తక్కువ పేజీల్లోనే బడ్జెట్.. మొత్తం డిజిటల్ రూపంలో! | Sakshi
Sakshi News home page

తక్కువ పేజీల్లోనే బడ్జెట్.. మొత్తం డిజిటల్ రూపంలో!

Published Thu, Jan 27 2022 8:09 AM

Budget 2022 to go paperless for the second time - Sakshi

న్యూఢిల్లీ: ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ- భారత్‌ వార్షిక బడ్జెట్‌ అంటే మొదట గుర్తుకు వచ్చేది... బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రారంభానికి ముందు సాంప్రదాయక హల్వా తయారీ, ఈ కార్యక్రమంలో ఆర్థికమంత్రితో సహా సీనియర్‌ అధికారుల సందడి.. ఆ రోజు నుంచి నిర్దిష్ట సిబ్బంది బయటి ప్రపంచానికి దూరంగా బడ్జెట్‌ ముద్రణకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం-నార్త్‌బ్లాక్‌ బేస్‌మెంట్‌లోని ప్రధాన ముద్రణా కేంద్రంలోకి మకాం మార్చడం... కుటుంబానికి దూరంగా కనీసం రెండు వారాల వారి క్వారంటైన్‌... అటుపై టన్నుల బరువుండే బడ్జెట్‌ వందలాది పత్రాలను పార్లమెంటుకు ప్రత్యేక రక్షణ వలయంలో తీసుకుని రావడం.. సుశిక్షిత జాగిలాల హడావిడి.  

అయితే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌ కాపీల ముద్రణను తగ్గించింది. ఈ ప్రక్రియ డిజిటల్‌ రూపంలోకి క్రమంగా మారిపోవడం ప్రారంభమైంది. మొదట్లో జర్నలిస్టులకు, బయటి విశ్లేషకులకు పంపిణీ చేసే ప్రతులను ఆర్థికశాఖ తగ్గించింది. ఆటుపై మహమ్మారి వ్యాప్తిని ఉటంకిస్తూ లోక్‌సభ, రాజ్యసభ పార్లమెంటు సభ్యులకు అందించే ప్రతుల సంఖ్యలోనూ కొతపెట్టింది. పార్లమెంట్‌ సభ్యులు, సాధారణ ప్రజలు బడ్జెట్‌ పత్రాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా యాక్సెస్‌ చేయడానికి ‘యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌’ని  ఆర్థిక మంత్రిత్వ శాఖ 2021లో ప్రారంభించింది. 

ఫిబ్రవరి 1వ తేదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టే 2022-23 వార్షిక బడ్జెట్‌లో డిజిటల్‌ పక్రియ మరింత వేగవంతంగా మారనుంది. బడ్జెట్‌ అంశాల ప్రింటింగ్‌ కేవలం కొన్ని పేజీలకే పరిమితం కానుంది.  ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం... పన్ను ప్రతిపాదనలు, ఆర్థిక నివేదికల సమర్పణకు సంబంధించిన పత్రాల విస్తృత ముద్రణ ఈ దఫా చాలా తక్కువకు పరిమితం కానుంది. బడ్జెట్‌ పత్రాలు చాలా వరకు డిజిటల్‌గా అందుబాటులో ఉంటాయి. కొన్ని ఫిజికల్‌ కాపీల లభ్యత మాత్రమే ఉంటుంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆందోళనల నేపథ్యంలో హల్వా కార్యక్రమం కూడా సాదాసీదాగా సాగింది.
 

కేవలం డిజిటల్‌ బడ్జెట్‌ పత్రాల పూర్తికి సంబంధించి కేవలం కొంత మంది అధికారులే నార్త్‌బ్లాక్‌ బేస్‌మెంట్‌లో జనజీవనానికి దూరంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక మంత్రి  2019లో తన తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంలో బడ్జెట్‌ పత్రాలను ప్రత్యేక బ్రీఫ్‌కేస్‌లో తీసుకెళ్లే దీర్ఘకాల పద్ధతికి స్వస్తి పలికారు. ఆమె తన ప్రసంగాన్ని చదవడానికి హ్యాండ్‌హెల్డ్‌ టాబ్లెట్‌ను ఉపయోగించారు. 2021 ఫిబ్రవరి 1వ తేదీన ఆమె ఎరుపు రంగు వస్త్రంలో చుట్టిన గాడ్జెట్‌ను తీసుకుని పార్లమెంటుకు వచ్చారు.

(చదవండి: ఢిల్లీలో జియో-బీపీ ఈవీ చార్జింగ్‌ హబ్‌!)

Advertisement

తప్పక చదవండి

Advertisement