28న విశాఖలో 1.43 లక్షల మందికి ఇళ్ల పట్టాలు | Sakshi
Sakshi News home page

28న విశాఖలో 1.43 లక్షల మందికి ఇళ్ల పట్టాలు

Published Fri, Apr 22 2022 4:24 AM

Jogi Ramesh Comments On House Patta Distribution in AP - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో ఈ నెల 28న 1.43 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్‌ తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా వీటిని అందజేస్తామని చెప్పారు. గురువారం విజయవాడలోని ఏపీ గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో మంత్రి జోగి రమేశ్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన తొలి దశ ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయడానికి కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.

నిర్మాణాలకు నిధుల సమస్య లేదని చెప్పారు. లబ్ధిదారులను చైతన్యపరిచి ఇంటి నిర్మాణాల వేగం పెంచాలని సూచించారు. ఇప్పటికే 24 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో లక్ష నిర్మాణాలను మే 15 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పురోగతిని ప్రతి రోజూ సమీక్షించాలని.. సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ప్రతి ఉద్యోగి దీన్ని బాధ్యతగా భావించి పనిచేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ మాట్లాడుతూ.. రోజుకు సగటున రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల విలువైన నిర్మాణ పనులు పూర్తి చేయటానికి చర్యలు చేపట్టామని తెలిపారు. సమీక్షలో గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా, ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌ పాండే తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
Advertisement