Sakshi News home page

సుప్రీం తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు 

Published Thu, Jan 18 2024 4:42 AM

Ponnavolu Sudhakar Reddy on Chandrababu Skill Scam Case - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రూ.371 కోట్లు ప్రజల సొమ్మును పక్కదారి పట్టించి స్వాహా చేసిన కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబునాయుడుకు చెంపపెట్టులాంటిదని రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పారు.  ఆయన బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాధనాన్ని దోచిన కేసులో ప్రభుత్వం చట్టపరంగా ముందుకెళితే రాజకీయ కక్ష సాధింపులంటూ కొంతమంది నాయకులు, పచ్చ మీడియా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు.

ఇన్ని రోజులూ వారు ప్రభుత్వంపై చల్లిన బురద సుప్రీంకోర్టు తీర్పుతో కొట్టుకు పోయిందని తెలిపారు. పూణేలోని కేంద్ర సంస్థలు, స్కిల్లర్‌ అనే సంస్థ లావాదేవీలను సీబీఐ అధికారులు పరిశీలిస్తుండగా చంద్రబాబు ప్రభుత్వ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం బయటకు వచ్చిందని చెప్పారు. పూణేలోని అనేక సంస్థలకు వందల కోట్లు నిధులు వస్తున్నాయని సీబీఐ పరిశీలనలో తేలిందన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఎంవోయూలో మార్పులు చేసి రూ.371 కోట్లు ఇతర సంస్థలకు మళ్ళించి, వాటి ద్వారా నిధులను స్వాహా చేశారన్నారు. ఈ విషయంపై 2018 జూన్‌ 6న సీబీఐ విచారణకు ఆదేశించిందని చెప్పారు.

జీవో ప్రకారం సీమెన్స్‌ 90 శాతం నిధులు ఇవ్వలేదని అప్పటి ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబుకు చెప్పినా, ఆయనకున్న విస్తృత అధికారాలతో ఆమోదించారని, ఆ తర్వాత నిధుల స్వాహా జరిగిందని అన్నారు. ఈ కుంభకోణంపై చట్ట ప్రకా­రమే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలి­పారు. ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని, ఈ కేసులో విచారణ, అరెస్టు, రిమాండ్‌ అన్నీ సక్రమంగానే జరిగాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. కోర్టు విచారణను కొనసాగించాలని చెప్పిందని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ని రద్దు చేయాలని చంద్రబాబు కోరినా సుప్రీంకోర్టు అంగీకరించలేదని చెప్పారు. ఈ కేసు వాదనలు వినిపిస్తున్న తనను ప్రచార మాధ్యమాల ద్వారా దారుణంగా దూషించారని, ఇది సబబు కాదని అన్నారు. గౌరవనీయ కోర్టులు, న్యాయమూర్తులపై కూడా దుష్ప్రచారం చేశారన్నారు.

మహిళా న్యాయమూర్తిని కూడా దూషించారన్నారు. న్యాయమూర్తులపై డీబేట్‌లు పెట్టి మానసికంగా హింసించారన్నారు. భార్య అనారోగ్యం కారణంగా రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌ శెలవు పెడితే, ప్రభుత్వం ఆయన్ని బెది­రించి శెలవు పెట్టించిందని ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. ఈ కేసులో సాక్ష్యాధారాలిచి్చన ఐఏ­ఎస్‌ అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇంత ప్రచారం చేసే వ్యక్తులు రూ.371 కోట్లు సక్రమంగా విడుదల చేశామని ఎక్కడా చెప్పడంలేదన్నారు. అరెస్టు సక్రమం కాదంటున్నారే తప్ప అవినీతి జరగలేదని చెప్పడం లేదని చెప్పారు.

ప్రభుత్వం చంద్రబాబు పట్ల గౌరవంతోనే వ్యవహరించింది
చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌ సమయంలో ప్రభుత్వం ఆయన పట్ల సహృదయంతో, గౌరవంతో వ్యవహరించిందని తెలిపారు. బాబును అరెస్టు చేయడానికి డీఐజీ స్థాయి అధికారిని ప్రభుత్వం పంపిందని, ఒక వ్యక్తిని అరెస్టు చేయడానికి ఇంత పెద్ద స్థాయి అధికారిని పంపడం దేశంలో మొట్టమొదటిసారి అని చెప్పారు. రోడ్డుపై ప్రయాణం ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం హెలికాఫ్టర్‌ సౌకర్యం కల్పించిందన్నారు. జైలు మాన్యువల్‌ను కాదని చంద్రబాబుకు అవసరమైన సదుపాయాలు కల్పించిందన్నారు.

బాబు కోసం జైల్లో బ్లాక్‌లను శుభ్రం చేసి, ఏసీలు ఏర్పాటు చేసిందని చెప్పారు. దేశంలో ఎందరో సీఎంలు, ప్రముఖ నాయకులు జైలుకు వెళ్లారని, ఎవరికీ ఇవ్వని సకల సౌకర్యాలు చంద్రబాబుకు ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఇలా సకల సౌకర్యాలు కల్పించడం కక్ష సాధింపు అవుతుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు మెడికల్‌ బెయిల్‌ పొందిన తర్వాత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి బెయిల్‌ క్యాన్సిల్‌ చేయాలని కోరలేదని, ఆయన పట్ల ప్రభుత్వం రాగద్వేషాలకు పోలేదనడానికి, సహృదయంతో వ్యవహరించిందని అనడానికి ఈ ఒక్క విషయం చాలని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement