కోనసీమ ‘ప్రభ’ | Sakshi
Sakshi News home page

కోనసీమ ‘ప్రభ’

Published Sat, Jan 13 2024 4:49 AM

Prabhala Theertham Celebration In Konaseema Sankranti Special 2024 - Sakshi

సాక్షి, అమలాపురం: కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ప్రభల తీర్థం. ఇది సంక్రాంతి పండుగ వేళ జరుపుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. దేశ రాజధాని న్యూఢిల్లీలో గతేడాది అట్టహాసంగా జరిగిన గణతంత్ర వేడు­కల్లో రాష్ట్ర శకటంపై కొలువుదీరిన ఈ ప్రభల తీర్థం భారతీయుల మనస్సులను గెలిచాయి. కోనసీమ ‘ప్రభ’ను నలుదిక్కులా చాటి చెప్పా­యి.

వివరాల్లోకి వెళితే...డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జరిగే ప్రభల తీర్థాలకు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది. అంబాజీపేట మం­డలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. తీర్థం జరిగే ప్రాంతంలో గుడి, గోపురాలు ఉండవు. కౌశిక నదిని ఆనుకుని ఉన్న కొబ్బరి తోటలో ఈ తీర్థం జరగడం ఇక్కడి ప్రత్యేకత. తీర్థం జరిగే ప్రాంతం చుట్టూ ఉన్న రెండు నియోజకవర్గాల పరిధిలోని మూడు మండలాలకు చెందిన పదకొండు ప్రభలు ఇక్కడకు వస్తాయి. ఇక్కడ జరిగే ప్రభల తీర్థం లోక కల్యాణార్థం అని భక్తుల విశ్వా­సం.

పెద్దాపురం సంస్థానా«దీశుడు రాజా వత్సవాయి జగన్నాథరాజు (జగ్గన్న) హయాంలో తొలిసారిగా 17వ శతాబ్ధంలో ఈ తీర్థాన్ని ప్రారంభించారని చెబుతారు. మహారాజుకు పరమేశ్వరుడు స్వప్నంలో సాక్షాత్కరించి ప్రభల తీర్థం నిర్వహించమని కోరారంటారు. అప్పటి నుంచి ఇక్కడ తీర్థం జరుగుతోందని భక్తుల విశ్వాసం. మరో కథలో.. 17వ శతాబ్దంలో పరమ శివభక్తుడు, ఏకసంధాగ్రాహి అయిన విఠలా జగ్గన్న ఇక్కడున్న కౌశిక నది చెంతన శివ పూజ చేసేవారు. ఇందుకు పెద్దాపురం సంస్థానాధీశుడు అభ్యంతరం చెప్పడంతో హైదరా­బాద్‌ నిజాం నవాబును తన ప్రతిభతో మెప్పించి ఇప్పుడు తీర్థం జరిగే జగ్గన్నతోట వద్ద 8 పుట్లు (64 ఎకరాలు) భూమిని దానంగా పొందారని చెబుతారు. ఈ కారణంగానే ఇది జగ్గన్నతోటగా పేరొందిందని నమ్మకం. 

ప్రభల తీర్థాలు జరిగేదెక్కడంటే.. 
జగ్గన్నతోటతో పాటు కొత్తపేట సెంటర్, అవిడి డ్యామ్‌ సెంటర్, కాట్రేనికోన, మామిడికుదురు మండలం కొర్లగుంట వంటి చోట్ల పెద్ద తీర్థాలు జరుగుతాయి. ఇవికాకుండా జిల్లా వ్యాప్తంగా 84 వరకూ తీర్థాలు నిర్వహిస్తారు. 60 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తున ప్రభలు ఉంటాయి. ప్రభలు తయారు చేయడాన్ని యజ్ఞంగా భావిస్తారు. తాటి శూలం, టేకు చెక్క, పోక చెట్ల పెంటిలు, మర్రి ఊడలు, వెదురు బొంగులతో మూడు రోజులపాటు శ్రమించి ప్రభలు తయారు చేస్తారు.

రంగురంగుల నూలుదారాలు (కంకర్లు), కొత్త వ్రస్తాలతో అందంగా తీర్చిదిద్దుతారు. ప్రభపై పసిడి కుండ ఉంచి చుట్టూ నెమలి పించాలు, జేగంటలు వేలాడదీ­స్తారు. వరి కంకుల కుచ్చు­లు, గుమ్మడి, ఇతర కూరగాయలు, పెద్దపెద్ద పూల దండలతో ప్రభకు వేలాడదీస్తారు. వీటిని భక్తు­లు తమ భుజస్కంధాలపై ఉంచి కిలోమీటర్ల కొద్దీ మోసు­కు వస్తారు. కొబ్బరి తోటలు, వరిచేలు, పంట కాలువల మీదుగా సాగే ప్రభల యాత్ర చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు.

జాతీయస్థాయిలో గుర్తింపు 
గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివ కేశవ యూత్‌ సభ్యులు ఈ తీర్థ విశేషాలను ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తూ 2020లో మెయిల్‌ చేశారు. దీంతో మోదీ తీర్థాన్ని అభినందిస్తూ తిరిగి సందేశం పంపించారు. గతేడాది ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌ డే పరేడ్‌లో రాష్ట్ర ప్రభుత్వ శకటంపై జగ్గన్నతోట తీర్థాన్ని ప్రదర్శించారు. దీంతో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. గతేడాది ప్రముఖ సినీ నటుడు నాగార్జున నటిస్తున్న ఒక సినిమాలో విజువల్స్‌ కోసం ప్రభల తీర్థాన్ని చిత్రీకరించారు.

యువత ప్రభల తీర్థాలపై పలు లఘు చిత్రాలు తీసి సామా­జిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఈ తీర్థానికి పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. దీంతో ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసి, అందుకు తగి­న ఏర్పాట్లు చేస్తున్నారు. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభల­ను ఊరి పొలిమేర దాటిస్తే ఊరుకు మంచిదనేది ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసమని అర్చ­కుడు చంద్రమౌళి కామేశ్వరశాస్త్రి తెలిపారు.

Advertisement
Advertisement