సుంకాలు తగ్గిస్తే ఆటో పరిశ్రమకు చేటు | Sakshi
Sakshi News home page

సుంకాలు తగ్గిస్తే ఆటో పరిశ్రమకు చేటు

Published Tue, Feb 6 2024 4:47 AM

India-UK FTA to benefit high quality labour-intensive goods - Sakshi

న్యూఢిల్లీ: బ్రిటన్‌ వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) కింద ఆటోమొబైల్స్‌పై దిగుమతి సుంకాలను తగ్గిస్తే దేశీ పరిశ్రమకు ప్రతికూలం అవుతుందని ఆర్థికవేత్తల సంస్థ గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) ఒక నివేదికలో తెలిపింది. ఆగ్నేయాసియా దేశాలు, జపాన్, కొరియాలతో ఉన్న ఎఫ్‌టీఏల్లో కూడా కార్లపై సుంకాలను భారత్‌ తగ్గించలేదని పేర్కొంది.

‘ఎఫ్‌టీఏల కింద ఎలక్ట్రిక్‌ వాహనాలు సహా ఆటోమొబైల్స్‌పై కస్టమ్స్‌ సుంకాలను భారత్‌ తగ్గించరాదు. అలా చేస్తే భారత్‌లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెట్టిన ఆటో దిగ్గజాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అవి సంస్థలను మూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది‘ అని జీటీఆర్‌ఐ తెలిపింది. బ్రిటన్‌ ఎక్కువగా యూరోపియన్‌ యూనియన్, చైనా నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో కార్లను అసెంబుల్‌ మాత్రమే చేస్తుంది కాబట్టి ఆ దేశానికి సుంకాలపరమైన మినహాయింపుని ఇచ్చేందుకు సరైన కారణమేమీ లేదని స్పష్టం చేసింది.

ఒకవేళ బ్రిటన్‌కి గానీ మినహాయింపులు ఇస్తే జపాన్, కొరియా వంటి ఇతరత్రా ఎఫ్‌టీఏ భాగస్వాములు తమకు కూడా ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టారిఫ్‌ విధానాన్ని కొనసాగిస్తూ, అదనంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలపరమైన మద్దతును పరిశ్రమకు అందించే అవకాశాన్ని పరిశీలించవచ్చని జీటీఆర్‌ఐ సూచించింది.

పరిశోధనలపై ఇన్వెస్ట్‌ చేయాలి..
70 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు నుంచే ఉంటున్నందున ఎలక్ట్రిక్‌ వాహనాలనేవి భారత్‌లో అంతగా పర్యావరణ అనుకూలమైనవేమీ కాదని తెలిపింది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు సబ్సిడీలు ఇచ్చే బదులు కొత్త తరం బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సంబంధించి పరిశోధన కార్యకలాపాలపై ఇన్వెస్ట్‌ చేయడం శ్రేయస్కరమని జీటీఆర్‌ఐ పేర్కొంది.

దిగుమతి సుంకాలను క్రమంగా 45 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేయడంతో ఆ్రస్టేలియాలో చాలా మటుకు స్థానిక కార్ల కంపెనీలు మూతబడ్డాయని తెలిపింది. దానికి విరుద్ధంగా భారత్‌ అధిక సుంకాలను కొనసాగించడం వల్ల కార్ల పరిశ్రమలోకి గణనీయంగా పెట్టుబడులను ఆకర్షించవచ్చని జీటీఆర్‌ఐ అభిప్రాయపడింది. దీనివల్ల దేశీయంగా కార్లు, ఆటో విడిభాగాల పరిశ్రమ కూడా అభివృద్ధి చెందగలదని పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement