అది రామోజీ అబద్ధాల సాగు  | Sakshi
Sakshi News home page

అది రామోజీ అబద్ధాల సాగు 

Published Sun, Apr 9 2023 4:06 AM

There has been no sign of drought for four years - Sakshi

సాక్షి, అమరావతి : నిత్యం ఏదో ఒక అంశాన్ని పట్టుకుని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై బురదచల్లుడు వంటకాన్ని వండి వార్చడమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ ప్రత్యక్షంగా అందరికీ కళ్లెదుటే కనిపిస్తున్న నిజాన్ని అబద్ధం చేసింది. సకాలంలో మంచి వర్షాలు.. సీజన్‌లో కళకళలాడుతున్న రిజర్వాయర్లు.. నిర్ణీత సమయానికి ముందే నీటి విడుదల.. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు.. ప్రతి దశలోనూ అన్నదాతకు తోడుగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం.. వెరసి రాష్ట్రంలో నాలుగేళ్లుగా వ్యవసాయం పండగైంది.

ఈ విషయాన్ని ఏ ఊరికి వెళ్లి ఎవరిని అడిగినా నిస్సందేహంగా నిజమేనని చెబుతారు.. ఒక్క రామోజీ, చంద్రబాబులతో కూడిన దుష్టచతుష్టయం తప్ప. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంటల మార్పిడి ఫలించడం మీకు తెలీదా రామోజీ? మెట్ట ప్రాంతాల్లో లాభదాయకం కాని వ్యవసాయ పంటలు సాగు చేసే రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లుతుండటం వాస్తవమో కాదో గ్రామీణ ప్రాంతాల్లోని మీ నెట్‌వర్క్‌నే అడిగి చూడండి. డ్రైస్పెల్స్‌ నమోదైనా ఆ ప్రభావం దిగుబడులపై చూపక పోవడం, నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క కరువు మండలాన్ని నమోదు చేసే పరిస్థితి రాకపోవడం నిజం. ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.

హెక్టార్‌కు సగటు దిగుబడులు పెరిగాయి. వ్యవసాయ రంగంలోనే కాదు.. ఉద్యాన, పశుగణాభివృద్ధి, మత్స్య తదితర వ్యవసాయ అనుబంధ రంగాల్లో సైతం జాతీయ సగటు వృద్ధిరేటు కంటే గణనీయమైన వృద్ధి రేటు నమోదు చేసుకుంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రాసుకునే లెక్కలు కావు. కేంద్ర ఆర్థిక, గణాంకాల శాఖ రూపొందించిన గణాంకాలని మీకు తెలియదా రామోజీ? ఇంతకూ మీరు చెప్పిన అంశాల్లో నిజానిజాలు ఏమిటో చూద్దాం.  

ఆరోపణ: సాగు విస్తీర్ణం తగ్గింది
వాస్తవం : పంటల మార్పిడి కింద మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద సాగయ్యే పంటల స్థానే ఉద్యాన పంటలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఫలితంగా నాలుగేళ్లలో 5.52 లక్షల ఎకరాల్లో కొత్తగా ఉద్యాన పంటలు సాగులోకి వచ్చాయి. మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా సాగయ్యే వరి, పొగాకు, చెరకు, మొక్కజొన్న వంటి పంటల స్థానంలో ఉద్యాన పంటలైన మామిడి, అరటితో పాటు డ్రాగన్‌ ఫ్రూట్, అవొకాడో, కాఫీ, అల్లం, పసుపు, అనాస, బొప్పాయి, కమల, జామ వంటి పంటలు సాగు చేస్తున్నారు.   

ఆరోపణ: పొడి వాతావరణాన్ని పట్టించుకోలేదు
వాస్తవం : రాష్ట్రంలో 2022 ఖరీఫ్‌ పంట కాలంలో జూన్‌–జూలైలో 172 మండలాల్లో బెట్ట వాతావరణం (డ్రై స్పెల్స్‌) కనిపించినప్పటికీ, ఆయా మండలాల్లో పంటల సాగు ఆలస్యమైందే తప్ప సాగు ఆగలేదు. మరో 101 మండలాల్లో ఆగస్టు, సెపె్టంబర్‌ మధ్య డ్రైస్పెల్స్‌ సంభవించాయి. ఆ సమయంలో పంటలు కీలక దశకు రాకపోవడంతో దిగుబడులపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖ తన నివేదికలో తేల్చి చెప్పింది.  

ఆరోపణ: దిగుబడులు ఎక్కువ చేసి చూపిస్తున్నారు
వాస్తవం : 2021–22లో వరి సగటున హెక్టార్‌కు ఖరీఫ్‌లో 4,800 కిలోలు, రబీలో 6,601 కిలోల దిగుబడులొస్తే, మూడో ముందస్తు అంచనా ప్రకారం 2022–23 ఖరీఫ్‌లో 5,195 కిలోలు, రబీలో 6,944 కిలోల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. 2021–22లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 154 లక్షల టన్నులు రాగా, 2022–23లో 166.63 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు.

ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014–19 మధ్యలో సగటున 153.95 లక్షల టన్నులుగా నమోదైతే, 2019–23 మధ్య 165.40 లక్షల టన్నులుగా నమోదైంది. అంటే 11.45 లక్షల టన్నుల మేర పెరిగింది. ఉద్యాన పంటల విషయానికి వస్తే టీడీపీ హయాంలో 2018–19లో 17.40 లక్షల హెక్టార్లలో సాగవ్వగా, 305 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ప్రస్తుతం 18.03 లక్షల హెక్టార్లకు విస్తరించగా, 363.04 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. ఫలితంగా హెక్టార్‌కు సగటు దిగుబడులు పెరిగాయి.   

ఆరోపణ: సాగు తగ్గితే  వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది? 
వాస్తవం : వృద్ధి రేటు పెరుగుదల, తగ్గుదల అనేది సాగు విస్తీర్ణం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఇది వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య, పశుగణాభివృద్ధి, అటవీ, ఉద్యాన రంగాల పురోగతి మీద ఆధారపడి ఉంటుంది. పంటల సగటు దిగుబడి, విలువ ఆధారిత ఉత్పత్తుల పెరుగుదల వంటి కారణాలతో వృద్ధి రేటు పెరుగుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 2022–23లో వృద్ధి రేటు 13.18 శాతం నమోదు కాగా, ఇది జాతీయ వృద్ధి రేటు కంటే 2 శాతం ఎక్కువ.

వ్యవసాయ రంగంలో 20.72 శాతం, ఉద్యాన రంగంలో 12.58 శాతం, పశుగణాభివృద్ధి రంగంలో 7.32 శాతం, మత్స్య రంగంలో 19.41 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇవన్నీ కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖ విడుదల చేసిన లెక్కలే. రాష్ట్రంలో ఎక్కడా పంట విరామం ప్రకటించే పరిస్థితులే లేవు. కోనసీమ, పశ్చిమగోదావరి, వైఎస్సార్, బాపట్ల జిల్లాల్లో గతం కంటే మిన్నగా పంటలు  సాగయ్యాయి.   sak

Advertisement
Advertisement