సమగ్ర అభివృద్ధికి ‘వైఎస్సార్ ఏపీ వన్‌’: గౌతమ్‌రెడ్డి

10 Aug, 2020 11:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టించే పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేలా సులువైన నిబంధనలతో ‘వైఎస్సార్ ఏపీ వన్’ పేరిట సింగిల్‌ విండో కేంద్రం ఏర్పాటు చేశామని పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. నూతన పారిశ్రామిక పాలసీని మంత్రి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా సోమవారం ఆవిష్కరించారు. (పారిశ్రామికాభివృద్ధికి దిక్సూచి) 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వేత్తలను, నైపుణ్యం కలిగిన యువతను పరిశ్రమలకు అందించడమే లక్ష్యంగా నూతన పాలసీని తీసుకువచ్చామన్నారు. గత ప్రభుత్వం అమలుకు సాధ్యం కాని అంశాలను రూపొందించిందన్నారు. గత ప్రభుత్వ హామీలు అమలు చేయడం జాతీయ స్థాయిలోనే సాధ్యం కాదు. అందుకే కొత్త పారిశ్రామిక విధానాన్ని సరళంగా రూపొందించామని తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా దీన్ని అమలు చేస్తామన్నారు. కోవిడ్ పరిస్థితి ల్లో పారిశ్రామిక విధానం వచ్చే మూడేళ్లకే రూపొందించామని వివరించారు.

వైఎస్‌ జగన్‌ విజన్‌కు నిదర్శనం..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజన్‌కు ఇండస్ట్రియల్‌ పాలసీ నిదర్శనమని ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా అన్నారు. కొత్త పాలసీతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ఉంటుందని పేర్కొన్నారు. కొత్త పాలసీ పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఉంటుందన్నారు. ‘‘పలు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే విధంగా కొత్త పాలసీ. కొత్త పాలసీ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఉంది. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు స్టాంప్ డ్యూటీ, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని’  ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన యువతను కల్పిస్తామని, కొత్త పాలసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉంటుందని రోజా తెలిపారు.

నూతన పారిశ్రామిక విధానం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా