పోలవరంపై కీలక సమావేశం | Sakshi
Sakshi News home page

పోలవరంపై కీలక సమావేశం

Published Sun, May 22 2022 4:12 AM

Vedire Sriram Team Key meeting on Polavaram project - Sakshi

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర జల్‌ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం బృందం శనివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. ఆదివారం మరోసారి తనిఖీ చేస్తుంది. అనంతరం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులతో ప్రాజెక్టు డిజైన్లు, పూర్తి చేయడానికి అవసరమయ్యే నిధులపై వెదిరె శ్రీరాం కీలకమైన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

పోలవరం ప్రాజెక్టు డిజైన్లపై ఈనెల 17న వెదిరె శ్రీరాం, నిధుల మంజూరుపై 18న కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ అధ్యక్షతన ఢిల్లీలో కీలక సమావేశాలను కేంద్రం నిర్వహించింది. గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాలు, దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ను పరిశీలించి.. వాటిని యథాస్థితికి తేవడానికి చేయాల్సిన పనులకు అయ్యే వ్యయం, ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి అయ్యే వ్యయంపై నివేదిక ఇవ్వాలని వెదిరె శ్రీరాంకు ఆ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ సూచించారు.


దాంతో శనివారం వెదిరె శ్రీరాం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) డిజైన్స్‌ విభాగం డైరెక్టర్‌ ఖయ్యూం అహ్మద్, డిప్యూటీ డైరెక్టర్‌ అశ్వనీకుమార్‌ వర్మ, పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ తదితరులతో కూడిన బృందం పోలవరానికి వచ్చింది. వారు దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత పనులను పరిశీలించారు. ప్రధాన డ్యామ్‌ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతం, డయాఫ్రమ్‌ వాల్‌ను పరిశీలించారు.

సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ సూచనల మేరకు ఇసుక నాణ్యతతోపాటు 11 రకాల పరీక్షలు చేయించి.. జూలై 15లోగా నివేదిక ఇస్తామని ఈఎన్‌సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్‌ బాబు వెదిరె శ్రీరాంకు వివరించారు. ఆ తర్వాత స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, స్పిల్‌ వే గైడ్‌ బండ్‌ పనులను పరిశీలించారు. ఆదివారం ప్రాజెక్టు పనులను మరోసారి పరిశీలించి.. ఆ తర్వాత సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 

Advertisement
Advertisement