Jagananna Videshi Vidya: అర్హులందరికీ విదేశీవిద్యకు ఆర్థికసాయం | Sakshi
Sakshi News home page

Jagananna Videshi Vidya: అర్హులందరికీ ఆర్థికసాయం.. మొదలైన దరఖాస్తుల ప్రక్రియ

Published Tue, Aug 30 2022 5:09 AM

Application Process for Jagananna Videsi Vidya - Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న విదేశీవిద్య పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఆర్థికసాయాన్ని అందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. జగనన్న విదేశీవిద్య పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఆయన సోమవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న విదేశీవిద్య పథకంలో ఏడాదికి ఇంతమందికే ఇవ్వాలన్న పరిమితి లేదని స్పష్టం చేశారు.

అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటుగా అల్పాదాయం కలిగిన అగ్రవర్ణాల వారికి కూడా విదేశీవిద్యను అందుబాటులోకి తెస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ పథకానికి జ్ఞానభూమి పోర్టల్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. రూ.8 లక్షలలోపు వార్షికాదాయం కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ పథకంలో లబ్ధిపొందడానికి అర్హులేనని పేర్కొన్నారు.

ఆయా కేటగిరీల దరఖాస్తులను రాష్ట్రస్థాయి అధికారిక కమిటీలు పరిశీలించి వాటిలో అర్హులైన విద్యార్థుల జాబితాను తమ శాఖకు ఇస్తాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్‌ స్టడీ సర్కిళ్లలో శిక్షణపొందే వారికి మెరుగైన శిక్షణ అందేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. స్టడీ సర్కిళ్లకు పూర్వ వైభవం తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ఇన్‌చార్జి కార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్,  డైరెక్టర్‌ కె.హర్షవర్ధన్, జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, డిప్యుటీ సెక్రటరీ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement