పొరపాటు జరిగింది.. నష్టపోతే రండి.. డబ్బు తీసుకోండి | Sakshi
Sakshi News home page

ICICI: ఇతర ఖాతాలకు లింకైన 17వేల క్రెడిట్‌కార్డుల సమాచారం

Published Fri, Apr 26 2024 3:21 PM

ICICI Credit Card Data Of At Least 17000 New Customers Was Exposed

ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన దాదాపు 17 వేల  క్రెడిట్‌కార్డుల సమాచారం ఇతరుల ఖాతాకు పొరపాటున లింక్‌ అయినట్లు బ్యాంక్‌ తెలిపింది. సాంకేతికత లోపం వల్ల ఈ తప్పిదం జరిగిందని బ్యాంక్‌ అంగీకరించింది. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే వారి డబ్బు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చింది.

డిజిటల్‌ మాధ్యమాల్లో తమ క్రెడిట్‌కార్డుల వివరాలు పొరపాటున ఇతర ఖాతాకు అనుసంధానమైనట్లు గుర్తించిన వెంటనే సవరించినట్లు బ్యాంకు తెలిపింది. అయితే ఇప్పటి వరకు డేటా దుర్వినియోగం అయినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పింది.

సాంకేతికలోపం వల్ల ఆన్‌లైన్‌లో ఇప్పటికే ఉన్న కస్టమర్ ఖాతాలకు కొత్త క్రెడిట్ కార్డ్‌లు వివరాలు పొరపాటున లింక్‌ అయ్యాయి. దాంతో పాత కస్టమర్లు కొత్తవారి కోసం కేటాయించిన కార్డుల వివరాలు తెలుసుకునేలా వీలు కల్పించనట్లయింది. ఆన్‌లైన్‌లో లాగిన్ అవ్వగానే తాము కొత్తగా దరఖాస్తు చేయకపోయనా కొత్త కార్డ్ వివరాలు కనిపించాయని కొందరు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. దాంతో స్పందించిన బ్యాంక్‌ అధికారులు వెంటనే సమస్యను గుర్తించి సవరించినట్లు తెలిసింది. తర్వాత పొరపాటు జరిగినట్లు అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు.

ఇదీ చదవండి: కేంద్రం నిబంధనలకు ‘నో’ చెప్పిన వాట్సప్‌

ఈ సంఘటనలో ప్రభావితమైన వివరాలు, కార్డులను బ్లాక్‌ చేస్తున్నట్లు బ్యాంక్‌ తెలిపింది. తిరిగి కొత్తకార్డులు జారీ చేస్తామని చెప్పింది. ఇప్పటివరకైతే ఆర్థిక నష్టానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, ఒకవేళ తాము ఈ సంఘటన ద్వారా నష్టపోయినట్లు గుర్తించి ఎవరైనా కస్టమర్లు బ్యాంక్‌ను సంప్రదిస్తే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది.

Advertisement
Advertisement