Sakshi News home page

పెదపూడి స్థూపం.. స్మారక చిహ్నం 

Published Mon, Jan 3 2022 12:50 PM

Kalluri Chandramouli pedapudi memorial statue Satyagraha Vijay - Sakshi

పెదపూడి (తెనాలి):  తెనాలికి సమీపంలోని అమృతలూరు మండల గ్రామం పెదపూడి గ్రామ పంచాయతి ఆవరణలో గల సత్రాగ్రహ విజయ స్థూపం ఇప్పుడు జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఆజాదీ కా అమృతోత్సవం’లో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రాచీన కట్టడాల గుర్తింపు, పరిరక్షణలో ఈ స్థూపాన్ని చేర్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత సామాజిక శాస్త్రాల పరిశోధన మండలి గుర్తింపు కలిగిన దేశంలోని ఆరు సంస్థల్లో ఒకటైన తిరుపతి కేంద్రంగా గల భారత గ్రామీణ అధ్యయనం, పరిశోధన అకాడమీ (అగ్రశ్రీ) సంస్థ ఇందుకు పూనుకుంది.  

పెదపూడిలోని పంచాయతీ కార్యాలయం ఆవరణలో గల స్థూపానికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. 25 అడుగుల ఎత్తులో పైభాగాన మూడు సింహాలతో గల స్థూపాన్ని చంద్రమౌళి సత్రాగ్రహ విజయస్థూపంగా పేర్కొంటారు. పెదపూడి నుంచి స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జరిగిన  సత్యాగ్రహంలో పాల్గొన్న  16 మంది సత్యాగ్రహుల పేర్లనూ దీనిపై లిఖించారు.  నాటి ఉమ్మడి మద్రాస్‌ ప్రభుత్వంలో పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి, అమృతలూరు మండలం మోపర్రుకు చెందిన రాజకీయ దిగ్గజం కల్లూరి చంద్రమౌళి స్ఫూర్తితో  1952లో నాటి పెదపూడి పంచాయతీ సర్పంచ్‌ చదలవాడ వెంకట సుబ్బయ్య ఈ స్థూపాన్ని నిర్మించారు. రఘుపతి రాఘవ రాజారాంతో సహా బాపూజీ సూక్తులను చెక్కించారు. 

గ్రామ స్వరాజ్యం కోసం కల్లూరి కృషి 
గాందీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తొలి పునాదిగా సమగ్ర పంచాయతీ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన ధీశాలి కల్లూరి చంద్రమౌళి స్వస్థలం పెదపూడికి సమీపంలోని మోపర్రు. తెనాలి, గుంటూరు, కలకత్తాలో చదివారు. ఇంగ్లండ్‌లో ఉన్నత విద్య చదివారు. అక్కడే ఉద్యోగం వచ్చింది.  దేశం కోసం జరిగే పోరాటంలో పాల్గొనాలని భావించి, స్వదేశానికి వచ్చేశారు. దేశవ్యాప్తంగా పర్యటించారు. 

గాందీజీ ఆశ్రమంలో గడిపారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని పలుసార్లు జైలుకెళ్లారు. 1933–1962లో జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో 1934లో జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయాన్ని తెనాలిలో ఏర్పాటు చేశారు. జస్టిస్‌ పార్టీ ఆధిపత్యానికి గండికొట్టి 1937లో మద్రాస్‌ ప్రావిన్స్‌కు తెనాలి–రేపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేగా, 1938లో జిల్లాబోర్డు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1945లో ఆంధ్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియమితులై, 1946లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజ్యాంగ పరిషత్‌ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. 1947 మార్చిలో రామస్వామి రెడ్డియార్‌ మంత్రివర్గంలో స్థానిక స్వపరిపాలన, సహకారశాఖ మంత్రిగా నియమితులయ్యారు.  

పంచాయతీ చట్టం రాజ్యాంగ పరిషత్‌లో చట్టరూపం దాల్చలేదని భానవ కలిగిన చంద్రమౌళి, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర స్వపరిపాలన మంత్రిగా నియమితులయ్యాక, ఆ చట్టాన్ని తానే రూపొందించారు. మహాత్ముడి ప్రధాన ఆశయమైన గ్రామస్వరాజ్యం కోసం దేశంలోనే మొదటగా సమగ్ర పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చారు. గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. పంచాయతీలను స్వయంపాలకంగా మార్చటానికి అనేక అంశాలను చేర్చారు. పేదల ఇళ్లపై పన్నుల రాయితీ అధికారాన్ని పంచాయతీలకు కట్టబెట్టారు. సర్పంచ్‌కు చెక్‌పవర్‌ అప్పగించారు. అన్ని రంగాల్లోనూ గ్రామ జీవనాన్ని వారే నిర్వహించుకుంటూ, గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయటం చట్టం ప్రధాన ఉద్దేశం. ఇలా గ్రామసీమల అభివృద్ధికి 1950లోనే కల్లూరి చంద్రమౌళి బీజం వేశారు. 

భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించాక కూడా 
చంద్రమౌళి తనదైన పంథాలోనే పనిచేశారు. 1955లో వేమూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ, దేవదాయ మంత్రిగా చేశారు. 1960లో దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో దేవదాయ, సహకారశాఖ మంత్రిగా పనిచేశారు. 1962లో మరోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకు అవసరమైన సేవలు అందించటంలో చంద్రమౌళి వెనకాడేవారు కాదు. ప్రజాసేవకు ఏవైనా రూల్స్‌ అడ్డుగా ఉంటే, నిస్సంకోచంగా వాటిని తొలగించమని ఆదేశించేవారు.

‘అయామ్‌ ది గవర్నమెంట్‌’ అంటూ భరోసా ఇచ్చేవారు. తిరుగులేని ఆయన నిర్ణయాలకు ఎదురుండేది కాదు. రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చారు. 1965లో రాజకీయాల నుంచి విరమించుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భాన దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుగుతున్న వేళ పెదపూడిలోని విజయ స్థూపం,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై దశాబ్ద కాలానికిపైగా కృషిచేస్తున్న అగ్రశ్రీ సంస్థ దృష్టికొచ్చింది. స్మారక చిహ్నంగా గుర్తించి, ప్రభుత్వాల సాయంతో పరిరక్షణ, సుందరీకరణకు హామీ లభించింది

స్మారక చిహ్నంగా గుర్తించాం  
పెదపూడి స్థూపాన్ని స్మారక చిహ్నంగా గుర్తించాం. ఇటీవల అమృతలూరు మండల, పెదపూడి పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలతో జూమ్‌ సమావేశం నిర్వహించి, అభిప్రాయాలను తెలుసుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పరిరక్షణకు తగిన కృషి చేస్తాం. 
– డాక్టర్‌ సుందర రామ్, సంచాలకుడు, అగ్రశ్రీ 

Advertisement

What’s your opinion

Advertisement