ప్రముఖ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో ఊహించని ఎదురు దెబ్బ! | Sakshi
Sakshi News home page

ప్రముఖ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో ఊహించని ఎదురు దెబ్బ!

Published Wed, Dec 27 2023 12:52 PM

Infosys Lost Rs 7,200 Cr In Market Cap On December 26 - Sakshi

‘మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు’ అన్న చందంగా తయారైంది ప్రముఖ టెక​ దిగ్గజం ఇన్ఫోసిస్‌ పరిస్థితి. ఇప్పటికే ఓ భారీ ప్రాజెక్ట్‌ రద్దయి ఐటీ రంగంలో హాట్‌ టాపిగ్గా మారిన ఇన్ఫోసిస్‌కు తాజాగా మరో షాక్‌ తగిలింది. కృత్తిమ మేధ ప్రాజెక్ట్‌ రద్దయ్యిందన్న వార్తలతో ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ విలువ సుమారు రూ.7,200 కోట్లు క్షీణించింది.  

డిసెంబర్ 26న స్టాక్‌ మార్కెట్‌లో ఆ సంస్థ షేర్ల క్షీణించాయి. ఫలితంగా ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,200 కోట్లకు పైగా తగ్గింది. గత సెషన్‌లో మార్కెట్ ముగిసే సమయంలో ఇన్ఫోసిస్‌ షేర్‌ ధర రూ.1,562తో పోలిస్తే 1.12 శాతం క్షీణించి రూ.1,544.5 వద్ద ముగిసింది. ఊహించని కార్పొరేట్ పరిణామాల నేపథ్యంలో అత్యంత బలమైన ఐటీ రంగ సంస్థలు కూడా బలహీనంగా ఉండటం ప్రస్తుత ఐటీ మార్కెట్‌కు పరిస్థితికి అద్దం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఇన్ఫోసిస్ షేరు ధర ఎందుకు పడిపోయింది?
ఇక ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ క్షీణతకు ఓ అంతర్జాతీయ కంపెనీతో కుదుర్చున్న ఒప్పందం రద్దవ్వడమేనని తెలుస్తోంది. ఇన్ఫోసిస్‌ 15ఏళ్ల పాటు కంపెనీ ప్లాట్‌ఫామ్‌లు, కృత్రిమ మేధ(ఏఐ) సొల్యూషన్స్‌పై పని చేసేందుకు ఓ అంతర్జాతీయ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఆర్ధిక మాంద్యం భయాలు, మార్కెట్‌లో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా తాజాగా, 1.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.12,450 కోట్లు) విలువైన ఈ ఒప్పందాన్ని సదరు కంపెనీ రద్దు చేసుకుంది.

డీల్‌ రద్దుతో మదుపర్ల అప్రమత్తం
ఈ డీల్ రద్దు కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్ట్‌ రద‍్దు ఇన్ఫోసిస్ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయన్న అంచనాలతో మదపర్లు షేర్లను విక్రయించారు. ఇన్ఫోసిస్ కొత్త తరం ఏఐ టెక్నాలజీల్లోకి విస్తరించడానికి ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని చాలా మంది ఊహించారు. అయితే, ప్రాజెక్ట్‌ కేన్సిల్‌ అవ్వడంతో ఇన్ఫోసిస్‌ ఆదాయ మార్గాలు, వృద్ధి అంచనాలపై ప్రతికూల ప్రభావం చూపింది.  

ఐటీ రంగానికి ఎదురుదెబ్బలు
కొన్నిసార్లు అస్థిరంగా ఉండే ఐటీ రంగం.. ప్రస్తుతం అప్రమత్తం కావాల్సిన పరిస్థితి నెలకొందని రాయిటర్స్ నివేదించింది. టెక్నాలజీ పెట్టుబడులను ప్రభావితం చేసే అనూహ్య ఆర్థిక పరిస్థితులను తట్టుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు తమ వ్యూహాలను పునఃసమీక్షిస్తున్నాయి. ఇన్ఫోసిస్‌కు ఈ తాజా కార్పొరేట్ అడ్డంకిని అధిగమించేటప్పుడు నష్ట నియంత్రణ, వాటాదారులకు భరోసా ఇవ్వడంపై తక్షణ దృష్టి సారించే అవకాశం ఉందని రాయిటర్స్‌ నివేదిక హైలెట్‌ చేసింది. 

Advertisement
Advertisement