AP: ఇంటింటికీ ఆరోగ్య రక్ష

14 Sep, 2023 02:26 IST|Sakshi
ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడంపై ప్రజలకు అవగాహన కలి్పంచేందుకు రూపొందించిన బ్రోచర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రి రజిని, అధికారులు

రేపట్నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ క్యాంపెయిన్‌కు శ్రీకారం

జగనన్న సురక్ష తరహాలోనే ప్రజల కోసం మరో కార్యక్రమం

పౌరుల ఆరోగ్య సమస్యలను గుర్తించి పరిష్కరించడమే లక్ష్యం

అనారోగ్య బాధితులను చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థకు నాంది.. 5 దశల్లో కార్యక్రమం.. ఉచితంగా 7 రకాల పరీక్షలు

15 నుంచి వలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధుల క్యాంపెయిన్‌.. 

ఈ నెల 30 నుంచి నలుగురేసి డాక్టర్లతో హెల్త్‌ క్యాంప్‌లు

వీరిలో ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు కూడా..

45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపులు ఏర్పాటు

రాష్ట్రంలో ప్రతి గ్రామం, ప్రతి ఇల్లూ కవర్‌ చేయాలి

కార్యక్రమం అమలుపై కలెక్టర్లకు సీఎం జగన్‌ దిశా నిర్దేశం

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశం

రాష్ట్రంలో ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఆరోగ్యపరంగా సురక్షితంగా ఉంచే కార్యక్రమమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’.
– సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమ­స్యలను తెలుసుకోవడంతోపాటు వా­టిని పరిష్కరించే గొప్ప బాధ్య­తను ప్రభుత్వం స్వీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇం­దులో భాగంగానే ఇప్పటికే అమలు చేసిన జగనన్న సురక్ష కార్య­క్రమం తరహాలోనే ఇప్పుడు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. మొత్తం ఐదు దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని హెల్త్‌ క్యాంపులతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

జగనన్న సురక్ష ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలు­సుకుని పరిష్కరించామని, సుమారు 98 లక్షలకు పైగా సర్టిఫికెట్లను నెల రోజుల వ్యవధిలో అందించినట్లు గుర్తు చేశారు. దీని ద్వారా ప్రభుత్వం మీకు అందుబాటులో, మీ గ్రామంలోనే ఉందనే భరోసా ఇవ్వగలిగామ­న్నారు. అదే మాదిరిగానే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు.

బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌ కార్యక్రమం అమలుపై అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్య పొందడంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ రూపొందించిన బ్రోచర్‌ను ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆవిష్కరించారు. సమీక్షలో సీఎం ఏమన్నారంటే..

ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

పెను మార్పులకు శ్రీకారం
జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటినీ సందర్శించి మ్యాపింగ్‌ చేస్తారు. ఏ ఇంట్లో ఎవరు ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారో గుర్తిస్తారు. గ్రామాల్లో నిర్వహించే ప్రత్యేక హెల్త్‌ క్యాంప్‌ల ద్వారా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన పరీక్షలు చేయడం పాటు మందులు, కళ్లద్దాలు అందిస్తారు.

క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు లాంటి దీర్ఘకాలిక జబ్బుల బాధితులను (క్రానిక్‌ డీసీజెస్‌) గుర్తించడం, రెగ్యులర్‌గా చెకప్‌ చేయడం, డాక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలించడం, మందులను అందించడం, అవసరమైతే ఆస్పత్రులకు పంపడం లాంటి జాగ్రత్తలతో అనారోగ్య బాధితులను పూర్తిగా చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం.

గ్రామం పూర్తి బాధ్యతను ఫ్యామిలీ డాక్టర్‌ తీసుకోవాలి. రెగ్యులర్‌గా ఒకవైపు తనిఖీలు చేస్తూనే మందులు కూడా ఇవ్వబోతున్నాం. ఎక్కడా మందులు లేని పరిస్థితి ఉండకూడదు. ఇలా చాలా పెద్ద మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇల్లూ కవర్‌ కావాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులున్న ఇళ్లను ప్రత్యేకంగా పరిగణించి కాలానుగుణంగా పరీక్షలు చేస్తూ మందులు, చికిత్స అందించాలి. 

సంపూర్ణ రక్తహీనత నివారణ
రాష్ట్రంలో జీరో అనిమిక్‌ (రక్తహీనత) లక్ష్యంగా పని చేయాలి. ఆరోగ్య సురక్షలో గర్భిణులు, బాలింతలతో పాటు రక్తహీనత బాధితులను కూడా గుర్తించి మందులతో పాటు, పుడ్‌ సప్లిమెంటేషన్‌ అందచేస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు, నియోనేటల్‌ అండ్‌ ఇన్‌ఫాంట్‌ కేర్‌ (నవజాత శిశువులు, చిన్నారులు) కేసులను పరిగణలోకి తీసుకోవడంతో పాటు బీపీ, షుగర్‌ లాంటి సమస్యలున్న వారికి చికిత్స అందించాలి.

ఒకవైపు సరైన సమయంలో చికిత్స అందిస్తూనే జీవన విధానాల్లో తీసుకోవాల్సిన మార్పులు, ఆయా వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై (ప్రివెంటివ్‌ కేర్‌) ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. దీన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టాలి. 

45 రోజుల తర్వాత కూడా..
మనం 45 రోజుల పాటు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఆ తర్వాత కూడా చేపట్టాలి. ప్రతి మండలంలోనూ నెలకు కనీసం 4 గ్రామాల్లో ఈ క్యాంపులను నిర్వహించాలి. దీంతో ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్‌ క్యాంపు నిర్వహించినట్లు అవుతుంది. 

క్యాంప్‌లలో నలుగురు వైద్యులు
హెల్త్‌ క్యాంప్‌లలో నలుగురు డాక్టర్లు పాల్గొంటారు. ఇందులో ఇద్దరు పీహెచ్‌సీ డాక్టర్లు, మరో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు ఉంటారు. స్పెషలిస్ట్‌ వైద్యుల్లో గైనిక్‌/పీడియాట్రిక్‌ స్పెషలిస్టు డాక్టర్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. కంటి పరీక్షలను కూడా క్యాంపులో భాగంగా చేపట్టాలి. స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు  చేయాలి.

అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఎంపీడీవో, ఎమ్మార్వోలు ఈ మెడికల్‌ క్యాంపు నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలి. హెల్త్‌ క్యాంపు నిర్వహణకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అధికారులకు ఈ కార్యక్రమంపై ఎలాంటి సందేహాలున్నా సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం)తో నివృత్తి చేసుకోవాలి.

ప్రతి పేషెంట్‌కు ఉచిత వైద్యమే లక్ష్యం
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందాలి. పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి. ఆరోగ్య సురక్ష తొలి, రెండో దశల్లో వలంటీర్లు, సీహెచ్‌వోలు, ఏఎన్‌ఎంలు, ఆశాలు ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్యశ్రీ బ్రోచర్లను ప్రజలకు అందజేయాలి.

ఆరోగ్యశ్రీ యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవడం, వినియోగంపై వివరించాలి. ఆరోగ్యశ్రీలో గతంలో 1,050 ప్రొసీజర్లు మాత్రమే ఉంటే మనం 3,256కి పెంచాం. పథకం పరిధిని విస్తృతం చేశాం. ప్రతి పేషెంట్‌ ఈ సేవలను ఉచితంగా అందుకోవాలన్నదే మన లక్ష్యం. ఏ ఒక్కరూ వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితులు ఉండకూడదు. 

ప్రివెంటివ్‌ కేర్‌లో నూతన అధ్యాయం
ఈ నాలుగేళ్లలో ఒక్క వైద్య, ఆరోగ్య శాఖలోనే 53,126 పోస్టులను భర్తీ చేశాం. ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే భర్తీ చేసేలా మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఈ తరహా కార్యక్రమాన్ని ఎవరూ, ఎప్పుడూ చేయలేదు.

నాడు–నేడుతో అన్ని ఆసుపత్రులను జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేశాం. రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలతోపాటు వీటికి అదనంగా 5 మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏజెన్సీలో నిర్మిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్‌ క్లినిక్‌ల పాత్ర ప్రివెంటివ్‌ కేర్‌లో ఒక కొత్త అధ్యాయం.
  
► సమీక్షలో వైద్య శాఖ మంత్రి మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్‌ జవహర్‌రెడ్డి, చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ సాయిప్రసాద్, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ జానకి, సీసీఎల్‌ఏ కార్యదర్శి ఇంతియాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ వెంకట మురళీ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

ఐదు దశల్లో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ఇలా...
(( 1)) వలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు.. ఈ ముగ్గురూ కలిసి ప్రతి ఇంటినీ సందర్శిస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి ప్రజలకు వివరిస్తారు. తేదీతో పాటు ఏయే సేవలు అందిస్తారో గ్రామం/పట్టణం వారీగా తెలియజేస్తారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీపై కూడా అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యశ్రీ పథకంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఎక్కడ ఉన్నాయి? ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఎలా ఆ ఆస్పత్రులకు వెళ్లాలి? ఉచిత వైద్య సేవలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌(సీహెచ్‌వో), ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల బృందం ఆయా కుటుంబాల వద్దకు వస్తుందని, ప్రతి ఇంట్లోనూ పౌరులందరితో మాట్లాడి 7 రకాల టెస్టులకు సంబంధించిన అంశాలను మీతో చర్చిస్తారని తెలియజేస్తారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్‌ మొదలవుతుంది. 

((2)) సీహెచ్‌వో ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం, ఆశావర్కర్, వలంటీర్లు అన్ని ఇళ్లను సందర్శిస్తారు. ప్రజలకు వారి ఇంటివద్దే బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, యూరిన్, స్పూటమ్‌ (కఫం) పరీక్షలతోపాటు జ్వరంతో బాధపడుతున్న వారికి మలేరియా, డెంగీ లాంటి మొత్తం ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల ఫలితం ఆధారంగా సేకరించిన వివరాలను మొబైల్‌ యాప్‌లో నమోదు చేస్తారు. అనంతరం ప్రతి ఇంటికి, పేషెంట్‌కి ఒక కేష్‌ షీట్‌ జనరేట్‌ అవుతుంది. ఈ డేటా వివరాలు హెల్త్‌ క్యాంపు జరిగే నాటికి  ఉపయోగపడతాయి. 

((3)) మరోసారి ఓరియెంటేషన్‌ కార్యక్రమం ఉంటుంది. గ్రామం/పట్టణంలో హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించటానికి మూడు రోజులు ముందుగానే వలంటీర్, గృహ సారధులు, ప్రజా ప్రతినిధులు ఆయా చోట్ల ప్రజలకు మరోసారి గుర్తు చేస్తారు. క్యాంప్‌ నిర్వహించే రోజు అందుబాటులో ఉండాలని సమాచారం ఇస్తారు.

((4)) గ్రామం/పట్టణంలో హెల్త్‌ క్యాంపు నిర్వహిస్తారు. ఈ నెల 30వతేదీ నుంచి హెల్త్‌ క్యాంపులు ప్రారంభం అవుతాయి. ప్రతి రోజూ ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామం/పట్టణంలో క్యాంపు నిర్వహిస్తారు. గ్రామాల్లో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌/పట్టణాల్లో వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపులు జరుగుతాయి.

((5)) ప్రతి గ్రామంలో జల్లెడ పట్టిన తర్వాత ప్రజల ఆరోగ్య వివరాలు హ్యాండ్‌ హోల్డింగ్‌లో  ఉండాలి. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించాక వారికి కాలానుగుణంగా టెస్టింగ్, కన్సల్టేషన్, మందులు ఇవ్వడం అన్నది ఈ కార్యక్రమంలో ప్రధాన అంశం. మందులు లేవు, దొరకడం లేదు అన్న మాటే వినిపించకుండా చర్యలు.

మరిన్ని వార్తలు