‘రెడ్‌ లేబుల్‌ నేచురల్‌ కేర్‌ టీ’కి భారీ ఊరట | Sakshi
Sakshi News home page

‘రెడ్‌ లేబుల్‌ నేచురల్‌ కేర్‌ టీ’కి భారీ ఊరట

Published Fri, Sep 29 2023 9:31 AM

Calcutta High Court Acquitted Hindustan Unilever Company From Red Label Tea Misbranding Case - Sakshi

ప్రముఖ దేశీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలివర్‌ సంస్థకు భారీ ఊరట లభించింది. ‘రెడ్‌ లేబుల్‌ నేచురల్‌ కేర్‌ టీ’ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తుందంటూ హెచ్‌యూఎల్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది. అయితే, ఆ కేసును కోల్‌కతా హైకోర్టు కొట్టిపారేసింది. సంస్థ యాజమాన్యం నిర్ధోషులని తీర్పిచ్చింది.

కేసు పూర్వపరాల్ని పరిశీలిస్తే.. కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ (కేఎంసీ)కు చెందిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ హిందుస్థాన్‌ యూనిలివర్‌ సంస్థపై, ఆ కంపెనీ (ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగులు) యాజమాన్యం రెడ్‌ లేబుల్‌ టీ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తుందంటూ క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. 

హెచ్‌యూఎల్‌ సంస్థ ఆహార కల్తీ నిరోధక చట్టం సెక్షన్ 38, సెక్షన్ 39ని ఉల్లంఘించందని ఆరోపించారు. దీంతో తప్పుగా బ్రాండింగ్ చేస్తున్నందుకు హెచ్‌యూఎల్‌ ఉన్నతాధికారులు దోషులని మునిసిపల్ మేజిస్ట్రేట్ నిర్ధారించింది. రూ. 5,000 జరిమానాతో పాటు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. 

ఈ శిక్షను కోల్‌కతా జిల్లా కోర్టు (సెషన్స్ కోర్టు) కొట్టివేసింది. అయితే, తీర్పును మళ్లీ పరిశీలించాలని మున్సిపల్ మేజిస్ట్రేట్‌కు తిరిగి పంపించింది. సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హిందుస్తాన్‌ యూనిలివర్‌ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ టీపై తప్పుడు ప్రచారం చేసిందనే మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభిప్రాయంపై స్పందించింది. తప్పుడు ప్రచారం అంటూ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని నిరూపించడానికి ట్రయల్ కోర్టు (అప్పీలేట్‌ కోర్టు) ముందు కేఎంసీ విభాగం ఎప్పుడూ హాజరు కాలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

పైగా హిందుస్థాన్ యూనిలీవర్ తన ఉత్పత్తిని ఎందుకు తప్పుగా బ్రాండ్ చేసిందనే కారణాల్ని వివరించలేదని కోర్టు తెలిపింది. హిందుస్థాన్ యూనిలీవర్, ఆ సంస్థ అధికారులపై నమోదైన కేసులో సరైన ఆధారాలు లేవని జస్టిస్ సుభేందు సమంతా గుర్తించారు. కేసును కొట్టివేసి నిందితులను నిర్దోషులుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 హిందుస్థాన్ యూనిలీవర్ తరఫున న్యాయవాదులు సబ్యసాచి బెనర్జీ, అనిర్బన్ దత్తా, అభిజిత్ చౌదరి, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ తరపున న్యాయవాదులు గౌతమ్ దిన్హా ,అనింద్యసుందర్ ఛటర్జీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఇమ్రాన్ అలీ, దేబ్జానీ సాహులు తమ వాదనల్ని వినిపించారు.

Advertisement
Advertisement