ఏపీ బీమా.. ది బెస్ట్‌ | Sakshi
Sakshi News home page

ఏపీ బీమా.. ది బెస్ట్‌

Published Mon, Aug 28 2023 2:16 AM

National level appreciation for YSR free crop insurance - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. రైతులపై పైసా భారం పడకుండా నోటిఫై చేసిన పంటలకు సంబంధించి సాగు చేసిన ప్రతి ఎకరాకు ఈ క్రాప్‌ ఆధారంగా యూనివర్సల్‌ బీమా కవరేజ్‌ కల్పించడంపై పలు రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయి.

ఈ పథకాన్ని తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ ముందుకొచ్చాయి. 2023–24 వ్యవసాయ సీజన్‌ నుంచి కేవలం రూపాయి ప్రీమియంతో తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నట్టు ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన అమలుపై ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు జరిగిన 10వ నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో ఈ రాష్ట్రాలు అధికారికంగా ప్రకటించాయి.

ఈ ఏడాది నుంచి రైతుల నుంచి రూపాయి మాత్రమే వసూలు చేస్తామని, మిగిలిన మొత్తాన్ని తమ ప్రభుత్వాలు భరిస్తాయని ఆ రాష్ట్రాల ప్రతినిధులు చెప్పారు. సెమినార్‌లో పాల్గొన్న మరికొన్ని రాష్ట్రాలు కూడా ఏపీలో అమలవుతున్న ఉచిత పంటల బీమా అమలును అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపించాయి. గతంలో పంటల బీమా రైతులకు అందని ద్రాక్షగా ఉండేది.

స్వాతంత్య్రం వచ్చాక 1965లో కేంద్రం తీసుకొచ్చిన క్రాప్‌ ఇన్సూరెన్స్ బిల్లు ఆధారంగా తెచ్చిన మోడల్‌ ఇన్సూరెన్స్ పథకం.. ఆ తర్వాత వివిధ రూపాలు మార్చుకొని ప్రస్తుతం ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)గా దేశ వ్యాప్తంగా అమలవుతోంది. అధిక ప్రీమియం కారణంగా ఈ పథకంలో చేరేందుకు సన్న, చిన్నకారు రైతులు ఆసక్తిచూపే వారు కాదు. ఆర్థిక స్తోమత, అవగాహన లేక లక్షలాది మంది రైతులు బీమాకు దూరంగా ఉండడంతో ఏటా రూ.వేల కోట్ల పెట్టుబడిని నష్టపోయే వారు. బీమా చేయించుకున్న వారు సైతం పరిహారం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది.

అధికారంలోకి రాగానే శ్రీకారం
పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ మేరకు.. అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 జూలై 8న ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. 2019 ఖరీఫ్‌ సీజన్‌లో ఒక్క రూపాయి ప్రీమియంతో ఈ పథకాన్ని అమలు చేయగా, ఆ తర్వాత సీజన్‌ నుంచి ఆ భారం కూడా రైతులపై పడకుండా వారు చెల్లించాల్సిన వాటా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఈ–పంటలో నమోదే ప్రామాణికంగా పైసా భారం పడకుండా రైతులందరికీ వర్తింప చేస్తోంది. క్లెయిమ్‌ సెటిల్‌మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా తన భుజాన వేసుకుంది.

ఈ–పంటలో నమోదైన నోటిఫైడ్‌ పంటలకు సీజన్‌ ముగియకుండానే లబ్ధిదారుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తోంది. అభ్యంతరాల పరిష్కారం అనంతరం బీమా పరిహారం చెల్లిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇంకా ఎవరైనా మిగిలి పోయారేమోనని వెతికి మరీ అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం చెల్లిస్తోంది. ఇలా ఏటా సగటున 13.62 లక్షల మందికి రూ.1,950.51 కోట్ల చొప్పున ఈ నాలుగేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఇందులో టీడీపీ హయాంలో 6.19 లక్షల మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా ఉన్నాయి.

ఏపీ భేష్‌ అంటూ ముందుకొచ్చిన కేంద్రం
పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానించడం ద్వారా 2019–20లో రైతుల వాటాతో కలిపి రూ.971 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం రూపంలో చెల్లించింది. ఆ తర్వాత రెండేళ్లు బీమా కంపెనీలతో సంబంధం లేకుండా పరిహారం మొత్తం ప్రభుత్వమే చెల్లించింది. యూనివర్సల్‌ కవరేజ్‌ విషయంలో ఏపీ స్ఫూర్తిగా కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. 2022–23లో పీఎంఎఫ్‌బీవైతో కలిసి ఉచిత పంటల బీమా పథకం అమలైంది. దిగుబడి ఆధారిత పంటల కోసం 2022 ఖరీఫ్‌లో రైతుల వాటాతో కలిపి రూ.1,213.37 కోట్లు కంపెనీలకు చెల్లించగా, వాతావరణ ఆధారిత పంటలకు గతంలో మాదిరిగా పరిహారం మొత్తం ప్రభుత్వమే చెల్లించింది.

గతంలో ఏటా సగటున 16 లక్షల మంది రైతులు, 48 లక్షల ఎకరాలకు బీమా చేయించు కోగలిగితే.. ఈ ప్రభుత్వం వచ్చాక 2019 – 2022 మధ్య ఏటా సగటున 30 లక్షల మంది రైతులకు చెందిన 71.55 లక్షల ఎకరాలకు ఉచిత బీమా కవరేజ్‌ కల్పించింది. 2020 ఖరీఫ్‌లో 50 లక్షల ఎకరాలకు కవరేజ్‌ కల్పిస్తే, 2021 ఖరీఫ్‌లో బీమా కల్పించిన విస్తీర్ణం ఏకంగా 80 లక్షల ఎకరాలకు చేరింది. ఇలా యూనివర్సల్‌ కవరేజ్‌ సాధించిన తొలి రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. ఈ తరహా స్కీమ్‌ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా లేదని బీమా రంగ నిపుణులే కాదు.. స్వయంగా కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది.

ఏపీ బాటలో పలు రాష్ట్రాలు 
‘రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకాన్ని అధ్యయనం చేశాం. నోటిఫైడ్‌ పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ ఈ క్రాప్‌ డేటా యూనివర్సల్‌ కవరేజ్‌ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. అందుకే రైతుల విశాల ప్రయోజనాల దృష్ట్యా ఫసల్‌ బీమా యోజనలో భాగస్వామి కావాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరాం. 2023–24 సీజన్‌ నుంచి ఏపీ ప్రభుత్వంతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఏపీ స్ఫూర్తితోనే ఫసల్‌ బీమాలో మార్పులు కూడా తీసుకొచ్చాం’ అని గత కాన్ఫరెన్స్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రకటించడం తెలిసిందే.

ఏపీ బాటలో మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగులు వేయాలని అప్పట్లోనే ఆయన సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఎక్కడ ఏ మీటింగ్‌ జరిగినా కేంద్ర మంత్రితో సహా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులందరూ ఏపీలో అమలవుతున్న ఉచిత పంటల బీమా అమలు తీరును ప్రస్తావించని సందర్భం లేదంటే అతిశయోక్తి కాదు.

ఇప్పటికే పలు రాష్ట్రాలు ఏపీలో అమలవుతున్న ఈ పథకాన్ని అధ్యయనం చేశాయి. 2019లో ఏపీ ప్రభుత్వం అమలు చేసినట్టుగానే రూపాయికే పంటల బీమా అమలు చేస్తున్నామని మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ రాష్ట్రాలు అధికారికంగా ప్రకటించాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు జాతీయ స్థాయిలో అమలు జరుగుతున్నాయనడానికి ఇదొక నిదర్శనం అని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.

సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా ఏపీ
ఈ–క్రాప్‌ ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తూ బీమా రక్షణ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అంటూ 20 రాష్ట్రాలు పాల్గొన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో పలువురు కొనియాడారు. రైతులపై పైసా భారం పడకూడదన్న ఆలోచనతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోందని ప్రశంసించారు. పంటల బీమా పరిధిలో కవరేజ్‌ పెంచడానికి ఇతర రాష్ట్రాలకు ఏపీ మార్గదర్శకంగా వ్యవహరించిందని కేంద్ర ఉన్నతాధికారులు ప్రకటించారు.
 
సర్వత్రా ప్రశంసలు
వర్కుషాపులో ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిసింది. దేశంలోనే అతి తక్కువ ప్రీమియంతో యూనివర్సల్‌ బీమా కవరేజ్‌ని అమలు చేస్తుండడం పట్ల, సెమినార్‌లో పాల్గొన్న రాష్ట్రాలన్నీ ప్రశంసించాయి. తగిన మోడల్‌ను ఎంచుకోవడానికి రాష్ట్రాలకు నిర్ణయాధికారం ఇవ్వడం వల్ల 2023–24 సీజన్‌లో దేశంలోనే అతితక్కువ ప్రీమియం రేట్లను ఏపీ ప్రభుత్వం సాధించగలగడాన్ని కూడా ప్రశంసించారు. ఏపీ బాటలోనే తాము కూడా పయనిస్తున్నామంటూ సెమినార్‌లో ఆయా రాష్ట్రాలు ప్రకటించడం గొప్ప అచీవ్‌మెంట్‌.
– చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌

అరుదైన గౌరవం
రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారు. అందులో ఈ క్రాప్, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాలు కీలకం. ఈ రెండు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. వీటిని అనుసరించేందుకు పలు రాష్ట్రాలు క్యూ కడుతున్నాయి. ఒకేసారి నాలుగు రాష్ట్రాలు ఏపీ బాటలో అడుగులు వేస్తున్నట్టు ప్రకటించడం ఏపీ ప్రభుత్వానికి దక్కిన అరుదైన గౌరవం.
– కాకాని గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి    

Advertisement
Advertisement