National Govt Appreciation For Andhra Pradesh Education Reforms, Details Inside - Sakshi
Sakshi News home page

ఎంతటి మార్పు.. ఏపీలా ‘చదువుదాం’

Published Mon, Jun 26 2023 4:23 AM

National Govt appreciation for Andhra Pradesh education reforms - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కేవలం నాలుగేళ్లలోనే ప్రభుత్వ బడి రూపురేఖలు మారాయి. బడికి వచ్చే విద్యార్థుల మోముల్లో వెలుగు నిండింది. ప్రపంచంతో పోటీ పడేలా పాఠ్యాంశాలు, బోధనలో మార్పులు, టెక్నాలజీ వినియోగం, చదువు పట్ల ఆసక్తి పెంచేలా పథకాలు.. వెరసి విద్యా రంగంలో రాష్ట్రం రోల్‌ మోడల్‌గా నిలిచింది. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన పాలకులకు ఉంటే ఎంతటి అద్భుతాలు చేయవచ్చో.. పేద పిల్లల జీవితాలను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దవచ్చో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి తెలుసుకోవాలని పలు రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు సైతం ఆసక్తి చూపుతున్నారంటే ఎంతటి మార్పు వచ్చిందో ఇట్టే తెలుస్తోంది.

జీ–20లో భాగంగా ఈ నెల 16 నుంచి 22 వరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘జన్‌ భాగీదారీ’ కార్యక్రమాన్ని పూణెలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధ చర్చకు వచ్చింది. నూతన విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ–2020) అనుసరించి ఫౌండేషనల్‌ స్కూల్‌ నిర్వహణపై దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేసే విధానాలను ఇక్కడ ప్రదర్శించారు. ఇందులో అన్ని విభాగాల్లోను ఆంధ్రప్రదేశ్‌ ముందుండడం విశేషం. రాష్ట్రం తరఫున ఏర్పాటు చేసిన స్టాల్‌.. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల విద్యా శాఖ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంది. 

సాంకేతిక బోధన, విద్యా పథకాలపై ఆసక్తి 
భారతదేశంలో పునాది నుంచి గణిత శాస్త్ర నైపుణ్యాలు పెంపొందించడం, తరగతిలో సాంకేతిక బోధన ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా జన్‌ భాగీదారీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ– సమగ్ర శిక్షా విభాగం ప్రదర్శించిన ‘ఎఫ్‌ఎల్‌ఎన్‌ నమూనా పాఠశాల’ ఇతర రాష్ట్రాల విద్యా శాఖల ఉన్నతాధికారులను, విద్యా ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకుంది. మన రాష్ట్రంలో పునాది అభ్యసన, గణిత శాస్త్ర నైపుణ్యాల అభివృద్ధి ద్వారా పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్యను ఎలా అందిస్తున్నారో అధికారులు హాజరైన ప్రతినిధులకు వివరించారు.

ప్రాథమిక విద్యార్థులకు అందిస్తున్న పిక్టోరియల్‌ డిక్షనరీ, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్‌ ద్వారా డిజిటల్‌ బోధన అద్భుతమని ఉత్తరాఖండ్‌ విద్యా శాఖ ఉన్నతాధికారులు ప్రశంసించడమే కాకుండా ఏపీలో పర్యటించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని నిర్ణయించారు. మన రాష్ట్రంలో గిరిజన విద్యార్థుల కోసం రూపొందించిన మాతృ భాషాధారిత బహుభాష (సవర, కొండ, కువి, ఆదివాసీ ఒడియా, కోయ, సుగాలి) బైలింగ్వల్‌ పాఠ్య పుస్తకాలు అందజేయడాన్ని రాజస్థాన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అభినందించడంతో పాటు ఏపీలో చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’పై ఆసక్తి చూపించారు. 

ఏపీ భేష్‌ అంటూ ప్రశంసలు
రాష్ట్రంలో ప్రభుత్వం విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తూ అమలు చేస్తున్న అమ్మఒడి, విద్యాకానుక, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, డిజిటల్‌ బోధన, ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులుకు ఉచితంగా ట్యాబులు, బైజూస్‌ కంటెంట్, తరగతి గదుల్లో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెళ్లు, స్మార్ట్‌ టీవీల ఏర్పాటు వంటివి ఇతర దేశాల ప్రతినిధులను సైతం ఆకట్టుకున్నాయి. ‘విద్యాకానుక’ కింద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫారం, డిక్షనరీలు అందించడంపై ప్రశంసలు కురింపించారు.

‘అమ్మ ఒడి’ పథకం ద్వారా పాఠశాలల్లో 75 శాతానికి పైగా హాజరు నమోదవుతుండడాన్ని తెలుసుకున్న ఇతర రాష్ట్రాల అధికారులు, తల్లిదండ్రులు.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయుక్తమైందని అభిప్రాయపడ్డారు. ‘ఫౌండేషనల్‌ స్కూల్‌’ విధానాన్ని, బైలింగ్వల్‌ టెక్టŠస్‌ పుస్తకాల ముద్రణలో ఏపీ ప్రభుత్వ కృషిని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అభినందించారు.

మహరాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, చత్తీస్‌గడ్, మిజోరం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్‌ నికోబార్‌ దీవులు, డామన్‌ డయ్యూ.. దాద్రా నాగర్‌ హవేలీ నుంచి ఎస్సీఈఆర్టీ, డైట్‌ ప్రతినిధులు, స్పార్క్, ప్రథమ్‌ తదితర స్వచ్ఛంద సంస్థలు, పూణె–ఆంధ్రా సంఘం సభ్యులు ఆంధ్రప్రదేశ్‌ విద్యా విధానాల అమలుకు ముందుకు వచ్చాయి. 

దేశ వ్యాప్తంగా మన సంస్కరణలు 
నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసే ‘ఫౌండేషనల్‌ స్కూల్‌’ నిర్వహణలో మన రాష్ట్రం ముందు వరుసలో ఉండడం ఆనందంగా ఉంది. స్టాల్‌లో ‘ఫౌండేషనల్‌ స్కూల్‌’ నమూనా కూడా ఏపీ మాత్రమే ప్రదర్శించింది. మన విద్యా విధానాలు, సంస్కరణలు ఆదర్శప్రాయంగా ఉన్నాయని జన్‌ బాగీధారీ కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులు అభినందించడం, తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామనడం నిజంగా మన విజయమే. 
– ఎస్‌.సురేష్‌కుమార్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌

అంగన్వాడీ టీచర్లకు నైపుణ్య శిక్షణ 
విద్యా సంస్కరణల్లో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి అంగన్వాడీ టీచర్‌ను.. గ్రేడ్‌ 1, 2 టీచర్లను పూర్వ ప్రాథమిక శిశు సంరక్షణ విద్య బోధించడంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని 2026 నాటికి పూర్తి చేస్తాం. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, ఎస్సీఈఆర్టీ, సమగ్ర శిక్ష సహకారంతో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తాం. 
– బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ఏపీ ఎస్పీడీ 

Advertisement

తప్పక చదవండి

Advertisement