జీఎస్‌టీ వసూళ్లు 18 శాతం అప్‌  | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ వసూళ్లు 18 శాతం అప్‌ 

Published Wed, Mar 2 2022 3:28 AM

GST Revenues Soar 18 Percent To Rs 1. 33 Lakh Crore In February - Sakshi

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను వసూళ్లు 2022 ఫిబ్రవరిలో 18 శాతం  పెరిగి (2021 ఇదే నెలతో పోల్చి) రూ.1.33 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అయితే నెలవారీగా 2022 జనవరి నెలతో పోల్చిచూస్తే, వసూళ్లపై మూడవ వేల్‌లో సవాలుగా ఏర్పడిన ఒమిక్రాన్‌ ప్రభావం కనబడింది. జనవరిలో రికార్డు స్థాయిలో రూ. 1,40,986 కోట్ల వసూళ్లు నమోదయిన సంగతి తెలిసిందే. ఇక జనవరితో పోల్చితే ఫిబ్రవరిలో మూడు రోజులు తక్కువగా ఉండడం ఇక్కడ గమనించాల్సిన మరో అంశం. గణాంకాల్లో  కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.లక్ష కోట్లపైన జీఎస్‌టీ వసూళ్లు ఇది వరుసగా ఎనిమిదవ నెల. రూ.1.30 లక్షల కోట్లు దాటడం ఐదవసారి.  

ఒక్క సెస్‌ వసూళ్లు రూ.10,000 కోట్ల కీలక స్థాయిని దాటడం ఇదే మొదటిసారి. ఆటోమొబైల్‌ వంటి కీలక రంగాల్లో పటిష్ట రికవరీ దీనికి కారణమని ఆర్థికశాఖ ప్రకటన ఒకటి పేర్కొంది.  

2021 ఫిబ్రవరితో పోల్చితే జీఎస్‌టీ వసూళ్ల వృద్ధి  18 శాతం అయితే,  దేశంలో కరోనా సవాళ్లు ప్రారంభానికి ముందు ఫిబ్రవరి 2020తో పోల్చితే ఏకంగా ఈ వృద్ధి రేటు 26 శాతంగా ఉండడం గమనార్హం.  

వసూలయిన మొత్తం రూ.1,33,026 కోట్లలో సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.24,435 కోట్లు. స్టేట్‌ జీఎస్‌టీ రూ.30,779 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.67,471 కోట్లు (వస్తువుల దిగుమతులపై రూ.33,837 కోట్ల వసూళ్లుసహా), సెస్‌ రూ.10,341 కోట్లు ((వస్తువుల దిగుమతులపై రూ.638 కోట్ల వసూళ్లుసహా).  

Advertisement
Advertisement