతుందని తేల్చింది. ఆ మేరకు పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతిచ్చింది.

బాబు సర్కారు నిర్వాకమిదీ.. 
పోలవరంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకాల వల్లే ఈ అదనపు భారం పడుతోందని అధికార­వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. విభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు­ను కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు సర్కారే చేపట్టింది. అసలు చేపట్టాల్సిన పనులు చేపట్టలేదు. సులభంగా చేయగలిగే, అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది.

గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, పైలెట్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యామ్‌ పునాది, డయాఫ్రమ్‌ వాల్‌ను 2018 జూన్‌ నాటికి పూర్తి చేశారు. స్పిల్‌ వేను పునాది స్థాయిలోనే వదిలేశారు. స్పిల్‌ ఛానల్‌లో మాస్‌ కాంక్రీట్‌ పనులు చేశారు. అప్రోచ్‌ ఛానల్, ఫైలెట్‌ ఛానల్‌లో తట్టెడు మట్టి ఎత్తకుండానే 2018లో ఎగువ, దిగువ కాఫ్‌ర్‌ డ్యామ్‌ల పనులను ప్రారంభించారు. నిర్వాసితులకు పునరావాసంపై మాత్రం దృష్టి పెట్టలేదు.

భారీ నష్టం
గోదావరి నదికి 2019లో భారీ వరదలు వచ్చాయి. పోలవరం వద్ద 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరికి అంత జాగా లేకపోయింది. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీ ప్రదేశం 800 మీటర్లకు కుంచించుకుపోయింది. దీంతో వరద ఉధృత్తి మరింత తీవ్రమై ప్రధాన డ్యామ్‌ వద్ద గరిష్టంగా 35 మీటర్లు, కనిష్టంగా 22 మీటర్లు లోతుతో ఇసుక తిన్నెలు కోతకు గురై నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి.

ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–2లో డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో 0 నుంచి 600 మీటర్ల వరకు కోతకు గురై 36.5 మీటర్ల లోతుతో భారీ అగాధం ఏర్పడింది. ఇలా చంద్రబాబు నిర్వాకం వల్ల జరిగిన విధ్యంసంతో పోలవరం పనుల్లో జాప్యమే కాకుండా, అదనపు వ్యయాన్నీ భరించాల్సి వస్తోంది.

టెండర్లకు రంగం సిద్ధం
గోదావరికి వరదలు వచ్చేలోగా ప్రధాన డ్యామ్‌ వద్ద ఏర్పడిన భారీ అగాధాలను పూడ్చివేత, డయాఫ్రమ్‌ వాల్‌ను పటిష్టవంతం చేసే పనులను పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ ఆదేశించిన నేపథ్యంలో తక్షణమే ఆ పనులు చేపట్టడానికి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని జలవనరుల శాఖ అధికారులు నిర్ణయించారు.నిబంధనల మేరకు లంసం ఓపెన్‌ విధానంలో టెండర్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన టెండర్లను ఖరారు చేసి రివర్స్‌ టెండరింగ్‌లో తక్కువ ధరకు కోట్‌  చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనున్నారు. 

పునరావాసంపై బాబు చేతులెత్తేసి..
ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మిస్తే తామంతా ముంపునకు గురవుతామని, పునరావాసం కల్పించాలని 103 గ్రామాల ప్రజలు సీడబ్ల్యూసీని ఆశ్రయించారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని సీడబ్ల్యూసీ ఆదేశించింది. కమీషన్ల కోసం నిర్మాణాన్ని నెత్తికెత్తుకున్న చంద్రబాబు సర్కారు.. నిర్వాసితులకు పునరావాసం కల్పించలేక చేతులెత్తేసింది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌కు కుడి, ఎడమ వైపు 400 మీటర్ల చొప్పున, దిగువ కాఫర్‌ డ్యామ్‌ కుడి వైపున 600 మీటర్లు ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. దీంతో గోదావరి ప్రవాహానికి అడ్డంకులేర్పడ్డాయి.
 

Advertisement
Advertisement