భారీ స్థాయికి ఆన్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌ | Sakshi
Sakshi News home page

భారీ స్థాయికి ఆన్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌

Published Mon, Jul 3 2023 4:58 AM

India online retail sector likely to touch 325 billion Dollers by 2030 - Sakshi

న్యూఢిల్లీ: దేశ ఆన్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌ శరవేగంగా వృద్ధి చెందుతోంది. 2022 నాటికి 70 బిలియన్‌ డాలర్లుగా (రూ.5.74 లక్షల కోట్లు) ఉన్న మార్కెట్‌ విలువ 2030 నాటికి నాలుగు రెట్ల వృద్ధితో 325 బిలియన్‌ డాలర్లకు (రూ.26.65 లక్షల కోట్లు) చేరుకుంటుందని డెలాయిట్‌ ఇండియా ఓ నివేదికలో తెలిపింది. ఈ కామర్స్‌ రంగం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వేగంగా వృద్ధి చెందుతున్నట్టు వెల్లడించింది. ఆర్డర్ల సంఖ్యా పరంగా ప్రథమ శ్రేణి పట్టణాలను ఇవి అధిగమించినట్టు పేర్కొంది. ఆఫ్‌లైన్‌ (భౌతిక దుకాణాలు)తో పోలిస్తే వచ్చే దశాబ్ద కాలంలో ఆన్‌లైన్‌ రిటైల్‌ విస్తరణ రెండున్నర రెట్లు అధికంగా ఉంటుందని వివరించింది.

‘‘2022లో టైర్‌–2, 3 పట్టణాలు మొత్తం ఈ కామర్స్‌ ఆర్డర్లలో 60 శాతం వాటా ఆక్రమించాయి. టైర్‌–3 పట్టణాల్లో ఆర్డర్లు 65 శాతం పెరిగాయి. టైర్‌–2 పట్టణాల్లో ఆర్డర్లలో 50 శాతం పెరుగుదల కనిపించింది. ఆన్‌లైన్‌ రిటైల్‌ భారీగా వృద్ధి చెందడానికి ఎన్నో అంశాలున్నాయి. ఆర్డర్‌ చేయడంలో, వాటిని తిప్పి పంపించడంలో సౌకర్యం ఉండడం, 19,000 పిన్‌కోడ్‌ల పరిధిలో లాజిస్టిక్స్‌ వసతులు (డెలివరీ, పికప్‌) ఉండడం కీలకమైనవి’’అని ఈ నివేదిక వివరించింది. పైగా భారత్‌లో 22 కోట్ల ఆన్‌లైన్‌ షాపర్స్‌ ఉండడం కూడా ఈ కామర్స్‌ వృద్ధిని మరింత నడిపిస్తోందని తెలిపింది.   

భారీగా పెట్టుబడులు  
ఈ కామర్స్‌ రంగంలో భారీ పెట్టుబడులు రావడాన్ని సైతం డెలాయిట్‌ నివేదిక ప్రస్తావించింది. ప్రైవేటు ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల నుంచి గత ఐదేళ్లలో 23 బిలియన్‌ డాలర్ల నిధులను ఆకర్షించినట్టు తెలిపింది. రిటైలర్లు సైతం ఓమ్నిచానల్‌ మార్గాన్ని అనుసరిస్తున్నట్టు, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ రెండు మార్గాల్లోనూ కస్టమర్లకు చేరువు అవుతున్నట్టు వివరించింది. ‘‘పెరుగుతున్న ఆదాయం, వేగంగా డిజిటలైజేషన్, మధ్యతరగతి వర్గం విస్తరణతో భారత్‌లో ఆన్‌లైన్‌ రిటైల్‌ రంగం అసాధారణ వృద్ధిని చూస్తుందన్న నమ్మకం ఉంది. టెక్నాలజీ సామర్థ్యాలు, భవిష్యత్తు వ్యూహాల ద్వారా రిటైలర్లు కస్టమర్ల డిమాండ్‌ను చేరుకోవడమే కాదు, విలువ పరంగా నూతన ప్రమాణాలను సృష్టించనున్నారు.

మరిచిపోలేని షాపింగ్‌ అనుభూమతిని ఇవ్వనున్నారు’’అని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ ఆనంద్‌ రామనాథన్‌ అభిప్రాయపడ్డారు. టైర్‌–2 పట్టణాల్లో ఇంటర్నెట్‌ వినియోగం పెరగడం, ఆన్‌లైన్‌ వ్యాపారాలను సులభంగా ప్రారంభించే అవకాశం, కావాల్సినవి సులభంగా గుర్తించడం, సులభతర చెల్లింపుల విధానాలు దేశంలో రిటైల్‌ రంగ ముఖచిత్రా న్ని మార్చేస్తాయని డెలాయిట్‌ నివేదిక అంచనా వేసింది. ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియా లిటీ, మెటావర్స్‌ అనేవి కస్టమర్‌తో అనుసంధానతను మార్చేస్తాయని, కస్టమర్లకు రిటైలర్లు మరింత దగ్గర కావడంతోపాటు, వారి సంతృప్తిని సంపాదించేందుకు వీలు కలి్పస్తాయని పేర్కొంది. కిరాణా దుకాణాలను పెద్ద రిటైల్‌ ఎకోసిస్టమ్‌తో అనుసంధానించడం ద్వారా ఉత్పత్తుల శ్రేణి, వ్యాపా రం మరింత విస్తరించుకోవచ్చని సూచించింది.

Advertisement
Advertisement