Andhra Pradesh: వడివడిగా నిర్మాణాలు | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: వడివడిగా నిర్మాణాలు

Published Tue, Feb 1 2022 2:55 AM

CM YS Jagan review on rural development and Panchayati Raj schemes - Sakshi

నా పాదయాత్ర సమయంలో గ్రామాల దుస్థితి చూసి ఆవేదన కలిగింది. అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించకూడదు. నివాస ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండరాదు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందాలి. ఎఫ్‌ఎస్‌టీపీ (మురుగు వ్యర్థాల శుద్ధి) ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.    
– సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: ప్రాధాన్యత క్రమంలో ఉపాధి హామీ పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించారు. వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలపైనా దృష్టి సారించాలని సూచించారు. అమూల్‌ పాల సేకరణ చేస్తున్న జిల్లాలు, ప్రాంతాలకు అనుగుణంగా బీఎంసీయూలను పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి వస్తున్న నిధులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో వీటిని పూర్తి చేసేలా కార్యాచరణతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి  శాఖల పరిధిలోని ఉపాధి హామీ పనులు, జగనన్న పచ్చతోరణం, వైఎస్సార్‌ జలకళ, గ్రామీణ ప్రాంతాల్లో క్లాప్‌ కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, మంచినీటి సరఫరా తదితరాలపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

మురుగు నీటి శుద్ధి ప్రణాళిక
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, ప్రాసెసింగ్‌ను ముఖ్యమంత్రి సమీక్షించారు. నవంబర్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 22 శాతం ఇళ్ల నుంచి చెత్త సేకరణ ప్రారంభం కాగా ప్రస్తుతం 61.5 శాతానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబరు కల్లా పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత మరింత మెరుగుపడాలని, మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. మురుగు నీరు నిల్వ ఉన్న దాదాపు 582 ప్రాంతాలను ప్రత్యేక సర్వే ద్వారా గుర్తించి బయో, వెట్‌ ల్యాండ్‌ ట్రీట్‌మెంట్, వేస్ట్‌ స్టెబిలైజేషన్‌ పాండ్స్‌ తదితర విధానాల్లో రూపొందించిన శుద్ధి ప్రణాళికను అమలు చేయాలన్నారు. ఏడాదిలోగా పనులు పూర్తి కావాలని, నిర్వహణపై కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
రూ.50 కోట్ల చెక్కును ఏపీ అధికారులకు అందిస్తున్న తమిళనాడు అధికారులు  

వైఎస్సార్‌ జలకళ..
వైఎస్సార్‌ జలకళ పురోగతిపై కూడా ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్గు అప్పగించి వాటి ద్వారా రైతుల పొలాల్లో బోర్లు తవ్వాలని సూచించారు. బోరు తవ్విన వెంటనే మోటారు కూడా బిగించాలని స్పష్టం చేశారు. 

రోడ్ల నిర్మాణం, నిర్వహణ..
గత సర్కారు హయాంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులను పూర్తిగా గాలికి వదిలేశారని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు విస్తారంగా వర్షాలు కురిశాయని, అప్పటికే అధ్వానంగా ఉన్న రోడ్లు దీంతో బాగా దెబ్బతిన్నాయన్నారు. క్రమం తప్పకుండా చేపట్టాల్సిన నిర్వహణను గత సర్కారు విస్మరించడంతో అన్ని రహదారులకు ఒకేసారి మరమ్మతులు, నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉత్పన్నమైందన్నారు. రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, నిర్మాణంపై అత్యుత్తమ కార్యాచరణ రూపొందించి ఏ దశలోనూ నిర్లక్ష్యానికి గురికాకుండా క్రమం తప్పకుండా నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. నిధుల కొరత లేకుండా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

జగనన్న కాలనీల్లో రక్షిత తాగునీరు
జగనన్న కాలనీల్లో రక్షిత మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేనాటికి మౌలిక సదుపాయాల కల్పనపై ధ్యాస పెట్టాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విధానం తేవాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి.సంపత్‌కుమార్, సెర్ప్‌ సీఈవో ఎండీ ఇంతియాజ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్‌ కమిషనర్‌ శాంతిప్రియా పాండే తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.   

Advertisement
Advertisement