ఘనంగా గణతంత్ర దినోత్సవం  | Sakshi
Sakshi News home page

ఘనంగా గణతంత్ర దినోత్సవం 

Published Sat, Jan 27 2024 4:35 AM

Happy Republic Day celebrations - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/కర్నూలు(సెంట్రల్‌): రాష్ట్రంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి, హైకోర్టు, సీఎం క్యాంపు కార్యాలయం, ఏపీ సచివాలయం, మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయం, ఆర్టీసీ హౌస్‌ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి.   

రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన: మోషేన్‌రాజు, తమ్మినేని
రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగడం చాలా సంతోషంగా ఉందని శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో వారిద్దరూ జాతీయ జెండాలను ఎగురవేశారు. మోషేన్‌రాజు, తమ్మినేని సీతారాం మాట్లాడుతూ నేడు పరిపాలన ఇంత సాఫీగా సాగుతోందంటే అందుకు రాజ్యాంగమే కారణమన్నారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ రామాచార్యులు, ఉప కార్యదర్శులు సుబ్బరాజు, విజయరాజు, చీఫ్‌ మార్షల్‌ డి.ఏడుకొండలరెడ్డి, లీగల్‌ అడ్వైజర్‌ ఎం.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.
  
ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం: సీఎస్‌ 
సమాజంలోని అందరం కలిసి బాధ్యతతో మెలుగుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. సీఎస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని.. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని సూచించారు. సచివాలయ ముఖ్య భద్రతాధికారి కె.కృష్ణమూర్తి, జీఏడీ ఉప కార్యదర్శి రామసుబ్బయ్య, శ్రీనివాస్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, ఎస్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్లు ఎం.వెంకటేశ్వర్లు, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

సీఎం క్యాంపు ఆఫీసులో...
తాడేపల్లిలోని సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీఎం అదనపు కార్యదర్శి భరత్‌ గుప్తా, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఆర్టీసీ భవన్‌లో...
విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ పీఎస్‌ ప్రద్యుమ్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన 24 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అం­దించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు కేఎస్‌ బహ్మానం­దరెడ్డి, కోటేశ్వర­రావుతోపాటు అధికారులు, ఉద్యోగు­లు పాల్గొన్నారు.

విద్యుత్‌ సౌధలో...
విజయవాడలోని విద్యుత్‌ సౌధలో జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకల్లో రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్‌  పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఏపీ ట్రాన్స్‌కో మాజీ (థర్మల్‌) జి.విజయకుమార్‌కు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. విద్యుత్‌ సౌధ వద్ద నిర్మించిన 100 కిలోవాట్ల సోలార్‌ పార్కింగ్‌ను విజయానంద్‌ ప్రారంభించారు. ఏపీజెన్‌కో ఎండీ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్‌ జేఎండీ బి.మల్లారెడ్డి, చీఫ్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ టి.పనాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

ఏపీ భవన్‌లో గణతంత్ర వేడుక
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రెసిడెంట్‌ కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. అడిషనల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ హిమాన్షు కౌశిక్‌ పాల్గొన్నారు. 

హెచ్‌ఆర్‌సీ కార్యాలయంలో... 
కర్నూలులోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయంలో  హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ సీతారామమూర్తి జాతీయ జెండాను ఎగురవేశారు. లోకాయుక్తలో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ టి.వెంకటేశ్వరరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ నరసింహారెడ్డి, డిప్యూటీ రిజి్రస్టార్‌ పోలయ్య తదితరులు పాల్గొన్నారు.  

ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలకం
రిపబ్లిక్‌డే వేడుకల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ 
సాక్షి, అమరావతి: రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. హైకోర్టులో శుక్రవారం జరిగిన 75వ గణతంత్ర దినోత్సవానికి జస్టిస్‌ ఠాకూర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని విభిన్న సంస్కృతుల కారణంగా ప్రజలకు న్యాయ సేవలను, సత్వర న్యాయాన్ని అందించడం సవాళ్లతో కూడుకున్న పని అని అన్నారు.

సవాళ్లను అధిగమించి న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పేదరికం, అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటికీ కొన్ని వర్గాలకు న్యాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయాన్ని పేదల ముంగిటకు తీసుకువెళ్లేందుకు న్యాయసేవాధికార సంస్థ ఎంతో కృషి చేస్తోందని తెలిపారు.

మన న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 8,960 అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి ప్రజలకు అవగాహన కలిగించిందని వివరించారు. రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం న్యాయమూర్తులు హైకోర్టు వద్ద మొక్కలు నాటారు.  

Advertisement
Advertisement