దశలవారీగా సీబీఎస్‌ఈ అమలు | Sakshi
Sakshi News home page

దశలవారీగా సీబీఎస్‌ఈ అమలు

Published Wed, Mar 30 2022 3:16 AM

CBSE implementation step by step in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హైస్కూళ్లలో 2024–25 విద్యా సంవత్సరం నాటికి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) విధానం అమలు చేసేందుకు వీలుగా పాఠశాల విద్యా శాఖ అడుగులు వేస్తోంది. ఇందుకనుగుణంగా ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను చేపట్టింది. విద్యార్థి కేంద్రంగా సబ్జెక్టు ప్రాధాన్యతతో కూడిన బోధనాభ్యసన ప్రక్రియలను కొనసాగించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. నూతన విద్యావిధానం ప్రకారం.. పాఠశాల విద్యను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఆరంచెలు (శాటిలైట్‌ స్కూళ్లు, ఫౌండేషనల్, ఫౌండేషనల్‌ ప్లస్, ప్రీ హైస్కూల్, హైస్కూల్, హైస్కూల్‌ ప్లస్‌)గా స్కూళ్లను తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అంగన్‌వాడీ, ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ, హైస్కూళ్ల మ్యాపింగ్‌ ప్రక్రియను ఇప్పటికే చేపట్టారు. మ్యాపింగ్‌ విధానం ద్వారా అంగన్‌వాడీ స్థాయిలో పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తెస్తారు. అలాగే 3వ తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టులను బోధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి స్కూల్‌ అసిస్టెంట్ల (ఎస్‌ఏ)లతో బోధన కోసం సమీపంలోని హైస్కూల్, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్ల మ్యాపింగ్‌ చేపట్టారు. ఆరంచెల విధానంలో ప్రీ హైస్కూల్, హైస్కూళ్లకు వీరిని అనుసంధానం చేస్తున్నారు. ఇలా ఏర్పాటయ్యే ఈ హైస్కూళ్లలో సీబీఎస్‌ఈ అమలు కానుంది.

కేంద్రానికి ప్రతిపాదనలు..
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు), ఆదర్శ పాఠశాలలు, వివిధ గురుకుల పాఠశాలలతోపాటు కొన్ని జెడ్పీ హైస్కూళ్లలో (మొత్తం 1,092) సీబీఎస్‌ఈ అమలుకు అధికారులు ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు. ఈ స్కూళ్లలో దశలవారీగా సీబీఎస్‌ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. 8వ తరగతి వరకు నాన్‌ సబ్జెక్టుల్లో పూర్తిగా రాష్ట్ర సిలబస్‌ అమలు కానుండగా సబ్జెక్టులు సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఉంటాయి. 9, 10 తరగతులు మాత్రం పూర్తిగా సీబీఎస్‌ఈలో ఉంటాయి. 3 నుంచి 10వ తరగతి వరకు ఉండే ఈ హైస్కూళ్లలో 9 మంది సబ్జెక్టు టీచర్లు, 1 హెడ్‌ మాస్టర్‌ (హెచ్‌ఎం), 1 ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ) మొత్తం 11 మంది ఉండనున్నారు. ప్రస్తుతం కొన్ని స్కూళ్లలో ఒకే మాధ్యమం అమల్లో ఉండగా మరికొన్నింటిలో వేర్వేరు మాధ్యమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో మాధ్యమం ఉన్న స్కూళ్లలో అదనపు సబ్జెక్టు టీచర్లను నియమించనున్నారు. 2024–25 నాటికి ఈ స్కూళ్లన్నీ ఒకే మాధ్యమంలోకి మారడంతోపాటు సీబీఎస్‌ఈ విధానంలో కొనసాగనున్నాయి.

31,312 మంది ఎస్జీటీలకు ఎస్‌ఏలుగా అవకాశం
ఆరంచెల విధానంలో హైస్కూల్, ప్రీ హైస్కూళ్లకు 3, 4, 5 తరగతుల విద్యార్థులను అనుసంధానం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కూళ్లలోని కింది తరగతులకు కూడా సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుతం సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ)లుగా పనిచేస్తున్న 31,312 మందికి స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)లుగా అవకాశం దక్కనుంది. విద్యార్థులు, టీచర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేపట్టిన మ్యాపింగ్‌ ప్రక్రియ అనంతరం 3,676 ప్రీ హైస్కూళ్లు (3–8 తరగతులు)గా, 5,202 హైస్కూళ్లు (3–10 తరగతులు)గా మొత్తం 8,878 ఉంటాయి. మ్యాపింగ్‌కు అవకాశం లేని 1,277 స్కూళ్లు.. హైస్కూళ్లు, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లుగా కొనసాగుతాయి. 

1,12,853 మంది అవసరం..
ఈ మొత్తం 10,155 స్కూళ్లలో సబ్జెక్టుల బోధన కోసం 1,12,853 మంది టీచర్లు అవసరమవుతారని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ప్రస్తుతం సబ్జెక్టుల బోధన కోసం 72,625 మంది స్కూల్‌ అసిస్టెంట్లు ఉన్నారు. ఇంకా 40,228 మంది స్కూల్‌ అసిస్టెంట్లు అవసరమవుతారని అంచనా వేస్తోంది. అలాగే 1,735 మంది హెడ్మాస్టర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు అవసరమని గుర్తించింది. ఆరంచెల విధానంలో రూపుదిద్దుకుంటున్న 26,271 ఫౌండేషనల్‌ స్కూళ్లు (పీపీ1, పీపీ2, 1, 2 తరగతులు), 11,234 ఫౌండేషనల్‌ ప్లస్‌ స్కూళ్ల (పీపీ1, పీపీ2, 1–5 తరగతులు)ల్లో 52,242 మంది ఎస్జీటీలు అవసరమవుతారని అధికారులు లెక్కకట్టారు. ప్రస్తుతం 83,554 మంది ఎస్జీటీలు అందుబాటులో ఉన్నారు. వీరిలో ఫౌండేషనల్, ఫౌండేషనల్‌ ప్లస్‌ స్కూళ్లకు అవసరమైనవారు కాకుండా అర్హతలు ఉన్న ఎస్జీటీలకు ఎస్‌ఏలుగా అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక. ఇలా అర్హతలున్న ఎస్జీటీలు 53,063 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 31,312 మందికి ఎస్‌ఏలుగా అవకాశం కల్పించనున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement