ఆక్వా పార్కుతో రైతుకు మరింత భరోసా  | Sakshi
Sakshi News home page

ఆక్వా పార్కుతో రైతుకు మరింత భరోసా 

Published Sat, May 20 2023 4:05 AM

More assurance for the farmer with Aqua Park - Sakshi

బాపట్ల జిల్లాలో ఆక్వా పార్కు ఏర్పాటు వల్ల వేలాది మంది రైతులకు అనేక విధాలుగా మేలు కలగనుంది. రైతులకు స్థానికంగా అవసరమైన నాణ్యమైన సీడ్‌ దొరకనుంది. ప్రాసెసింగ్‌ యూనిట్లు కూడా అందుబాటులోకి రానుండటంతో గిట్టుబాటు ధర లభించనుంది. ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతులు చేసే అవకాశం ఉంటుంది.

ఇప్పటి వరకు జిల్లాలోని రేపల్లె, నిజాంపట్నం, బాపట్ల, కర్లపాలెం, పిట్టలవారిపాలెం, చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, నగరం, భట్టిప్రోలు తదితర మండలాల పరిధిలో 21,400 ఎకరాల్లో రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 2013 నుంచి వెనామీ రకం 80 శాతం సాగు చేస్తుండగా, మిగిలిన రకాలు 20 శాతం సాగు చేస్తున్నారు.   – సాక్షి ప్రతినిధి, బాపట్ల

ఆక్వా పార్కు రైతులకు వరం
రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలంలోని పరిశావారిపాలెం వద్ద రూ.185 కోట్లతో 280 ఎకరాల్లో ఆక్వా పార్కు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఈ పార్కులో పీతలు, పండుగప్పలతోపాటు పలు రకాల చేపలు, రొయ్యల సీడ్‌ను ఉత్పత్తి చేయనున్నారు.

ప్రస్తుతం వెనామీ, టైగర్‌ రొయ్యలు, పీతలు, పండుగప్పల సీడ్‌ను రైతులు తమిళనాడులోని రామే శ్వరం, రామనాథపురంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి తదితర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు అధికం కావడంతో రైతులకు ఆరి్థక భారం పెరుగుతోంది. అదేవిధంగా ప్రస్తుతం రైతుల నుంచి వ్యాపారులు రొయ్యలు, చేపలు కొనుగోలు చేసి కృష్ణపట్నం, కాకినాడ, చెన్నై ప్రాంతాలకు తీసుకువెళ్లి అక్కడే ప్రాసెసింగ్‌ చేసి ఎగుమతి చేస్తున్నారు.

జిల్లా నుంచి ఏటా 52 దేశాలకు రూ.2వేల కోట్ల విలువైన రొయ్యలు, రూ.250 కోట్ల మేర చేపల ఎగుమతులు జరుగుతున్నాయి. అయినా స్థానికంగా ప్రాసెసింగ్‌ యూనిట్‌ లేకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లభించడంలేదు. ఆక్వా పార్కు ఏర్పాటు వల్ల స్థానికంగా సీడ్‌ దొరకడంతోపాటు ప్రాసెసింగ్‌ యూనిట్లు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల రైతులకు ఖర్చులు తగ్గడంతోపాటు అధిక ధరలు లభించనున్నాయి. ఫలితంగా జిల్లాతోపాటు సమీప ప్రాంతాల్లో పదివేల ఎకరాల వరకు ఆక్వా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.    

రైతులకు మరింత మేలు 
మా ప్రాంతంలో ఆక్వా పార్కు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మరింత మేలు కలుగుతుంది. ఇక్కడ రొయ్యలతోపాటు పీతలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. స్థానికంగా పీతల సీడ్‌ దొరకదు. తమిళనాడుకు వెళ్లాలంటే రవాణా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే సీడ్‌ దొరికితే ఖర్చులు తగ్గుతాయి. గిట్టుబాటు ధర లభిస్తుంది.  
– మోపిదేవి శివనాగేశ్వరరావు, ఆక్వా రైతు, నిజాంపట్నం   

జగనన్నకు ధన్యవాదాలు  
మా మండలంలో ఆక్వా పార్కు ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం జగనన్నకు ధన్యవాదాలు. పార్కు వస్తే అన్ని రకాల సీడ్‌ దొ రుతుంది. రవాణా ఖర్చులు మిగులుతాయి. ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మంచి ధర లభిస్తుంది.  
– కొక్కిలిగడ్డ జగదీష్, నిజాంపట్నం మండలం  

Advertisement
Advertisement