Significance And Importance Of Ashada Masam In Telugu - Sakshi
Sakshi News home page

ఆషాఢం: కొత్త దంపతులకు దూరం ఎందుకంటే..?

Published Wed, Jul 14 2021 10:36 AM

Whats Speciality Of Ashada Masam In Telugu - Sakshi

ఆషాఢ మాసం.. ఎంతో విశిష్టం.. ఏకాదశి, గురుపౌర్ణమి, చాతుర్మాస వ్రతాలు.. పూరీలో జగన్నాథుని రథయాత్ర.. ఇలా ఎన్నో పండుగలు.. మరెన్నో ప్రత్యేకతలు దీని సొంతం.. అయితే నవదంపతులకు మాత్రం భారం.. కోటి ఆశలతో ఒక్కటైన జంటకు నెలపాటు ఎడబాటు.. అయితే ‘సెల్‌’మోహన రంగా అంటూ.. విరహగీతం ఆలపిస్తారు.. వీడియో కాలింగ్‌లో విహరిస్తారు. ప్రణయ మధురిమలు పంచుకుంటారు.. సరాగాల సరిగమలు పెంచుకుంటారు.. శ్రావణం రావాలి అంటూ నిరీక్షిస్తూ ఉంటారు. 

సాక్షి, కడప : ఈనెల 11వ తేదీ నుంచి ఆషాఢ మాసం మొదలైంది. ఈ మాసాన్ని శూన్యమాసమంటారు. వివాహం లాంటి శుభకార్యాలు తలపెట్టరు. ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి వైష్ణవ ఆరాధకులకు ముఖ్యమైనది. దీన్నే తొలి ఏకాదశి అంటారు. అప్పటి నుంచి ప్రతి వారం ఏదో ఒక పండుగ, వ్రతం, పూజ ఉంటాయి. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తారు.  

► ఆషాఢమాసంలో యువతులు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని పెద్దలు పేర్కొంటారు. గోరింటాకుకు మన సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది.
► ఆషాఢ పౌర్ణమిని మనం వేద వ్యాసుని పేరిట గురుపౌర్ణమిగానిర్వహించుకుంటాం.
► తెలంగాణలో బోనాల పండుగను నిర్వహిస్తారు.  వర్షాల కారణంగా కూరగాయలు బాగా పండుతాయి..  శ్రీ దుర్గామాతను శాకంబరిగా అలంకరించి తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహిస్తారు.  
► ఒరిస్సాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర కూడా ఈ మాసంలోనే అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 

వధూవరుల విరహం.. 
ఆషాఢ మాసంలో అత్తాకోడళ్లు ఒక ఇంటిలో ఉండకూడదంటారు. కొత్తగా పెళ్లయిన దంపతులను దూరంగా ఉంచుతారు. ఇందులో భాగంగా అమ్మాయిని పుట్టింటికి తీసుకు వెళతారు. ఇందులో శాస్త్రీయత ఉందని పెద్దలు పేర్కొంటున్నారు. ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే తొమ్మిది నెలల తర్వాత వేసవి కాలంలో ప్రసవించే అవకాశం ఉందని, అప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి శిశువుకు ఆ వాతావరణం ఇబ్బంది కలిగిస్తుందని.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, తల్లీబిడ్డల ఆరోగ్యానికి కూడా ఈ వాతావరణం మంచిది కాదంటారు. అందుకే ఆ మాసంలో నూతన దంపతులను దూరంగా ఉంచుతారు.   

కొత్త కోడలు పుట్టింటికి... 
ఈ మాసంలో తొలకరి మొదలై మంచి వర్షాలు కురుస్తాయి.  పొలం పనులు జోరందుకుంటాయి. ఇంటిలో అందరూ వ్యవసాయ పనులపై పొలానికి వెళ్లినపుడు కొత్తగా పెళ్లయిన జంట ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు.  అందుకే సంప్రదాయం పేరిట కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తగారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే.    

ఎందుకిలా..
ఆషాఢం మొదలయ్యే నాటికి వర్షాలు కురిసి కొత్త నీరు వస్తుంది. మారుతున్న వాతావరణంలో అనుకూల, ప్రతికూల మార్పులను తట్టుకుని నిలవాలన్నదే ఈ మాసం సందేశం. కొత్త జంటలలో అమ్మాయి ఈ మాసంలో అత్తగారింట్లో ఉండకూడదన్న సంప్రదాయం బాగా ప్రచారంలో ఉంది. శారీరకంగా, మానసికంగా అప్పుడప్పుడే భర్తకు దగ్గరవుతున్న వారు ఈ ఎడబాటు ద్వారా కలిగే ప్రేమ వారి భవిష్య జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందంటారు. ఈ మాసం నూతన జంటలను కొన్నాళ్లపాటు విడదీసి విరహంలో ముంచుతుందని మాత్రమే భావించాల్సిన అవసరం లేదు. వారి మధ్య బంధాన్ని  మరింతగా బలపరుస్తుందన్న అవగాహన కలిగి ఉండాలి.

ఆధునిక టెక్నాలజి కారణంగా సెల్‌ఫోన్‌లలో ఎక్కువగా మాట్లాడుకునేందుకు ఇప్పుడు వీలుంది. నెలరోజుల తర్వాత అంటే శ్రావణమాసంలో మెట్టినింటివారు అమ్మాయికి చీర, సారె పెట్టి ఆశీర్వదించి మంగళ ప్రదంగా తమ ఇంటికి తీసుకు వస్తారు. ఇక్కడితో ఆషాడ మాసపు ఎడబాటు ముగుస్తుంది. అయితే ఈ ఆధునిక కాలపు ఉద్యోగం చేసే జంటకు  విరహం, బాధ ఉండదు. వివాహమైన నెలరోజులకే ఉద్యోగం చేసే చోట కొత్త కాపురం పెట్టేస్తుండడంతో అత్తాకోడలు ఒకే ఇంటిలో ఉండే నిబంధన వారికి వర్తించదు.  

చాతుర్మాస దీక్షలు చేపడతారు.. 
ఆషాఢాన్ని శూన్య మాసంగా భావిస్తారు. శుభ కార్యాలు చేయకూడదని విశ్వసిస్తారు. నిజానికి  పెద్ద పండుగల రాకను ఈ మాసం తెలుపుతుంది. వైష్ణవులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. మఠాధిపతులు ఈ మాసంలోనే చాతుర్మాస దీక్ష వహిస్తారు.  
– విజయ్‌భట్టర్, అర్చక సంఘం నాయకుడు, కడప 

ఎన్నో ప్రత్యేకతలు.. 
ఆషాఢ మాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అత్తాకోడళ్లు ఈ మాసంలో ఒకే ఇంటిలో ఉండకూడదని భావిస్తారు. నిజానికి ఈ నమ్మకం వెనుక ప్రకృతి ఆధారిత సంప్రదాయం ఉంది. దాదాపు అన్ని పండుగల వెనుక ప్రకృతి పరమైన లేదా ఆధ్యాతి్మక, పురాణ పరమైన విశ్వాసాలు ఉంటాయి.
– హరిభూషణరావు, లైబ్రేరియన్, కడప     

Advertisement
Advertisement