ఏపీలో భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్యే లక్ష్యంగా..: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

ఏపీ విద్యావ్యవస్థలో విప్లవాత్మక ఘట్టం.. ప్రభుత్వ బడుల్లో ‘ఐబీ’ విద్య అమలుకు ఒప్పందం

Published Wed, Jan 31 2024 6:02 PM

AP CM Jagan signed MoU with IB system for government schools - Sakshi

గుంటూరు, సాక్షి:  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఐబీ’ విద్య అమలుకు శ్రీకారం చుట్టింది జగనన్న ప్రభుత్వం. ఈ క్రమంలో.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో SCERT, IB మధ్య ఒప్పందం కుదిరింది. తద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు పాఠశాలల్లో శ్రీమంతుల పిల్లలు చదువుకునే ‘ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌’ (ఐబీ) సిలబస్‌ పేద పిల్లలకు చేరువ కానుంది.

ఐబీ సిలబస్‌ అమలుపై బుధవారం సాయంత్రం ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్సీఈఆర్టీ) అధికారులతో ఐబీ ప్రతినిధులు సీఎం జగన్‌ సమక్షంలో ఏపీ విద్యాశాఖతో ఒప్పందం చేసుకున్నారు. ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, ఐబీ చీఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌(డైరెక్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్నోవేషన్‌) డాక్టర్‌ అంటోన్ బిగిన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి జెనీవా నుంచి వర్చువల్‌గా ఐబీ డైరెక్టర్‌ జనరల్‌ ఒల్లి పెక్కా హీనోనెన్  పాల్గొన్నారు.

సీఎం జగన్‌ ఏమన్నారంటే.. 

‘‘ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయడం నాకు గొప్ప సంతృప్తి నిస్తోంది. ఐబీ డైరెక్టర్‌ జనరల్‌ ఓలీ పెక్కాకు, ఆన్‌లైన్‌ ద్వారా హాజరైన వారితో పాటు ఇక్కడకు వచ్చిన ఐబీ ప్రతినిధులకు ధన్యవాదాలు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనది నేను భావిస్తున్నా. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు  ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం ఇది గొప్ప సంతృప్తినిచ్చే కార్యక్రమం. నాణ్యమైన విద్యను భవిష్యత్తు తరాలకు అందించడం అన్నది చాలా ముఖ్యం. భవిష్యత్తు తరాలు.. మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, భవిష్యత్‌ ప్రపంచంలో నెంబర్‌వన్‌గా నిలవాలన్నా  భారత్‌ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అవసరం.

.. ఇప్పుడున్న విద్యావిధానాలను అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాశ్చాత్య ప్రపంచంతో పోల్చిచూస్తే సాంకేతికత, పాఠ్యప్రణాళిక తదితర అంశాల్లో అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉంది. సమస్యా పూరణ సామర్ధ్యం, ప్రాక్టికల్‌ ఎగ్జామినేషన్‌ మోడల్‌లో ఎడ్యుకేషన్‌ నాలెడ్జ్‌ని వినియోగం వంటివి చాలా కీలకం. ఐబీ ద్వారా ఇది సాధ్యమని విశ్వసిస్తున్నాం. ఐబీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఐబీతో భాగస్వామ్యం ద్వారా ఒక ప్రయాణం ప్రారంభమైంది. ముందు టీచర్లకు, సిబ్బందికి కెపాసిటీని పెంచేలా శిక్షణ కార్యక్రమాలు రానున్న విద్యాసంవత్సరంలో అమలవుతాయి. సంపన్నులకు మాత్రమే అందే ఐబీ విద్య అన్న పరిస్థితి ఇప్పుడు మారుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలవుతుంది. పదేళ్లలో 2035నాటికి పదోతరగతి, 2037 నాటికి పన్నెండు తరగతిలో ఐబీ బోధన మొదలవుతుంది. పేదలకు, అణగారిన వర్గాలకూ ఐబీ బోధన అందుతుంది. ఎస్‌ఈఆర్టీలో ఐబీ భాగస్వామ్యం కావడం వల్ల విద్యా బోధన, అభ్యాసాలు పరిణామం చెందుతాయి. ఇది కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

ఈ ఒప్పందం ప్రకారం..
2024 – 25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధన సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది. టీచర్లతో పాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్‌ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌ బోర్డు సిబ్బందికి ‘ఐబీ’పై అవగాహన, సామర్థ్యం పెంచేలా శిక్షణనిస్తారు. దీంతో వారంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్‌ టీచర్‌ నెట్‌వర్క్‌లో భాగమవుతారు.

2025 జూన్‌ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్‌ బోధన ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్‌ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి, 2037కి 12వ తరగతిలో అమలు చేస్తారు. పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తాయి. ఈ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు సైతం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ఇంటర్‌ మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ సౌరవ్‌ గౌర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌(పాఠశాల మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, సర్వశిక్ష అభియాన్‌ ఎస్‌పీడీ బి శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ(మిడ్‌ డే మీల్స్‌) డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌. శోభికా, ఐబీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement