భారీగా తగ్గిన ‘జీడి పప్పు’ ధర.. కారణం ఇదే.. | Sakshi
Sakshi News home page

భారీగా తగ్గిన ‘జీడి పప్పు’ ధర.. కారణం ఇదే..

Published Tue, Jun 20 2023 8:37 AM

Cashew Price Has Fallen Drastically In Season - Sakshi

మలికిపురం: జీడి గింజల ధర భారీగా పతనమైంది. జీడి పప్పు ధర కూడా కేజీకి రూ.100 వరకూ పడి­పో­యింది. దీంతో వ్యాపారులు, రైతులు అయోమ­యానికి గురవుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని రాజోలు, నరసాపురం నియోజకవ­ర్గాల్లో­ని సముద్ర తీరంలో జీడిమామిడి సాగు జరుగుతోంది. ఇక్కడ గింజల ఉత్పత్తి చాలా తక్కువే. అయి­నప్పటికీ.. మలికిపురం మండలం మోరి గ్రామంలో తయారయ్యే జీడి పప్పు ప్రసిద్ధి పొందింది. ఇక్కడి జీడి పప్పు పరిశ్రమకు విశాఖపట్నం, ఉభ­య గోదావరి జిల్లాలతో పాటు ఏజెన్సీ, తెలంగాణ నుంచి కూడా జీడి గింజల దిగుమతి అవుతాయి.

దిగుబడి పెరగడమే కారణం
ఈ ఏడాది జీడి గింజల ఉత్పత్తి అధికంగా ఉండటమే ధర పతనానికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. జీడి తోటలు కాపు మీ­ద ఉన్న సమయంలో అదనంగా వర్షాలు కురిశాయి. దీంతో మరోసారి పూత పూసి, జీడి గింజల ఉత్పత్తి పెరిగింది. ఫలితంగా గత ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తి కావాల్సిన జీడి గింజల ఉత్పత్తి జూన్‌లో కూడా కొనసాగుతోంది. దీంతో ధర పతనమైంది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రైతుల వద్ద 80 కేజీల జీడి గింజల బస్తాను వ్యాపారులు రూ.9,500కు కొనుగోలు చేశారు. ఈ ధర మే నాటికి రూ.7,500కు తగ్గింది. పంట చివరి దశ కావడంతో ధర తగ్గడం సాధారణమే అనుకున్నారు. కానీ.. జీడిచెట్లకు మరోసారి పూత రావడంతో మళ్లీ గింజలు ఉత్పత్తి అయ్యాయి. ప్రస్తుతం 80 కేజీల జీడి గింజల బస్తా రూ.5 వేలకే లభిస్తోంది. ఇందులో నాణ్యత తక్కువగా ఉండే చివరి రకం జీడి గింజలు రూ.3,500కు కూడా లభిస్తున్నాయి

పేరుకుపోయిన నిల్వలు
ఈ కారణంగా జీడి పప్పు ధర కూడా గణనీయంగా పడిపోయింది. గత ఏప్రిల్, మే నెలల్లో కేజీ జీడి పప్పు ధర రూ.650 ఉండగా.. ప్రస్తుతం రూ.550కి పడిపోయింది. సంప్రదాయ రీతిలో కాల్చి తయారు చేసిన జీడి పప్పు ధర ఇలా ఉండగా.. ఫ్యాక్టరీల్లో తయారవుతున్న బాయిల్డ్‌ జీడి పప్పు ధర మరింత దారుణంగా ఏకంగా రూ.450కి తగ్గిపోయింది. సీజన్‌ మొదలైనప్పుడు ఎక్కువ ధరకు గింజలు కొనుగోలు చేసిన వ్యాపారులు.. తక్కువ ధరకు జీడి పప్పు అమ్మాల్సి రావడంతో ఉత్పత్తి నిలిపివేశారు. ధర లేక, కొనుగోలు చేసి గింజల నుంచి పప్పు ఉత్పత్తి నిలిపివేయడంతో వ్యాపారుల వద్ద.. ఉత్పత్తి పెరిగి, అమ్మకాలు తగ్గడంతో రైతుల వద్ద భారీ స్థాయిలో గింజలు పేరుకుపోయాయి. దీనికితోడు ప్రస్తుతం ఆషాఢం, శూన్య మాసాలు కావడంతో శుభకార్యాలు లేక జీడి పప్పు వినియోగం కూడా తగ్గింది. అన్‌ సీజన్‌ మరో రెండు నెలలు కొనసాగనుంది.

ఉత్పత్తి మానేశాం
ధర పడిపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. గత ఏప్రిల్‌లో 80 కేజీల జీడి గింజల బస్తా రూ.9,500కు కొన్నాం. అప్పట్లో చాలా సరకు నిల్వ చేశాం. ఇప్పుడు రూ.3,500కు కూడా లభిస్తోంది. దీంతో ఉత్పత్తి మానేశాం.
– కొడవటి ప్రసాద్, వ్యాపారి, మోరిపోడు

ధర నిలకడ లేదు
వర్షాలు అధికంగా కురిసి మరో­సా­రి పూత రావడంతో ఈ ఏడా­ది గింజల ఉత్పత్తి పెరిగింది. ఫలితంగా ధర పడిపోయింది. ఈ సమయంలో పప్పు ఉత్పత్తి చేసి విక్రయించలేం. పైగా రెండు నెలలు శుభకార్యాలుండవు. దీంతో అమ్మకాలు కూడా ఉండవు.
– ముప్పర్తి నాని, జీడి గింజల దిగుమతిదారు, మోరిపోడు

Advertisement
Advertisement