Sakshi News home page

ఒక్క క్లిక్‌... రెడీ టు కుక్‌ 

Published Sun, Aug 6 2023 5:03 AM

The upcoming Fish Andhra website - Sakshi

బతికిన చెరువు చేపలు, రొయ్యలు... తాజా సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు... ఎండుచేపలు, రొయ్యల పచ్చళ్లు... నేరుగా వండుకుని తినేలా స్నాక్‌ ఐటమ్స్‌తోపాటు ‘రెడీ టు కుక్‌’ పేరిట మసాలా అద్దిన (మారినేట్‌) మత్స్య ఉత్పత్తులు... కనీసం వారం రోజులు నిల్వ చేసుకునేలా వ్యాక్యూమ్డ్‌ ప్యాకింగ్‌తో ఐస్‌లో భద్రపర్చిన కటింగ్‌ ఫిష్, రొయ్యలు... ఇలా 60 రకాల మత్స్య ఉత్పత్తులలో ఏది కావాలన్నా ఇక నుంచి ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే చాలు క్షణాల్లో డోర్‌ డెలివరీ ఇస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. 

సాక్షి, అమరావతి: ‘ఫిష్‌ ఆంధ్ర–ఫిట్‌ ఆంధ్ర’ బ్రాండింగ్‌తో హబ్‌ అండ్‌ స్పోక్స్‌ మోడల్‌లో డొమెస్టిక్‌ మార్కెటింగ్‌ వ్యవస్థను విస్తరిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం... మరో అడుగు ముందుకేసి స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా మత్స్య ఉత్పత్తులను డోర్‌ డెలివరీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఏటా 50లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తుల దిగుబడులతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం... తలసరి వినియోగంలో కేవలం 8.07 కేజీలు మాత్రమే ఉంది.

దీనిని వచ్చే ఐదేళ్లలో కనీసం 30 శాతం పెంచడమే లక్ష్యంగా జిల్లాకు ఒక ఆక్వా హబ్, దానికి అనుబంధంగా రిటైల్‌ అవుట్‌లెట్లతోపాటు ఈ–మొబైల్‌ 3 వీలర్, 4 వీలర్‌ ఫిష్‌ వెండింగ్‌ వెహికల్స్‌ డెయిలీ (ఫిష్‌ కియోస్‌్క), సూపర్‌ (లైవ్‌ ఫిష్‌ వెండింగ్‌ సెంటర్స్‌), లాంజ్‌ (వాల్యూ యాడెడ్‌) యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భాగంగా 1,826 స్టోర్స్‌ అందుబాటులోకి రాగా, మరో 2వేల యూనిట్లను త్వరలో ప్రారంభించనుంది.

తాజాగా ఒక్కో కేటగిరీలో 20 చొప్పున ఫ్రెష్‌ వాటర్, బ్రాకిష్‌ వాటర్, మెరైన్‌ కేటగిరీల్లో 60కి పైగా మత్స్య ఉత్పత్తుల డోర్‌ డెలివరీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు డిమాండ్‌ ఎక్కువగా ఉన్న రకాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే కూడా చేస్తున్నారు. తొలి దశలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో, రెండో దశలో రాష్ట్రమంతా అమలు చేయాలని నిర్ణయించారు. డోర్‌ డెలివరీ కోసం స్విగ్గీ, జొమాటో వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకోనున్నారు. ఫిష్‌ ఆంధ్ర అవుట్‌లెట్‌ వారు సొంతంగా డోర్‌ డెలివరీ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తారు.   

సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం
ఫిష్‌ ఆంధ్ర బ్రాండింగ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు డిజిటల్‌ మార్కెటింగ్‌ అండ్‌ కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ (డీఎం–సీఆర్‌ఎం)ను అందుబాటులోకి తెచ్చారు. యూ ట్యూబ్, గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్ర్ట్రాగామ్, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా విస్తృత ప్రచారానికి ప్రణాళిక సిద్ధంచేశారు. కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ ద్వారా వినియోగదారుల ఫీడ్‌ బ్యాక్‌ తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ కూడా అందుబాటులోకి తీసుకువస్తారు. డిజిటల్‌ చెల్లింపుల కోసం పేటీఎం సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 

ప్రత్యేకంగా వెబ్‌సైట్‌  
మత్స్య ఉత్పత్తులను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ‘ఫిష్‌ ఆంధ్ర’ ఆన్‌లైన్‌ అమ్మకాలకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ను ఇటీవల రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆవిష్కరించారు. రిటైల్‌ అవుట్‌లెట్స్, ఇతర యూనిట్లను ఈ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేయడానికి మ్యాపింగ్‌ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. స్విగ్గీ, జొమాటో తరహాలో ఫిష్‌ ఆంధ్ర వెబ్‌సైట్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తారు.   

త్వరలో డోర్‌ డెలివరీకి శ్రీకారం 
ఫిష్‌ ఆంధ్ర పేరిట దాదాపు 2వేల అవుట్‌లెట్స్‌ ఏర్పాటు చేశాం. ఇంత పెద్దఎత్తున చైన్‌ వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదు. మరో అడుగు ముందుకేసి కోరుకున్న మత్స్య ఉత్పత్తులను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లేందుకు డోర్‌ డెలివరీ సదుపాయాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకోసం వెబ్‌సైట్‌ను ప్రారంభించాం. డోర్‌ డెలివరీ కోసం స్విగ్గీ, జొమాటో తరహా కంపెనీలతో ఒప్పందం చేసుకుంటాం. – కూనపురెడ్డి కన్నబాబు, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ 

Advertisement

What’s your opinion

Advertisement