నా విశాఖ.. నా కల | Sakshi
Sakshi News home page

నా విశాఖ.. నా కల

Published Wed, Mar 13 2024 11:15 AM

Vision Visakha conference - Sakshi

‘నా కలల నగరం విశాఖ.. పూర్తిస్థాయిలో స్మార్ట్‌ సిటీగా మారాలి. విద్య కోసం ఇతర ప్రాంతాలు, దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో విశ్వవిద్యాలయాలు రావాలి. ఏయూను రోల్‌మోడల్‌గా తీసుకుని విద్యా సంస్థలు ఎదగాలి. వైద్య రంగంలో మరిన్ని వసతులు సమకూరాలి. ఇజ్రాయిల్‌కు దీటుగా పరిశోధన రంగంలో ప్రగతి సాధించాలి. పూర్తిస్థాయి సాంకేతికతో సేవలందించే విశ్వ నగరంగా రూపాంతరం చెందాలి. సెల్‌ఫోన్, వాలెట్‌ లేకుండా బయటకు వెళ్లినా మన పనులు మనం చేసుకుని వచ్చే విధంగా టెక్నాలజీ అభివృద్ధి చెందాలి. విశాఖ పేరు చెబితే బీచ్‌ గుర్తుకొస్తుంది. తీర ప్రాంతంలో స్వదేశీ, విదేశీయులను ఆకట్టుకునే నిర్మాణాలు జరగాలి. ఇక్కడ ప్రకృతి అందాలను తిలకించే విదేశీయులు ఇక్కడే స్థిరపడేలా వసతులు సమకూరాలి’ అంటూ విశాఖపై తనకున్న విజన్‌ను ఏడేళ్ల చిన్నారి వివరించి తీరు అందరినీ ఆలోచింపజేసింది.  

ఏయూక్యాంపస్‌: ఆంధ్ర విశ్వ విద్యాలయం కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా మంగళవారం నిర్వహించిన విజన్‌ విశాఖ సదస్సు విజయవంతమైంది. విశాఖ యువత నుంచి ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. అంతర్జాతీయంగా విశాఖ ఎదగడానికి అనువైన పరిస్థితులు, వసతులున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. విశాఖ సామర్థ్యాలను వివరిస్తూ యువత తమ ఆలోచనలను పంచుకుంది. ఏడేళ్ల చిన్నారి తపస్వి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని డి.హర్షిత మాట్లాడుతూ విలియం షేక్‌స్పియర్‌ జీవించి ఉంటే తన రచనల్లో వెనిస్‌ నగరం కంటే విశాఖ నగరాన్నే అధికంగా ప్రస్తావించి ఉండేవారన్నారు. విశాఖలో ప్రకృతి రమణీయత ఎంతో ప్రత్యేకమన్నారు. ప్రపంచానికే పవర్‌ జనరేటర్‌గా విశాఖ నిలుస్తుందన్నారు. వై నాట్‌ వైజాగ్‌ అనే స్థాయికి విశాఖ నేడు ఎదిగిందన్నారు. ఇది నా నగరం.. ఇదీ విశాఖ నగరం.. మన కథను మనమే రాద్దామంటూ తన ఉత్సాహభరిత ప్రసంగంతో యువతను ఆకట్టుకుంది.

సదస్సులో నిపుణుల ప్రసంగాలతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ సస్టైనబుల్‌ అర్బనైజేషన్, ఎంటర్‌ప్యూనర్‌ప్‌ అండ్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్, టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ అంశాలపై నిర్వహించిన మూడు చర్చగోష్టులలో నిపుణులు, యువత విశాఖ నగరంపై తమ అంచనాలు, ఆకాంక్షలు, అవకాశాలను వివరించారు. దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య డి.సూర్యప్రకాశరావు, ప్రిన్సిపాళ్లు ఆచార్య కె.శ్రీనివాసరావు, వై.రాజేంద్రప్రసాద్, ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఉపాధ్యక్షుడు ఆంజనేయ వర్మ, విశాఖపట్నం ఆటోనగర్‌ స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాండురంగ ప్రసాద్, ఐఐఎంవీ ఫీల్డ్‌ సీఈవో గుహన్‌ రామనాథన్, తారమండల్‌ వ్యవస్థాపకుడు వినీల్‌ జడ్సన్‌ తదితరులుప్రసంగించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమ భవిష్యత్‌కి బాటలు వేసే నగరంగా విశాఖ నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.   

Advertisement
Advertisement