హక్కుగా ‘ఆరోగ్యం’ - వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

హక్కుగా ‘ఆరోగ్యం’ - వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

Published Sat, Oct 14 2023 4:03 AM

CM Jagan Directs Officials To Ensure Quality Treatment At Jagananna Arogya Suraksha - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ద్వారా ప్రజలంతా సంతృప్తి చెందేలా సేవలందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. పేదలందరికీ ఆరోగ్యం అనేది హక్కుగా ఉండాలని, అనారోగ్య బాధితులను చేయి పట్టుకుని నడిపిస్తూ శిబిరాల్లో సేవలతోపాటు మందుల నుంచి చికిత్స వరకు అందించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. 

క్యాంపుల్లో చికిత్సతోపాటు మందులు కూడా ఇస్తున్నామన్నారు. గతంలో చికిత్స పొందిన వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మందుల విషయంలో రాజీ పడకుండా ఎంత ఖరీదైనవి అయినా సరే వారికి అందించాలని ఆదేశించారు. సురక్ష కార్యక్ర­మం ప్రభుత్వ ప్రతిష్టనే కాకుండా వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిష్టనూ పెంచుతుందన్నారు. ఆరోగ్య సురక్ష నిర్వహణ కోసం కలెక్టర్లకు మరిన్ని నిధులు అందిస్తామని ప్రకటించారు. 

శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, నాడు – నేడు కార్యక్రమా­లు, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం అమలును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ... 

అంతటితోనే ఆగొద్దు..
ప్రజల ఆరోగ్య అవసరాలు, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్య శిబిరాల్లో వైద్యం చేస్తున్నాం. శిబిరాల్లో వైద్యం అందించడంతోనే మన బాధ్యత ముగిసినట్లు కాదు. ఆ తర్వాత కూడా మనం ప్రజలకు అండగా నిలవాలి. వారిని వైద్య పరంగా చేయి పట్టుకుని నడిపించాలి. ఈ క్రమంలో 5 అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి.

ఇవీ ఐదు అంశాలు..

  • వెద్య శిబిరాల్లో మెరుగైన చికిత్స అవసరమని గుర్తించిన వారిని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. ఇలా రిఫర్‌ చేసిన వారి బాధ్యతను ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు తీసుకోవాలి. వారికి నెట్‌వర్క్‌ ఆస్పత్రిలో అవసరమైన వైద్యం, శస్త్ర చికిత్స ఆరోగ్యశ్రీ కింద అందేలా చూడాలి. ఆరోగ్య సమస్య పూర్తిగా నయం అయ్యేవరకూ చేయి పట్టుకుని నడిపించాలి. వారికి చేయూతను అందించాలి.  
  • ఆస్పత్రుల్లో గతంలో చికిత్స పొందిన వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చికిత్స అనంతరం మందులను క్రమం తప్పకుండా వాడటం చాలా ముఖ్యం. లేదంటే సమస్య మళ్లీ తిరగబెడుతుంది. వీరు వాడాల్సిన మందుల విషయంలో రాజీ పడొద్దు. అవి ఎంత ఖరీదైనవి అయినా సరే వారికి అందించాలి. అంతేకాకుండా ఫ్యామిలీ డాక్టర్‌ వీరికి చెకప్‌లు చేయాలి. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యాలపై వాకబు చేస్తుండాలి. వైద్య పరంగా ఏ అవసరం వచ్చిన సిబ్బంది తక్షణమే స్పందించాలి.   
  • ఆరోగ్యశ్రీలో కవర్‌ కాకుండా గతంలో చికిత్సలు చేయించుకున్న రోగులకు కూడా మనం చేయూత అందించాలి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో వాకబు చేయాలి. సరిగా మందులు వాడుతున్నారో? లేదో? తెలుసుకోవాలి. చికిత్స, క్రమం తప్పకుండా చెకప్, మందులు.. ఇలా వివిధ అవసరాల్లో వారికి అండగా నిలవాలి. ఇందుకోసం ప్రత్యేకంగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) రూపొందించాలి. ప్రతి సచివాలయం వారీగా ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారనేది వివరాలు సేకరించి వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్‌్టలతో అనుసంధానం చేయాలి. వీరికి వైద్య పరంగా అండగా నిలవడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే సమకూరుస్తుంది.  
  • జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వచ్చే నెల 15వ తేదీతో ముగుస్తుంది. అయితే అనంతరం కూడా క్రమం తప్పకుండా వైద్య శిబిరాలను నిర్వహించాలి. ప్రతి నెలా మండలంలో నాలుగు సచివాలయాల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలి. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.  
  • ప్రతి పౌరుడికి వైద్య పరంగా అండగా నిలవడం ప్రభుత్వంగా మన బాధ్యత. వైద్య శిబిరాల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాంపుల్లో సంతృప్తకర స్థాయిల్లో సదుపాయాలు ఉండేలా చూడాలి. రోగులకు చేయూతను అందించడంతో పాటు ప్రతి ఒక్కరికి ఆరోగ్య సురక్ష కార్యక్రమం పట్ల  అవగాహన కల్పించాలి. ప్రతి పౌరుడు కార్యక్రమాన్ని సది్వనియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలి. ప్రతి వారం క్రమం తప్పకుండా ఈ ఐదు అంశాలపై నేనే సమీక్షిస్తా.   

నలుగురు వైద్యులు.. ఇద్దరు స్పెషలిస్టులు
ఆరోగ్య సురక్ష క్యాంపులకు స్పెషలిస్టు వైద్యులను పంపే విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. రోగులకు ఉత్తమ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి. క్యాంపులకు తప్పనిసరిగా నలుగురు వైద్యులు వెళ్లాలి. వీరిలో ఇద్దరు స్పెషలిస్టులు ఉండేలా చూడాలి. రోగిని పరిశీలించినప్పుడు మరింత నిర్ధారణ కోసం అదనపు పరీక్షలు చేసి సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి.  

ప్రకాశం జిల్లాలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ 
తిరుపతి తరహాలోనే చిన్న పిల్లలకోసం అత్యాధునిక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో కూడా ఏర్పాటు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రకాశం జిల్లాలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ నెలకొల్పడానికి చర్యలు చేపట్టాలి.   
సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్‌ జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఎఫ్‌ఏసీ) అజయ్‌జైన్, కార్యదర్శి మంజుల డి హోస్మణి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ జె.నివాస్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ హరేంధిర ప్రసాద్, సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్‌ నరసింహం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌ డాక్టర్‌ రామిరెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ చంద్రశేఖరరెడ్డి, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వీసీ ద్వారా సమీక్షకు హాజరయ్యారు.   

ఆరోగ్యశ్రీపై అందరికి అవగాహన
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంపై అవగాహన లేని వ్యక్తి ఒక్కరూ ఉండటానికి వీల్లేదు. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలో తెలియని వాళ్లు ఉండకూడదు. ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఆరోగ్యశ్రీ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేయాలి.  ఆరోగ్యశ్రీ చికిత్సల కోసం వెళ్లే రోగులకు ప్రయాణ చార్జీలు కూడా ఇవ్వాలి. రక్త హీనతతో బాధపడుతున్న వారికి పౌష్టికాహారాన్ని అందించేలా ఎస్‌వోపీ రూపొందించాలి. దివ్యాంగులకు సరి్టఫికెట్లు ఇవ్వడంలోనూ మార్పులు రావాలి. నిపుణులైన వైద్యులు ఆరోగ్య సురక్ష శిబిరాలకు వచి్చనప్పుడు అక్కడే వీరికి సరి్టఫికెట్లు జారీ చేసేలా ఆలోచన చేయాలి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పెన్షన్లు ఇవ్వడం, వారికి అవసరమైన ఖరీదైన మందులను అందించే కార్యక్రమం చేపట్టాలి. మందులు అందడం లేదన్న మాటే రోగుల నుంచి రాకూడదు.

Advertisement
Advertisement