స్కిల్‌ స్కాం: అంతా చంద్రబాబు కనికట్టు | Sakshi
Sakshi News home page

స్కిల్‌ స్కాం: అంతా చంద్రబాబు కనికట్టు

Published Sun, Sep 24 2023 2:12 AM

TDP Chandrababu Govt Skill Development Scam With planning - Sakshi

సాక్షి, అమరావతి: నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ పేరుతో డబ్బులు కొట్టేయడానికి టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికతో అడుగులు వేశారు. స్కిల్‌ సెంటర్స్‌ పేరుతో డొల్ల కంపెనీల ద్వారా డబ్బు ఎలా తరలించాలో ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాతే ఏపీఎస్‌ఎస్‌డీసీని తెరపైకి తెచ్చి.. సీమెన్స్‌ ముసుగులో ఒప్పందం చేసుకున్నారు. ఎటువంటి పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్లు దొంగ ఇన్వాయిస్‌లను సృష్టించి రూ.241 కోట్లు కాజేశారు.

ఈ బాగోతమంతా ఎన్‌ఫోర్స్‌మెంట్, జీఎస్టీ ఇంటిలిజెన్స్, సెబీ, ఫోరెన్సిక్‌ ఆడిట్స్‌లో పక్కా ఆధారాలతో బయటపడింది. ఇందుకోసం అప్పటికప్పుడు కొన్ని షెల్‌ కంపెనీలను పుట్టించగా, హవాలా మార్గంలో నగదును సరఫరా చేసే కొన్ని షెల్‌ కంపెనీలను ఎంచుకున్నారు. మొత్తం ఈ కుంభకోణంలో సీమెన్స్‌ ముసుగులో డిజైన్‌టెక్‌ కీలకంగా వ్యవహరించింది. డిజైన్‌ టెక్‌ నుంచి రెండు షెల్‌ కంపెనీలకు మొత్తం నగదును పంపించి, అక్కడ నుంచి అనేక షెల్‌ కంపెనీల ద్వారా తిరిగి ఆ నగదు చంద్రబాబు సూచించిన వ్యక్తులకు చేరినట్లు దర్యాప్తులో షెల్‌ కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు. 

రూ.లక్షతో రూ.241 కోట్లు 
నగదును తరలించడం కోసం స్కిలర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (గతంలో పీవీఎస్‌పీ ఐటీ స్కిల్స్‌ ప్రాజెక్ట్‌గా పిలిచేవారు) పేరుతో ఒక డొల్ల కంపెనీని అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. ఏపీఎస్‌ఎస్‌డీసీతో ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే 2015 మార్చి30న స్కిలర్‌ కంపెనీని ఏర్పాటు చేసినట్లు రిజాస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్వోసీ) డేటా స్పష్టం చేస్తోంది. న్యూఢిల్లీ కేంద్రంగా ప్రతిక్‌ రమన్‌భాయ్‌ పటేల్, అబ్దుల్‌ రఫుల్‌ హాయ్‌ కేవలం లక్ష రూపాయల మూల ధనంతో స్కిలర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను ఏర్పాటు చేశారు.

అప్పటి వరకు ఎటువంటి అనుభవం లేని ఈ కంపెనీకి ఏకంగా రూ.241.49 కోట్ల విలువైన హార్డ్‌వేర్‌ పరికరాలను సరఫరా చేసే కాంట్రాక్టును అప్పగించారు. 717 దొంగ ఇన్వాయిస్‌లను సృష్టించి వాటి ద్వారా డబ్బులు కొట్టేశారు. స్కిలర్‌ కంపెనీ 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కిల్‌ ల్యాబ్స్‌కు రూ.241.49 కోట్ల విలువైన హార్డ్‌వేర్‌ పరికరాలను సరఫరా చేసి డబ్బులు తీసుకున్నట్లు దొంగ రికార్డులు సృష్టించారు. కానీ ఆ వివరాలను ఎక్కడా ఆ కంపెనీ అకౌంట్స్‌లో చూపించలేదు. 2016–17 సంవత్సరానికి స్కిలర్‌ కంపెనీ ఆర్‌వోసీకి సమర్పించిన ఆర్థిక స్టేట్‌మెంట్‌ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ఆ సంవత్సరంలో కేవలం రూ.99.03 కోట్ల విలువైన పరికరాలు మాత్రమే సరఫరా చేసినట్లు దొంగ లెక్కలు చూపించారు. వాస్తవానికి ఒక్క రూపాయి విలువైన పరికరాలు కూడా సరఫరా చేయలేదు. స్కిల్‌ కుంభకోణంపై సీఐడీ విచారణ ప్రారంభించిన తర్వాత స్కిలర్‌ తన దుకాణం మూసేసినట్లు ఆర్వోసీ రికార్డులు సూచిస్తున్నాయి. 2021లో చివరిసారిగా బ్యాలెన్స్‌ షీట్లు సమర్పించిన స్కిలర్‌ గత రెండేళ్ల నుంచి ఎటువంటి సమాచారాన్ని ఆర్వోసీకి ఇవ్వడం లేదు.

డబ్బులు వచ్చాక దుకాణం బంద్‌
స్కిలర్‌ చేతికి వచ్చిన రూ.241.49 కోట్లను పాట్రిక్‌ ఇన్ఫో సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఇన్‌వెబ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, భారతీయ గ్లోబల్‌ ఇన్ఫో మీడియా లిమిటెడ్, ఐటీ స్మిత్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి అనేక డొల్ల కంపెనీల ద్వారా చంద్రబాబు గూటికి తరలించేశారు. ఈ కంపెనీలు కేవలం స్కిల్‌ కుంభకోణం సమయంలో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాయని, ఆ తర్వాత పని చేయలేదని రిజిస్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

రూ.లక్ష మూలధనంతో 2012లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైన ఇన్‌వెబ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే డొల్ల కంపెనీని 2016లో నగదు తరలించిన తర్వాత మూసేశారు. 2016లో చివరిసారిగా బ్యాలెన్స్‌ షీట్‌ సమర్పించిన ఈ కంపెనీ ఆ తర్వాత నుంచి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని, ప్రస్తుతం ఇది మూతపడిన కంపెనీగా ఆర్వోసీ రికార్డుల్లో పేర్కొన్నారు. మరో డొల్ల కంపెనీ పాట్రిక్‌ ఇన్ఫో సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కూడా న్యూఢిల్లీ కేంద్రంగా రూ.లక్షతో మొదలైంది.

స్కిల్‌ కుంభకోణం నిధుల తరలింపు పూర్తయిన తర్వాత 2018లో ఈ కంపెనీ మూతపడింది. 2018 తర్వాత ఈ కంపెనీ ఎటువంటి బ్యాలెన్స్‌ షీట్లను సమర్పించలేదని,  ప్రస్తుతం ఈ కంపెనీ మూసివేసిన కంపెనీగా ఆర్వోసీ రికార్డుల్లో చూపిస్తోంది. రూ.లక్షతో న్యూఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైన భారతీయ గ్లోబల్‌ ఇన్ఫో మీడియా లిమిటెడ్‌ 2018 డిసెంబర్‌ 10 తర్వాత నుంచి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని ఆర్వోసీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

అంటే ఈ డొల్ల కంపెనీలన్నీ నగదు తరలించాక కనుమరుగయ్యాయని స్పష్టమవుతోంది. ఇలా దొంగ ఇన్వాయిస్‌లతో నగదును తరలించడమే కాకుండా, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను కోరుతూ దరఖాస్తు చేయడంతో పూణేలోని జీఎస్టీ ఇంటిలిజెన్స్‌ రంగంలోకి దిగి తీగ లాగితే మొత్తం డొంకంతా బయట పడింది. 

హవాలా నగదు తరలింపులో ఏసీఐ దిట్ట 
అల్లైయిడ్‌ కంప్యూటర్స్‌ ఇంటర్నేషనల్‌ (ఆసియా) లిమిటెడ్‌ (ఏసీఐ) నకిలీ ఇన్వాయిస్‌లతో నగదును తరలించడంలో దిట్ట. బొంబాయి స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో నమోదైన ఈ కంపెనీకి ఈ విషయంలో పెద్ద రికార్డే ఉంది. 2013–14 నుంచి 2019–20 వరకు ఈ కంపెనీ బ్యాలెన్స్‌షీట్‌ను పరిశీలిస్తే స్కిల్‌ కుభంకోణం సమయంలో ఏసీఐ ద్వారా ఎంత నగదు తరలించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

కుంభకోణం ముందు, తర్వాత ఏడాదికి రూ.లక్షల్లో మాత్రమే ఆదాయాన్ని చూపిన ఈ కంపెనీ.. కుంభకోణం సమయంలో రూ. కోట్లల్లో ఆదాయం చూపించడం గమనార్హం. ఒప్పందం కుదిరిన మొదటి సంవత్సరం అంటే 2015–16లో రూ.30.52 కోట్లు, 2016–17లో రూ.35.77 కోట్లు, 2018–19లో రూ.9.77 కోట్లు ఆదాయాన్ని చూపించిన ఈ కంపెనీ 2019–20కి వచ్చే సరికి కేవలం రూ.2 లక్షల ఆదాయాన్ని మాత్రమే చూపించింది.

ఈ కంపెనీ లావాదేవీలపై అనుమానం వచ్చిన సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా 2017లో రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా సెబీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ వారికి సమాచారమిస్తే వారు ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ సందర్భంగా కంపెనీకి, కంపెనీ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేయగా, వారు నిజాలను ఒప్పేసుకున్నారు.

ఎటువంటి వస్తువులు సరఫరా చేయకుండానే చేసినట్లు ఇన్వాయిస్‌లు సృష్టించి డిజైన్‌ టెక్‌ నుంచి నగదును తీసుకొని వాటిని వివిధ రూపాల్లో తిరిగి వారికే ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు ఏసీఐ ఎండీ స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు పేరుతో రూ.241 కోట్లు డొల్ల కంపెనీల ద్వారా కొట్టేస్తూ సాక్ష్యాలతో బటయపడినా టీడీపీ మీడియా మా బాబు నిప్పు అంటూ అడ్డుగోలుగా వాదనలు చేయడం వారికే చెల్లింది.  

Advertisement
Advertisement