ఇది దేవుడి స్క్రిప్ట్‌..నాన్న మొదలుపెడితే..నేను పూర్తి చేశా | Sakshi
Sakshi News home page

ఇది దేవుడి స్క్రిప్ట్‌..నాన్న మొదలుపెడితే..నేను పూర్తి చేశా

Published Thu, Mar 7 2024 4:31 AM

CM YS Jagan dedicated Veligonda Project to the nation - Sakshi

ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం.. నిజంగా నా అదృష్టం

వెలిగొండను జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌

వాయువేగంతో జంట సొరంగాలు పూర్తి

పూర్తయిన టన్నెళ్లను స్వయంగా పరిశీలించి పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం

ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీరు కూడా..

రూ.1,200 కోట్లతో ఎల్‌ఏ, ఆర్‌అండ్‌ఆర్‌ 

ఆగస్టు నుంచి ప్రాజెక్టు ద్వారా నీళ్లు

రూ.53 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన

గిద్దలూరు నియోజకవర్గంలో 13,500 ఎకరాలకు సాగునీరు 

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు నాన్నగారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే ఆయన కుమారుడిగా ఒక్కొక్కటి దాదాపు 18 కి.మీ. పైగా ఉన్న రెండు టన్నెళ్లను పూర్తి చేసి జాతికి అంకితం చేయడం నిజంగా దేవుడు రాసిన స్క్రిప్టే అనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏముంది? వెలిగొండ మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న మన ప్రభుత్వమే పూర్తి చేయగా రెండో సొరంగం పనులను కొద్ది రోజుల క్రితమే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేస్తున్నాం. దశాబ్దాల స్వప్నాన్ని నెరవేరుస్తూ ఆ టన్నెల్‌లో ప్రయాణించే అదృష్టాన్ని కల్పించిన దేవుడికి సదా రుణపడి ఉంటా.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మూడు జిల్లాల్లో ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రాంత ప్రజల కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు వెలిగొండ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో 30 మండలాలకు తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా జంట టన్నెళ్లతో శరవేగంగా పూర్తి చేసిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్‌ ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు–ఎగువ చెర్లోపల్లి వద్ద బుధవారం ప్రారంభించారు.

దివంగత వైఎస్సార్‌ హయాంలో చేపట్టిన 37.6 కి.మీ పొడవైన వెలిగొండ రెండు టన్నెళ్లలో చంద్రబాబు అధికారంలో ఉండగా 6.6 కి.మీ. పనులు మాత్రమే చేయగా మిగతావి 31 కి.మీ మేర పనులు వైఎస్సార్, సీఎం జగన్‌ పాలనలోనే జరగడం గమనార్హం. గిద్దలూరు నియోజకవర్గానికి ప్రయోజనం చేకూరుస్తూ 13,500 ఎకరాలకు సాగునీటిని అందించే రెండు ఎత్తిపోతల పథకాలకు కూడా సీఎం జగన్‌ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఏమన్నారంటే.. 

మళ్లీ మనం రాగానే నీళ్లు నింపుతాం.. 
ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలో ఐదు, కడప జిల్లాలో రెండు మండలాలు కలిపి మొత్తం 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సమస్యకు పరిష్కారం చూపిస్తూ వెలిగొండ రెండు సొరంగాలు వేగంగా పూర్తయ్యాయి. దీంతో వచ్చే ఖరీఫ్‌లో శ్రీశైలం నుంచి నల్లమలసాగర్‌కు నీళ్లు తీసుకొచ్చి నింపుతున్న దృశ్యం జూలై–ఆగస్టులో ఆవిష్కృతమవుతుందని సంతోషంగా చెబుతున్నా. దాదాపు 3 వేల క్యూసెక్కులతో మొదటి టన్నెల్‌ను పూర్తి చేశాం. 8,500 క్యూసెక్కుల క్యారీయింగ్‌ కెపాసిటీతో రెండో టన్నెల్‌ పూర్తయింది.

అంటే శ్రీశైలంలో మట్టం 840 అడుగులు దాటిన వెంటనే రోజుకో టీఎంసీని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు తీసుకురాగలిగే గొప్ప పరిస్థితి ఈ రోజుతో వచ్చింది. జూలై–ఆగస్టులో నీళ్లు నింపే సమయానికి మరో రూ.1,200 కోట్లు ఖర్చు చేసి ఎల్‌ఏ, ఆర్‌అండ్‌ఆర్‌ కూడా పూర్తి చేస్తాం. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టమైన రెండు టన్నెళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రిజర్వాయర్‌ కూడా పూర్తయిపోయింది. ఇక మిగిలినవి పెద్దగా ఏమీ లేవు. మళ్లీ మనం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రెండు మూడు నెలల్లోనే ఎల్‌ఏ, ఆర్‌ అండ్‌ ఆర్‌ పూర్తి చేసి పూర్తిగా నీళ్లు నింపుతాం.  

దుర్భిక్ష ప్రాంతానికి మేలు చేయని బాబు.. 
ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలన్నింటికీ మంచి జరుగుతుందని తెలిసినా, యర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు నియోజకవర్గాలకు మేలు జరుగుతుందని తెలిసినా బాబు హయాంలో టన్నెళ్లు పూర్తి చేయకుండా పనులు నత్తనడకన సాగాయి. ఇందులో ఒక్కొక్కటి 18.8 కి.మీ. పొడవుతో 37.6 కి.మీ పొడవైన 2 టన్నెళ్లున్నాయి. దివంగత వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులతో సింహభాగం పనులు చేయగా 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో 6.6 కి.మీ. మాత్రమే టన్నెళ్ల పనులు జరిగాయి. ఆ తర్వాత మీ బిడ్డ సీఎం అయ్యాక జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తూ 2 టన్నెళ్లను వడివడిగా పూర్తి చేసి వెలిగొండను సాకారం చేశాడని చెప్పేందుకు గర్విస్తున్నా. 

రెండు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన
గిద్దలూరు నియోజకవర్గానికి మేలు చేసే 2 ఎత్తిపోతల పథకాలకు వెలిగొండ టన్నెళ్ల పైలాన్‌ సమీపంలో సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. అర్ధవీడు మండలం పాపినేనిపల్లి, వెలగలపాయ ఎత్తిపోతల పథకాలకు భూమి పూజ నిర్వహించారు. రెండు ఎత్తిపోతల పథకాలకు రూ.53 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు. దీని ద్వారా 13,500 ఎకరాలకు సాగునీరు అందనుంది.  

టన్నెల్‌లో కలియదిరిగి... పైలాన్‌ను ఆవిష్కరించి
నిర్మాణం పూర్తి చేసుకున్న వెలిగొండ టన్నెళ్ల వద్దకు మధ్యాహ్నం 11.30 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా చేరుకున్న సీఎం జగన్‌ జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి వెలిగొండ నిర్మాణంలో భాగస్వాములైన అధికారులతో ఫొటోలు దిగి పేరుపేరునా అభినందించారు. వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి జంట సొరంగాల పైలాన్‌ వద్దకు సీఎంను తోడ్కొని వెళ్లారు. జంట సొరంగాల పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్‌ వెలిగొండ వ్యూ పాయింట్‌ వద్దకు వెళ్లి టన్నెళ్లను వీక్షించారు. అనంతరం రెండో టన్నెల్‌ లోపలకు వెళ్లి కలియదిరిగి పరిశీలించారు.

మెగా ఇంజినీరింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఉమామహేశ్వరరెడ్డి, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కృష్ణారెడ్డి, ప్రాజెక్టు మేనేజర్‌ రాంబాబు టన్నెళ్ల పనులు, సాంకేతిక అంశాలను తెలియచేశారు. అనంతరం వెలిగొండ సావనీర్‌ను సీఎం ఆవిష్కరించారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, ప్రకాశం జిల్లా సీఈ ఆర్‌ మురళీనాథ్‌రెడ్డి తదితరులు ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వరస్వామి ప్రతిమను జ్ఞాపికగా సీఎం జగన్‌కు అందించగా పాదరక్షలను విడిచిపెట్టి భక్తి భావంతో  స్వీకరించారు.

అంతకుముందు హెలిప్యాడ్‌ వద్ద మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి మేరుగు నాగార్జున, మంత్రి ఆదిమూలపు సురేష్,  జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. సీఎం వెంట హెలికాప్టర్‌లో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వచ్చారు. 

Advertisement
Advertisement