చింతపల్లిలో 11, అరకులో 12.3 డిగ్రీలు  | Sakshi
Sakshi News home page

చింతపల్లిలో 11, అరకులో 12.3 డిగ్రీలు 

Published Mon, Dec 11 2023 5:22 AM

Temperatures dropping significantly in Alluri district - Sakshi

సాక్షి,పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9 గంటల వరకు పాడేరు, చింతపల్లి, అరకులోయ ప్రాంతాల్లో మంచుతెరలు వీడటంలేదు. ఘాట్‌ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా లైట్ల వెలుగులో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉష్ణోగ్రతలూ రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నా­యి.

చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం 15.5 డిగ్రీలు నమోదు కాగా ఆదివారం 4.5 డిగ్రీలు తగ్గి 11 డిగ్రీలు నమోదైంది. అరకు­లోయ కేంద్ర కాఫీ బోర్డులో 12.3 డిగ్రీలు, పాడేరు మండలంలోని మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కాఫీబోర్డు వర్గాలు తెలిపాయి. ఆయా ప్రాంతాల్లో సాయంత్రం నుంచి చలిగాలులు విజృంభిస్తున్నాయి. 

మంచు అందాలకు ఫిదా... 
జిల్లా వ్యాప్తంగా చలిగాలుల తీవ్రత ఉన్నప్ప­టికీ మంచు అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చి అందాలను వీక్షిస్తూ పరవశిస్తున్నారు.

మారేడుమిల్లి ప్రాంతంలోని గుడిసె, చింతపల్లి మండలంలోని లంబసింగిలోని చెరువులవెనం, పాడేరు మండలంలోని వంజంగి హిల్స్, హుకుంపేట మండలంలోని సీతమ్మకొండ, అరకులోయ మండలంలోని మాడగడ హిల్స్‌ ప్రాంతాలకు వేకువజామునే చేరుకుని పొగమంచు, సూర్యోదయం, మేఘాల అందాలను వీక్షిస్తున్నారు.  

Advertisement
Advertisement