పిల్లల చేతిలో హెల్‌ఫోన్‌! | Sakshi
Sakshi News home page

పిల్లల చేతిలో హెల్‌ఫోన్‌!

Published Tue, Jan 2 2024 5:36 AM

Children spending more than 3 hours a day on mobile phones - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా లాక్‌డౌన్, ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా పిల్లల్లో సెల్‌ఫోన్‌ వినియోగం పెరిగిపోయింది. కరోనా వ్యాప్తి తగ్గిపోయినా.. ఆఫ్‌లైన్‌ తరగతులు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా పిల్లల్లో సెల్‌ఫోన్‌ వినియోగం మాత్రం తగ్గడం లేదు. దేశంలోని పట్టణ, నగర ప్రాంతాల్లో 9 నుంచి 17 ఏళ్ల పిల్లలు రోజుకు సగటున మూడు గంటలకు పైగా సెల్‌ఫోన్‌ వినియోగిస్తున్నారు.

లోకల్‌ సర్కిల్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో 61 శాతం తల్లిదండ్రులు ఈ అంశాన్ని వెల్లడించారు. తమ పిల్లలు ఫోన్‌లో గేమ్స్‌ ఆడటం, ఓటీటీ యాప్స్‌లో సినిమాలు చూడటం, సోషల్‌ మీడియాలో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 296 జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 46 వేల మంది తల్లిదండ్రులను సర్వే చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది పురుషులు, 38 శాతం మంది మహిళలు ఉన్నారు. 

దూకుడు.. అసహనం పెరిగాయ్‌
సర్వేలో భాగంగా సెల్‌ఫోన్‌ అతి వినియోగంతో పిల్లల సామాజిక ప్రవర్తన/మానసిక ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావాల స్థాయిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. సెల్‌ఫోన్‌ వినియోగం కారణంగా పిల్ల­ల్లో గమనించిన మార్పులు ఏమిటని 11,697 మంది తల్లిదండ్రులను ఆరా తీయగా.. 39 శాతం పిల్లల్లో దూకుడు స్వభావం పెరిగినట్టు తల్లిదండ్రులు చెప్పారు. 37 శాతం పిల్లల్లో అసహనం, 25 శాతం పిల్లల్లో అతి క్రియాశీలత (హైపర్‌ యాక్టివ్‌నెస్‌) పెరిగిందని వెల్లడించారు. 22 శాతం పిల్లల్లో నిస్పృహ పెరిగినట్టు గుర్తించారు.

ఇంట్లో ఉన్నంతసేపూ ఫోన్‌తోనే..
పట్టణ ప్రాంతాల్లోని చాలామంది పిల్లలు ఇంట్లో ఉన్న సమయంలో సెల్‌ఫోన్‌తో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. మీ పిల్లలు రోజుకు సగటు ఎంత సమయం సెల్‌ఫోన్‌ వినియోగిస్తున్నారని 11,507 మందిని ఆరా తీయగా.. 6 గంటల మేర సెల్‌ఫోన్‌తో గడుపుతున్నట్టు 15 శాతం మంది తెలిపారు. 3నుంచి 6 గంటల పాటు తమ పిల్లలు ఫోన్‌ వినియోగిస్తున్నట్టు 46 శాతం మంది, 1నుంచి 3 గంటల మధ్య వినియోగిస్తున్నట్టు 39 శాతం మంది పేర్కొన్నారు.

అయితే ఓటీటీ.. లేదంటే సోషల్‌ మీడియా మీ పిల్లలు సెల్‌ఫోన్‌ ఎందుకోసం వినియోగిస్తున్నారని 12,017 మందిని ప్రశ్నించి.. సోషల్‌ మీడియా, ఓటీటీ, ఆన్‌లైన్‌ గేమింగ్, ఇతర వ్యాపకాలు, ఏమీ చెప్పలేం అని ఆప్షన్‌లు ఇవ్వగా.. చాలామంది ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లతో సమాధానాలిచ్చారు. 37 శాతం మంది తమ పిల్లలు ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌ను చూస్తున్నట్టు చెప్పారు. 35 శాతం మంది వాట్సప్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్, బీ రియల్‌ వంటి సోషల్‌ మీడియా మాధ్యమాల్లో పిల్లలు గడుపుతున్నట్టు తెలిపారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు 33 శాతం మంది, ఇతర వ్యాపకాలని 10 శాతం, ఏమీ చెప్పలేమని 2 శాతం మంది వెల్లడించారు.

తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం
పిల్లల్లో ఫోన్‌ వినియోగాన్ని నియంత్రించడంలో తల్లిదండ్రుల పాత్రే కీలకం. పాఠశాల, కళాశాలల్లో అలసిపోయి ఉంటారని ఇంటికి రాగానే పిల్లలు సెల్‌ఫోన్‌ వాడుతున్నా కొందరు తల్లిదండ్రులు పట్టించుకోరు. ఆటవిడుపు కోసం చేసే ఈ చర్య క్రమంగా వ్యసనంగా మారుతోంది. అదేవిధంగా హోమ్‌ వర్క్, ప్రాజెక్ట్‌ వర్క్స్‌ కోసమని పిల్లలు అడిగిన వెంటనే సెల్‌ఫోన్‌ ఇచ్చేస్తుంటారు.

అనంతరం వాళ్లు ఎంతసేపు ఫోన్‌ను వినియోగిస్తున్నారనేది పట్టించుకోరు. ఈ విధానాన్ని వీలైనంత వరకూ తగ్గించాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌ను అనవసరంగా వినియోగించడం మానుకోవాలి. వీలైనంత సేపు వారితో గడపాలి. – డాక్టర్‌ కేవీ రామిరెడ్డి, సూపరింటెండెంట్, మెంటల్‌ కేర్‌ హాస్పిటల్, వైజాగ్‌

Advertisement
Advertisement