'భాజా, భజంత్రీల మీడియా'కు ఆపరేటర్‌గా బాబు! | Kommineni Srinivasa Rao Comments On Chandrababu Naidu Lies, Details Inside - Sakshi
Sakshi News home page

'భాజా, భజంత్రీల మీడియా'కు ఆపరేటర్‌గా బాబు!

Published Thu, Mar 21 2024 2:19 PM

Kommineni Comment On Babu Lies - Sakshi

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏది చెబితే అదే నిజం అని ప్రజలు నమ్మాలి. ఆయన ఎన్నిసార్లు మాట మార్చితే అదే కరెక్టు అని ప్రజలంతా అనుకోవాలి. ఆయన ప్రధాని మోదీని పొగిడితే ఆహా, ఓహో అని అంతా చెప్పాలి. మోదీని బండ బూతులు తిడితే బాగుంది.. బాగుంది అని చెప్పాలి. అవును.. నిజమే మరి! చంద్రబాబు ఏది చెబితే అదే రైట్!. ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి మీడియా సంస్థలు ఆయనకు భాజా భజంత్రీలు వాయిస్తాయి కనుక, బాకాలు ఊదుతాయి కనుక, తాను ఏమి చేసినా రాష్ట్రం కోసమే చేస్తానని చంద్రబాబు ఊదరగొట్టుకుంటారు కనుక, రాష్ట్రం కోసం.. అనే బ్రహ్మ పదార్ధాన్ని చంద్రబాబు నాయుడు వాడుకున్నట్లుగా మరెవ్వరూ వాడుకుని ఉండరు.

'ఆయనకు అధికారం ఇస్తే రాష్ట్రం అంతా వెలుగులు చిమ్ముతున్నట్లు, ఆయన అధికారం కోల్పోతే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయినట్లు భ్రమ కల్పించే మీడియా మాత్రమే ఉన్నప్పుడు జనం కూడా కొన్నిసార్లు అదంతా నిజమేనని మోసపోతుంటారు.' ఆ మోసపోవడం కూడా రాష్ట్రం కోసమే అని అనుకోవాలి. ఆయన రాజకీయ జీవితం అంతా ఈ పదాన్ని అడ్డుపెట్టుకునే జనాల్ని మోసం చేస్తూనే వచ్చారని చెప్పడంలో ఎక్కడా అసత్యం లేదు.

ఒక్కసారి గతానికి వెళదాం. 1995 నుంచి తన మామ ఎన్టీ రామారావును ఒక్కపోటు పొడిచి పదవి నుంచి లాగి అవతల పారేశారు. అప్పుడు కూడా చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ వంటివారు చెప్పిన మాట ఇదే. రాష్ట్రం కోసం, తెలుగుదేశం పార్టీ కోసమనే. 'NT రామారావు స్త్రీ లోలుడయ్యారని, ఆయన వల్ల చాలా నష్టం జరిగిపోతుందని' చంద్రబాబు ప్రచారం చేశారు. అదే నిజమని తను అప్పటికే ఆకట్టుకున్న మీడియా ద్వారా జనంపై రుద్దారు.

ఎన్‌టీ రామారావు అప్పట్లో ఒక వీడియో చేశారు. 'చంద్రబాబు అంత నీచుడు లేడని, ఔరంగజేబు వంటివాడని' తీవ్ర స్తాయిలో మండిపడ్డారు. ఎన్‌టీ రామారావు సొంతంగా మరో పార్టీని పెట్టుకోవడానికి సన్నద్దమవుతున్న తరుణంలో.. పార్టీ బ్యాంకు ఖాతాలలోని డబ్బును చంద్రబాబు వర్గం తన పరం చేసుకుంది. దాంతో ఎన్‌టీ రామారావు గుండెపోటుకు గురై మరణించారు. ఆ వెంటనే 'ఎన్‌టీ రామారావు వారసత్వం తమదేనని, ఆయన గొప్పవాడని, ఆయన ఆదర్శాల కోసమే టీడీపీ ఉన్నదని' కొత్త బాణి ఎత్తుకున్నారు. ఇదంతా రాష్ట్రం కోసమేనని ప్రజలు అనుకోవాలని అన్నారు. దాన్నే పచ్చమీడియా ఘనంగా ప్రచారం చేసింది, ఇప్పుడు కూడా చేస్తోంది. ఇక్కడ గమనించాల్సింది ఎన్టీఆర్‌ గుణగణాలను కాదు.. చంద్రబాబు గోబెల్స్‌ ధోరణిని.

  • 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీని మసీదులు కూల్చేపార్టీ అని ఆయన అన్నారు.
  • అప్పట్లో కమ్యూనిస్టులతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. ఇదంతా రాష్ట్రం కోసమని చెప్పారు.
  • టీడీపీ అధికంగా లోక్‌సభ సీట్లు గెలిస్తేనే మద్యం నిషేధం కొనసాగుతుందని, రెండు రూపాయలకు కిలో బియ్యం స్కీము కొనసాగుతుందని అనేవారు.
  • తీరా ఎన్నికలు అయిపోయాక మద్య నిషేధం ఎత్తివేయాలని, బియ్యం రేటు పెంచాలని ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నామని అన్నారు. ఇదంతా రాష్ట్రం కోసమేనని అన్నారు.
  • 1996లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్‌లో టీడీపీ భాగస్వామి అయింది. దీనిని కూడా రాష్ట్రం కోసమేనని ప్రచారం చేశారు.
  • 1998లో యూఎఫ్ నుంచి ఎవరికి చెప్పకుండా బీజేపీ కూటమిలోకి జంప్ చేశారు. 1999 లో బీజేపీతో కలిసి పోటీచేసి రాష్ట్రం కోసం అని అన్నారు.
  • 2001లో గుజరాత్‌లో మత కలహాలు జరిగినప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని నరహంతకుడు అని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
  • తీరా పార్లమెంటులో మోదీ వ్యతిరేక తీర్మానం పెట్టినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయకుండా జారిపోయారు.
  • 2004లో ఓడిపోయిన తర్వాత జన్మలో బీజేపీతో కలిసి పోటీచేయనని అన్నారు.
  • ముస్లింలకు బీజేపీ వ్యతిరేకమని అన్నారు.
  • 2008లో రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు.
  • 2009లో టీఆర్‌ఎస్‌, సీపీఐ, సీపీఎంలతో కలిసి పోటీచేసి అదంతా రాష్ట్రం కోసం అని చెప్పారు.

టీడీపీ ఏపీ నేతలు వద్దన్నా, రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖ ఇచ్చారు. తీరా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చేసిన తర్వాత తెలంగాణలో తనవల్లే రాష్ట్రం ఏర్పడిందని, ఆంధ్రను కాంగ్రెస్ నాశనం చేసిందని ప్రచారం చేశారు. సోనియాగాంధీ దెయ్యం, ఇటలీ మాఫియా అని ధ్వజమెత్తేవారు. ఇదంతా రాష్ట్రం కోసమేనని అనుకోవాలి. అలాగే ప్రచారం చేయించారు కూడా.

  • 2014నాటికి మళ్లీ మోదీ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి బతిమలాడి మరీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.
  • పవన్ కల్యాణ్‌ ఇంటికి వెళ్లి పొత్తు కోరారు.
  • మోదీ, పవన్‌కల్యాణ్‌లతో కలిసి తిరుపతిలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు.
  • లక్ష కోట్ల రూపాయల రుణాల మాఫీకి హామీ ఇచ్చారు.

రాష్ట్రం కోసమే ఇలా చేస్తున్నానని చెప్పేవారు. ఎలాగో అలా అధికారం సంపాధించాక రాష్ట్రం కోసం మానిఫెస్టోని వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు. ప్రత్యేక హోదాపై రెండుసార్లు మాట మార్చారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నవనిర్మాణదీక్షలు, టరమ్ చివరిలో బీజేపీకి వ్యతిరేకంగా ధర్మపోరాట దీక్షలు చేసింది రాష్ట్రం కోసమేనని నమ్మబలికారు.

  • ప్రధాని మోదీని టెర్రరిస్టు అని, మోసగాడు, అవినీతిపరుడు అని విమర్శించారు
  • కుటుంబాన్ని పట్టించుకోని వ్యక్తి మోదీ అని, భార్యబిడ్డలు లేని వ్యక్తి అని చంద్రబాబు దూషించాడు.
  • అది రాష్ట్రం కోసమేనని అనుకోమన్నారు.
  • రుణమాఫీ హామీపై రైతులు ప్రశ్నిస్తే వారిని ఆశపోతులు అని విమర్శించారు.

2018లో తెలంగాణలో కాంగ్రెస్‌తో జత కట్టినా, 2023లో కాంగ్రెస్‌కు పరోక్ష మద్దతు ఇచ్చినా ఏపీ ప్రయోజనాలకోసమేనని జనమంతా అనుకోవాలి కాబోలు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని రాత్రికి రాత్రే పెట్టేబేడా సర్దుకుని ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదలుకుని విజయవాడ పారిపోయింది ఏపీ ప్రయోజనాల కోసమేనని నమ్మించడానికి తన వర్గం మీడియా ద్వారా యత్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, బీజేపీ నుంచి విడిపోయినా రాష్ట్రం కోసమేనని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థల ద్వారా ప్రచారం చేసి జనాన్ని మోసం చేయడానికి యత్నించారు.

వీటన్నిటి ఫలితమే 2019లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం అని చెప్పాలి. ఆ ఓటమి తర్వాత మళ్లీ బీజేపీ పంచన చేరడానికి నానా పాట్లు పడ్డారు. పవన్ కల్యాణ్‌ను ప్యాకేజీ ఇచ్చో, ఏదో రకంగా లొంగదీసుకుంది.. అతని ద్వారా బీజేపీతో రాయబారం చేసింది.. ఇదంతా రాష్ట్రం కోసమే. 2019 ఎన్నికలలో జగన్‌మోహన్‌రెడ్డికు ఓటు వేస్తే మోదీకి వేసినట్లేనని, ముస్లింలు, క్రిస్టియన్‌లను బతకనివ్వరని ప్రచారం చేసింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. 2024లో ఢిల్లీలో తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి చంద్రబాబు ఏపీలో ఒక్కశాతం ఓట్లు కూడా లేని బీజేపీతో జట్టు కట్టింది రాష్ట్రం కోసమేనట. దేశ ప్రధాని మోదీ పోలవరంను చంద్రబాబు ఏటీఎమ్‌గా మార్చుకున్నారని ఆరోపించినా, మోదీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నా.. చివరికి రాజీ కుదుర్చుకుంది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనట.

ఇలా రాష్ట్రం కోసం, రాష్ట్ర  భవిష్యత్తు కోసం అని పచ్చి అబద్దాలను ప్రచారం చేయడం ద్వారా ఏపీ ప్రజలను మోసం చేయడానికి భజంత్రి మీడియాను ఆపరేట్ చేస్తున్నారు. 'నిజానికి ఇదంతా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల స్వార్ధ ప్రయోజనాల కోసం. అధికార దాహంతోను, కేసుల భయం నుంచి బయటపడడానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు తప్పితే, ఇందులో రాష్ట్ర ప్రయోజనం లేదు.. వంకాయ లేదు.' అదేదైనా ఉంటే తాము పొత్తు ఫలానా డిమాండ్ల మీద పెట్టుకున్నామని చెప్పే ధైర్యం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు ఉందా? ఒకపక్క బీజేపీ వారు టీడీపీ అంటే చీదరించుకుంటున్నారని, తనను చివాట్లు పెట్టారని పవన్కల్యాణ్‌ చెప్సినా సిగ్గులేకుండా ఆ పార్టీ పొత్తు కోసం తహతహలాడి, బతిమిలాడో, బామాలో పొత్తు పెట్టుకుని ఇప్పుడు మళ్లీ రాష్ట్రం కోసమని గాత్రం ఆరంభించారు. దీనిని నమ్మేవారు ఎవరైనా ఉంటే అది వారి ఖర్మ.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్టు

Advertisement
Advertisement