టీడీపీ ముఠా ఎన్నికల దందాపై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

టీడీపీ ముఠా ఎన్నికల దందాపై కేసు నమోదు

Published Tue, Jan 30 2024 4:08 AM

Police Case Filed On TDP MLA Eluri Sambasivarao - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, బాపట్ల: టీడీపీ ఎన్నికల అక్రమాలపై పోలీసు శాఖ కొరఢా ఝళిపించింది. 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, దొంగ ఓట్లు వేయించడం తదితర అక్రమాలు ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో కేసు నమోదు చేసింది. ఏ1గా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు ఆయన చైర్మన్‌గా ఉన్న నోవా అగ్రిటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన పలువురు ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు ఈ నెల 24న గుంటూరులోని నోవా అగ్రిటెక్‌ కంపెనీలో నిర్వహించిన సోదాల్లో గుర్తించిన అక్రమాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు అనుమతించాలని పోలీసులు పర్చూరు మున్సిప్‌ మేజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించారు. పోలీసుల వినతిని పరిశీలించిన కోర్టు సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి విచారించేందుకు సోమవారం అనుమతి ఇచ్చింది. దాంతో బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 123 (1), ఐపీసీ సెక్షన్‌ 171(ఇ) రెడ్‌ విత్‌ 120(బి), సీఆర్‌పీసీ 155(2)ల ప్రకారం కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరితోపాటు పరారీలో ఉన్న నోవా అగ్రిటెక్‌ కంపెనీ ఉద్యోగి పుల్లెల అజయ్‌బాబు, ఆ కంపెనీకి చెందిన మరో ముగ్గురు ఉద్యోగులు, మరికొందరిని నిందితులుగా చేర్చారు. 

డీఆర్‌ఐ సోదాల్లో బయటపడిన అక్రమాలు
జీఎస్టీ ఎగవేతను గుర్తించేందుకు గుంటూరులో ఉన్న ఏలూరి సాంబశివరావుకు చెందిన నోవా అగ్రిటెక్‌ కంపెనీ కార్యాలయంలో డీఆర్‌ఐ అధి­కారులు ఈనెల 24న సోదాలు నిర్వహించడంతో ఆయన పాల్పడ్డ ఎన్నికల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కార్యాలయంలో లభించిన ఓ డైరీలో కీలక విషయాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తెప్పించడం.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించడం.. అందుకోసం ఓటుకు రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేసిన నగదు వివరాలు అన్నీ పోలింగ్‌ బూత్‌లవా­రీగా నమోదు చేసి ఉన్నాయి.

ఆ మేరకు ఖర్చు చేసి­న నగదు ఎక్కడ నుంచి తీసుకువచ్చారనే వివరాలు ఏవీ కంపెనీ రికార్డుల్లో లేవు. అంటే షెల్‌ కంపెనీల ద్వారా అక్రమంగా నిధులు తరలించి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని స్పష్టమైంది. దాంతో డీఆర్‌ఐ అధికారులు ఈ అంశాన్ని ఆదాయపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, సెబీ ప్రధాన కార్యాలయాలకు నివేదించారు. ఎన్నికల అక్రమా­లపై బాపట్ల పోలీసులకు సమాచారమి­చ్చారు. దాంతో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి, తదితరులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు బాపట్ల న్యాయ­స్థానాన్ని అనుమతి కోరుతూ పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం ఆమోదించడంతో ఎఫ్‌ఐ­ఆర్‌ నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. 

ప్రజాస్వామ్యవాదుల హర్షం­
గత రెండు ఎన్నికల్లో గెలిచిన ఏలూరిపై కేసు నమోదు కావడం పర్చూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యేపై కేసు నమోదుకావడం పట్ల ప్రజాస్వామికవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరిని పోలీసులు విచారించే క్రమంలో అవసరమైతే ఆయనను అరెస్ట్‌చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది.  

తొలి నుంచీ అక్రమాలే..
నోవా అగ్రిటెక్‌ స్థాపించినప్పటి నుంచి ఏలూరి సాంబశివరావు అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కంపెనీ తయారు చేసే నాసిరకం బయో మందులతో రైతులకు నష్టాలు మిగిలాయన్న ఆరోపణలు­న్నాయి. టీడీపీ హయాంలో ఆ మందులను పెద్ద ఎత్తున విక్రయించి ఎమ్మెల్యే సొమ్ము చేసుకున్నారు.  గతంలో టీడీపీ హయాంలో నీరు–చెట్టు పనుల్లో కోట్లాది రూపాయలు ఏలూరి దోచుకున్నట్లు ఆరోపణలున్నాయి. పర్చూరు మండలం దేవరపల్లిలో దళితులకు ఇచ్చిన భూముల్లో నీరు–చెట్టు కింద చెరువులు తవ్వాలని ఏలూరి పట్టుబట్టారు. దీనిని దళితులు వ్యతిరేకించారు.

దళితులు– ఏలూరికి మధ్య గొడవ అప్పట్లో పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కింది. మార్టూరు మండలంలో 250కి పైగా గ్రానైట్‌ పరిశ్రమలు ఉండగా ఇందులో 90 శాతం మంది యజమానులు ఒకే సామాజికవర్గం వారే ఉన్నారు. ఇక్కడి నుంచి 80 శాతం గ్రానైట్‌ రాయల్టీ లేకుండానే బయటకు తరలిపోతుంది. ఇందుకు ఎమ్మెల్యే ఏలూరి సహకరిస్తుండటంతో ఆయనకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్ట చెబుతున్నారని తెలుస్తోంది. మరోపక్క ఎన్‌ఆర్‌ఐలు పంపించే నల్లధనాన్ని సైతం ఏలూరి ఎన్నికల అక్రమాలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పర్చూరు నియోజకవర్గంలో ఏలూరి 15 వేలకుపైగా దొంగ ఓట్లు చేర్పించారు. ఇటీవల సదరు దొంగ ఓట్లపై ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ జరిపి సుమారు 12 వేల ఓట్లను తొలగించారు.  

డైరీ వెల్లడించిన ఎన్నికల అక్రమాలు..
► పవులూరు అనే గ్రామంలో పోలింగ్‌ కేంద్రాలు 223 నుంచి 226 పరిధిలో 239 మంది ఓటర్లకు రూ. వెయ్యి చొప్పున మొత్తం రూ. 2.39 లక్షలు పంపిణీ చేసినట్టు ఆ డైరీలో ఉంది. 
► మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్రావు ద్వారా రూ. 3.60 లక్షలు ఓటర్లకు పంపిణీ. 
► నోవా అగ్రిటెక్‌ కంపెనీకి చెందిన ఉద్యోగి ద్వారా 
ఓటర్లకు డబ్బులు పంపిణీ.
► ఆ కంపెనీకి చెందిన అప్పారావు, బుజ్జిబాబు, సాయి గణేశ్‌ అనే ఉద్యోగుల ద్వారా దుద్దుకూరు గ్రామంలో ఓటర్లకు 
రూ. 15 లక్షలు పంపిణీ. 

► పర్చూరు నియోజకవర్గంలోని దుద్దుకూరు, ఇంకొల్లు, తాటిపర్తివారిపాలెం, గంగవరం తదితర గ్రామాల్లో ఓటర్లకు డబ్బులు ఎలా పంపిణీ చేసి ఓట్లను కొనుగోలు చేశారో డైరీలో వివరంగా ఉంది. 
► ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తరలించేందుకు రవాణా వ్యయం, పోలింగ్‌ బూత్‌­ల వారీగా ఓటర్ల పేర్లు, వారికి పంపిణీ చే­సిన మొత్తం తదితర వివరాలను ఆ డైరీలో సవివరంగా పేర్కొనడం గమనార్హం.

పర్చూరు ఎన్నికల అక్రమాల నిందితులు..
ఏ1: ఏలూరి సాంబశివరావు,  పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే
ఏ2: పుల్లెల అజయ్‌ బాబు, నోవా  అగ్రిటెక్‌ కంపెనీ ఉద్యోగి
ఏ3: అప్పారావు, నోవా అగ్రిటెక్‌ కంపెనీ ఉద్యోగి
ఏ4: బాజి బాబు, నోవా అగ్రిటెక్‌ కంపెనీ ఉద్యోగి
ఏ5: సాయి గణేశ్, నోవా అగ్రిటెక్‌ కంపెనీ ఉద్యోగి
ఏ6: ఇతరులు 

అక్రమాలపై లోతుగా విచారిస్తాం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోవా అగ్రిటెక్‌ అక్రమాల వ్యవహారాన్ని లోతుగా విచారించాలని  నిర్ణయించాం. దీనికి సంబంధించి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు కంపెనీ ఉద్యోగులను విచారించాలి. ఇందుకోసం వారిపై కేసులు నమోదు చేశాం. ఈ మేరకు పర్చూరు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు అనుమతి తీసుకొని సోమవారం ఎమ్మెల్యేతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశాం. – వకుల్‌ జింధాల్, ఎస్పీ, బాపట్ల జిల్లా.

Advertisement
Advertisement