ఎకరం కూడా ఎండకుండా.. రైతన్న సంబరపడేలా | Sakshi
Sakshi News home page

ఎకరం కూడా ఎండకుండా.. రైతన్న సంబరపడేలా

Published Thu, Apr 8 2021 3:43 AM

Rabi has a record water supply to over above 35 lakh acres - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న, మధ్య, భారీతరహా ప్రాజెక్టుల కింద రబీలో 35.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తోంది. గతేడాది రబీలో 24 లక్షల ఎకరాలకు నీళ్లందించి రికార్డు సృష్టించిన సర్కార్‌.. ప్రస్తుత రబీలో అదనంగా 11.21 లక్షల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పింది. యాజమాన్య పద్ధతుల ద్వారా ‘ఆన్‌ అండ్‌ ఆఫ్‌’ విధానంలో చివరి భూములకూ సమృద్ధిగా నీరందేలా జలవనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి, కృష్ణా డెల్టాలు, సాగర్‌ కుడి కాలువ, గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టుల కింద వరి ఎకరానికి సగటున 40 నుంచి 45 బస్తాల దిగుబడి వస్తుండటంతో వారిలో సంతోషం వెల్లివిరుస్తోంది. చిన్న, మధ్య, భారీతరహా ప్రాజెక్టులు, ఏపీఎస్‌ఐడీసీ (ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల అభివృద్ధి సంస్థ) నేతృత్వంలోని ఎత్తిపోతల పథకాల కింద 1.05 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రభుత్వం అభివృద్ధి చేసింది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలతో భారీ వర్షాలు పడడంతో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా, ఏలేరు, వాగులు, వంకలు ఉప్పొంగాయి. వరద నీటిని ఒడిసి పట్టిన సర్కార్‌.. గతంలో ఎన్నడూ నిండని ప్రాజెక్టులను సైతం నింపింది. దీంతో ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 78 లక్షల ఎకరాలకు నీళ్లందాయి.  

రికార్డు స్థాయిలో రబీలో నీటి సరఫరా.. 
రాష్ట్ర విభజన తర్వాత.. 2014 నుంచి 2019 వరకు గరిష్టంగా 2018లో మాత్రమే రబీలో 11.23 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. అయితే గోదావరి డెల్టాలో పంటలను రక్షించడంలో నాటి సర్కార్‌ పూర్తిగా విఫలమైంది. గతేడాది రబీలో 24 లక్షల ఎకరాలకు నీళ్లందించిన జలవనరుల శాఖ.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 35.21 లక్షల ఎకరాలకు నీటిని అందించింది.
ప్రకాశం జిల్లా మల్లవరంలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ కింద రబీలో సాగుచేసిన వరిపంట కోత పనులు 
 
కృష్ణా డెల్టా చరిత్రలో తొలిసారిగా.. 
కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌లో 13.08 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేస్తారు. కానీ.. 2019 వరకు రబీలో ఈ డెల్టాకు నీటిని సరఫరా చేసిన దాఖలాలు లేవు. గతేడాది 1.50 లక్షల ఎకరాలకు రబీలో నీటిని విడుదల చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది ఏకంగా 4.26 లక్షల ఎకరాలకు నీటిని అందించి చరిత్ర సృష్టించింది.

దుర్భిక్ష సీమ కళకళ.. 
దుర్భిక్ష రాయలసీమలో రబీలో ఆయకట్టులో రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేశారు. తుంగభద్ర హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ) కింద అనంతపురం జిల్లాలో తొలిసారిగా గరిష్టంగా 1.10 లక్షల ఎకరాలకు అధికారులు నీటిని సరఫరా చేస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లాలో తెలుగుగంగ, హెచ్చెల్సీ, పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ కింద 2.01 లక్షల ఎకరాల్లో, కేసీ కెనాల్, తుంగభద్ర ఎల్లెల్సీ (దిగువ కాలువ) కింద 2.44 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. 

రికార్డు స్థాయిలో నీటి సరఫరా.. 
గోదావరి డెల్టాతో పోటీపడుతూ నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా, తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్టులు, కాన్పూర్‌ కెనాల్‌ కింద రైతులు 7.28 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. పెన్నా వరదను ఒడిసి పట్టి సోమశిల, కండలేరు ప్రాజెక్టులను 

నింపడం వల్లే నీటిని సరఫరా చేయడం 
సాధ్యమైందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలకు, శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు కింద వరుసగా రెండో ఏడాది రబీలో పంటల సాగుకు నీటిని విడుదల చేశారు.

గోదావరిలో సహజసిద్ధ ప్రవాహం తగ్గినా.. 
గోదావరి డెల్టాలో రబీలో 8,96,538 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. రబీ పంట పూర్తి కావాలంటే 94.50 టీఎంసీలను సరఫరా చేయాలని అధికారులు లెక్కలు కట్టారు. డిసెంబర్‌లో గోదావరిలో 26.502 టీఎంసీలుగా నమోదైన సహజసిద్ధ ప్రవాహం జనవరిలో 11.560, ఫిబ్రవరిలో 3.387, మార్చిలో 1.957 టీఎంసీలకు తగ్గింది. దీంతో సీలేరు నుంచి డిసెంబర్‌లో 10.260, జనవరిలో 12.668, ఫిబ్రవరిలో 13.871, మార్చిలో 18.882 టీఎంసీలను విడుదల చేసి గోదావరి డెల్టాకు సరఫరా చేశారు. మంగళవారం వరకు డెల్టాకు 92.87 టీఎంసీలను సరఫరా చేశారు. మరో పది రోజుల్లో పంట కోతలను ప్రారంభిస్తారు. సమృద్ధిగా నీటిని అందించడంతో వరి పంట రికార్డు స్థాయిలో దిగుబడులు ఇస్తోంది. 

చివరి భూములకూ నీళ్లందించాం..  
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు.. కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నా, ఏలేరు, నాగావళి వరద నీటిని ఒడిసి పట్టి ప్రాజెక్టులను నింపాం. ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేశాం. రబీలోనూ గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేశాం. ఆన్‌ అండ్‌ ఆఫ్‌ విధానంలో.. యాజమాన్య పద్ధతులను అమలు చేయడం ద్వారా చివరి భూములకు నీళ్లందేలా చేశాం. ఒక్క ఎకరంలో కూడా పంట ఎండకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.  
– సి.నారాయణరెడ్డి, ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్, జలవనరుల శాఖ  

Advertisement
Advertisement