చంద్రబాబు కేసులో అడుగడుగునా కేంద్ర దర్యాప్తు సంస్థలే | CNS Yazulu Article On Chandrababu Naidu AP Skill Development Scam - Sakshi
Sakshi News home page

చంద్రబాబు కేసులో అడుగడుగునా కేంద్ర దర్యాప్తు సంస్థలే

Published Wed, Sep 20 2023 1:05 PM

CNS Yazulu Article On Chandrababu Skill Scam - Sakshi

371 కోట్ల రూపాయలు లూటీకి గురైన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో  అడ్డంగా దొరికిపోయి కోర్టు ఆదేశాలతో జైలుకు వెళ్లారు చంద్రబాబు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే చంద్రబాబు నాయుణ్ని  రాజకీయ కక్ష సాధింపు కింద అరెస్ట్ చేయించి జైలుకు పంపిదని టీడీపీ నేతలు, వారి మీడియాతో పాటు  చంద్రబాబు బంధువుల సారథ్యలోని బీజేపీ కూడా  అసత్య  ప్రచారం చేస్తోంది. అందరికి నిజాలు తెలిసినా విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడి దోపిడీని పట్టుకోవడంలో అడుగడుగునా కేంద్ర  ప్రభుత్వ ఆధీనంలోని  కేంద్ర దర్యాప్తు సంస్థలే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం  కక్షసాధిస్తోందని  అనడానికి చంద్రబాబు నాయుడికి కానీ టీడీపీ నేతలకు కానీ ధైర్యం చాలడం లేదు. బీజేపీ అధ్యక్షురాలు   పురంధేశ్వరికి తమ  పార్టీ నాయకత్వాన్ని నిలదీసే అవకాశం లేదు. ఈ ఇద్దరూ కలిసి ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వంపై  ఆరోపణలు చేస్తున్నారు.

✍️అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా జైలుకెళ్లినా అక్రమాల కేసులో దొరికి జైలుకెళ్లినా  చంద్రబాబు నాయుడి బంధువులకు, టీడీపీ నేతలకు బాధగానే ఉండడం సహజం. దాన్ని ఎవరూ తప్పు పట్టరు. చంద్రబాబు నాయుణ్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన అవినీతిని  దర్యాప్తు చేసిందెవరు? చంద్రబాబు పాత్ర ఉందని తేల్చిందెవరు? చివరకు చంద్రబాబును జైలుకు పంపాలని ఆదేశించింది ఎవరు? అన్నది  అందరికీ తెలుసు.

✍️చంద్రబాబు నాయుడి హయాంలో చోటు చేసుకున్న ఈ భారీ కుంభకోణాన్ని మొట్ట మొదట పసిగట్టింది జీఎస్టీ అధికారులు. అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే వారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే మీ రాజ్యంలో ఎవరో దొంగలు వందల కోట్లు భోంచేశారు మహాశయా అని జీఎస్టీ వారు ఏపీ  ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. ఆ సమాచారాన్ని వారు చంద్రబాబుకు చేరవేశారు. దోపిడీ చేసింది ఆయనే కాబట్టి చంద్రబాబు మౌన వత్రం పాటించారు. బాబు ఫేస్ చేసిన ఏసీబీ అధికారులకు విషయం అర్ధంమైంది. ఇది సర్కార్‌లో ఉన్న   పచ్చ బాసుల దోపిడీ అని.

✍️తర్వాత  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  అధికారులు రంగంలోకి దిగి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్  ముసుగులో ఏం జరిగిందా అని  దర్యాప్తు మొదలు పెట్టారు. వారు తవ్విన కొద్దీ అవినీతి వెలుగులోకి వచ్చింది.  రక రకాల డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా డబ్బులను దుబయ్‌కి పంపి అక్కడి నుండి హవాలా మార్గంలో  ఏపీ రప్పిపంచుకుని సాక్ష్యాత్తూ చంద్రబాబు నాయుడి డెన్‌కి అందించిన తీరును చూసి ఈడీ అధికారులే నివ్వెర పోయారు. వీళ్ల దుంప తెగ   చాలా స్కిల్ చూపించారుగా అని  దర్యాప్తు అధికారులు అనుకున్నారు. వందల కోట్లు ఎలా తరలించారో మొత్తం రూట్ అంతా  కనుక్కొన్నారు. అపుడే చంద్రబాబు నాయుడి దోపిడీని వారు నిర్ధరించారు. ఈ క్రమంలో  కొందరు దొంగలను ఈడీ అరెస్ట్ చేయడమే కాకుండా  వారి నుండి కోట్లాది రూపాయల డబ్బును జప్తు చేసింది.

✍️ఒక పక్క జీఎస్టీ- మరో పక్క ఈడీలు తమ దర్యాప్తు నివేదికల సమాచారాన్ని ఏపీ సీఐడీ పోలీసులకు అందించారు. అప్పటికే దీనిపై కన్నేసి ఉన్న సీఐడీ పోలీసులు తమదైన శైలిలో మరింత లోతుగా విచారించడానికి చంద్రబాబు నాయుడి పి.ఏ. శ్రీనివాస్ తో పాటు, మనోజ్ పార్ధసాని కి నోటీసులు జారీ చేసింది. సీఐడీ  నుండి నోటీసులనగానే  ఆ ఇద్దరికీ ముచ్చెమటలు పట్టాయి. ఒకరు దుబాయ్, మరొకరు అమెరికా లగెత్తుకుపోయారు. ఈ ఇద్దరినీ చంద్రబాబే ఇండియాలో లేకుండా పంపేశారని సీఐడీ అనుమానిస్తోంది.

✍️చంద్రబాబు నాయుడి షెల్ కంపెనీల గుట్టు రట్టు కావడంతోనే కేంద్రం పరిధిలోనే ఐటీ శాఖ అధికారులు కూడా చంద్రబాబు నాయుడికి నోటీసులు పంపించారు. కోట్లాది రూపాయలకు లెక్కలు చెప్పమన్నారు.వేళ్లన్నీ చంద్రబాబు నాయుడివైపే చూపించడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు సేకరించిన సాక్ష్యాధారాలతో  ఏపీ సీఐడీ చంద్రబాబును అదుపులోకి తీసుకుంది. ఏసీబీ కోర్టు చంద్రబాబును జైలుకు పంపింది.

✍️ఈ మొత్తం వ్యవహారం అంతా కేంద్ర దర్యాప్తు సంస్థల  ఆధ్వర్యంలోనే జరిగాయి. అయితే టీడీపీ కానీ, టీడీపీ అనకూల మీడియాకానీ..చంద్రబాబు నాయుడి బంధువైన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కానీ కేంద్ర దర్యాప్తు సంస్థల పాత్ర గురించి మాట్లాడ్డం లేదు. కేంద్ర ప్రభుత్వానికి తెలీసే మొత్తం  దర్యాప్తు జరిగిందని తెలిసినా కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదు. అడ్డంగా దొరికిపోయి జైలుకు పోయామన్న  ఉక్రోషంతో  ఇదంతా ఏపీ ప్రభుత్వ పాపం అన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు.  బీజేపీ మిత్ర పక్షంగా ఉంటూ టీడీపీతో ఏకపక్షంగా పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కూడ ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలు వెలికి తీసిన కుంభకోణమని తెలుసు. కానీ కేంద్రాన్ని ప్రశ్నించాలంటే కొంచెం భయం ..అంతే. అందుకే ఆయన కూడా బాబు ఆదేశాలతో  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం చిమ్ముతున్నారు.

✍️పచ్చ పెద్దలు నాటాకాలాడితే ఆడారు కానీ.. చంద్రబాబు లూటీ  చేసిన తీరు గురించి ఇపుడు ఏపీలో  చంద్రబాబు నాయుడి మనవడు దేవాన్ష్ వయసున్న  చిన్నారులకు కూడా  స్పష్టంగా అర్ధమైపోయింది. చంద్రబాబే దోషి అని ఆ సైజు పిల్లలు కూడా అంటున్నారు. దీన్నే బాబు అండ్ కో జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ అజీర్తితోనే ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోటికొచ్చింది పేలుతున్నారు.
-సీఎన్‌ఎస్‌ యాజులు, సీనియర్‌ జర్నలిస్టు

Advertisement
Advertisement