వైఎస్‌ మాతృమూర్తి జయమ్మకు నివాళి | Sakshi
Sakshi News home page

వైఎస్‌ మాతృమూర్తి జయమ్మకు నివాళి

Published Wed, Jan 26 2022 4:29 AM

YS Vijayamma Tribute to YSR Mother Jayamma - Sakshi

పులివెందుల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మాతృమూర్తి వైఎస్‌ జయమ్మ జీవితం అందరికీ ఆదర్శమని వైఎస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల మాజీ ఎమ్మెల్యే వైఎస్‌ విజయమ్మ పేర్కొన్నారు. వైఎస్‌ జయమ్మ 16వ వర్ధంతిని వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో మంగళవారం నిర్వహించారు. లయోలా డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైఎస్‌ జయమ్మ, వైఎస్‌ రాజారెడ్డి ఘాట్‌లకు వెళ్లిన విజయమ్మ వారి సమాధుల వద్ద పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు.

అనంతరం అక్కడే ఉన్న జార్జిరెడ్డి, వివేకానందరెడ్డి, డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ఘాట్‌లతోపాటు ఇతర కుటుంబ సభ్యుల సమాధులను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు పాస్టర్లు ఆనంద్, నరేష్‌కుమార్, మృత్యుంజయులు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వైఎస్‌ విజయమ్మ, దివంగత వైఎస్‌ జార్జిరెడ్డి సతీమణి వైఎస్‌ భారతమ్మ, వైఎస్‌ వివేకా సతీమణి వైఎస్‌ సౌభాగ్యమ్మ, వైఎస్సార్‌ సోదరుడు వైఎస్‌ సుధీకర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్, కమిషనర్‌ నరసింహారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌ జయమ్మ పార్కుకు చేరుకుని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ వైఎస్‌ జయమ్మకు తమ కుటుంబంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. పులివెందుల ప్రాంతంలో ఎవరికి కష్టమొచ్చినా తన బిడ్డలకు కష్టం వచ్చినట్లుగా ఆమె భావించేవారన్నారు. వైఎస్సార్‌ను మాట తప్పని.. మడమ తిప్పని నేతగా తీర్చిదిద్దడంలో, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం వెనుక వైఎస్‌ జయమ్మ పాత్ర ఎంతో ఉందన్నారు. ఆమె జీవితాన్ని అంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 

Advertisement
Advertisement