నువ్వెవరు.. ఇక్కడ పెత్తనం మాది! | Sakshi
Sakshi News home page

నువ్వెవరు.. ఇక్కడ పెత్తనం మాది!

Published Fri, Aug 11 2023 5:02 AM

Differences between Gannavaram Constituency TDP leaders - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదా­లు మరోసారి భగ్గుమన్నాయి. చంద్రబాబు చేసిన ప్రయోగం వికటించి... కమ్మ, కాపు నేతలు రెండు వర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎదుటే ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకుని వీరంగం సృష్టించారు. హనుమాన్‌జంక్షన్‌లోని టీడీపీ కార్యాలయంలో గురువారం టీడీపీ నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహించారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు హాజరైన ఈ సమావేశం ప్రారంభంలోనే రసాభాసగా మారింది.నియోజకవర్గ పరిశీ­లకుడు హరిబాబు నాయుడుపై గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వ­రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఖర్చు మాది... మేం లోకల్‌.. నువ్వు నాన్‌లోకల్‌. మామీద నీ పెత్తనం ఏమిటీ. నాకు నేరుగా చంద్రబాబుతోనే సంబంధాలు ఉన్నాయి. నువ్వెంత. ఇక్కడ మాదే పెత్తనం...’ అంటూ జాస్తి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. హరిబాబు నాయుడుపై జాస్తి వెంకటేశ్వరరావు­తోపాటు మరికొందరు నాయకులు దాడి చేసేందుకు దూసుకెళ్లారు.

దీంతో హరిబాబు నాయుడు సైతం తీవ్రంగా స్పందించడంతో సమావేశంలో పాల్గొన్న నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కమ్మ, కాపు నేతలు రెండు వైపులకు చేరి ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. హరిబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉంగుటూరు మండల టీడీపీ అధ్యక్షుడిని సైతం స్థానిక నేతలు రెచ్చగొ­ట్టారు. దీంతో గొడవ తారాస్థాయికి చేరింది. ఈ సమయంలో కొనకళ్ల నారాయణరావు జోక్యం చేసుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఇరువర్గాలు వినకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు.

వికటించిన చంద్రబాబు ప్రయోగం... 
టీడీపీ గన్నవరం నియోజకవర్గ పరిశీలకుడిగా  గుంటూరు జిల్లాకు చెందిన కాపు నేత వడ్రాం హరిబాబు నాయుడును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించాడు. నియోజక­వర్గంలోని కాపు­లను సమన్వయం చేస్తారనే ఉద్దేశంతో ఆయ­న­కు పరిశీలకుడి బాధ్యతలు అప్పగించారు. అయి­తే, హరిబాబు నియామకం తొలి నుంచి ఇక్కడ కొందరు నాయకులకు నచ్చలేదు. ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమా అనుచరులుగా ఉంటూ మట్టిదోపిడీ, సెటిల్‌మెంట్లు చేసిన­వారికి హరిబాబు నియామకం మింగుడు పడలేదు. దీంతో ఆధిపత్యం కోసం పోరు జరుగుతూనే ఉంది.

ఇటీవల నిర్వహించిన ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ బస్సు­యాత్ర­లో హరిబాబు నాయుడు యాక్టివ్‌గా వ్యవహ­రించడాన్ని స్థానిక నేతలు జీర్జించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారమే గురువారం జాస్తి వెంకటేశ్వరరావు గొడవకు దిగడంతోపాటు ఆ తర్వాత ఉంగుటూరు మండల అధ్యక్షుడు కూడా నిరసన తెలియజేసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీలో కొందరు నేతల ఆధిపత్య, అహంకారపూరిత ధోరణి వల్లే ఈ గొడవ జరిగిందని, వీరి వైఖరి వల్ల అన్ని సామాజికవర్గాలు పార్టీకి దూరమవుతున్నాయని కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం.   

Advertisement
Advertisement