అడాల్ఫ్‌ హిట్లర్‌ను పొగిడాడు.. దిగ్గజ టెక్‌ కంపెనీలో మంచి ఉద్యోగం పోగొట్టుకున్నాడు!

24 May, 2023 22:17 IST|Sakshi

అడాల్ఫ్ హిట్లర్.. ప్రపంచాన్ని వణికించిన నియంత. కొన్ని లక్షల మంది ప్రజలను పొట్టన బెట్టుకున్న క్రూరుడు. అతడి చెరలో పడితే చావే తప్పితే పునర్జన్మ ఉండదు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, మిత్ర రాజ్యాల దళాలు నాజీలను ఓడించడానికి ఆరేళ్లు ప్రయత్నించాయంటే..హిట్లర్ ఎంతటి గట్టివాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి నియంతను పొగిడాడంటూ ప్రముఖ టెక్‌ దిగ్గజం డెలాయిట్‌ ఓ ఉద్యోగుని విధుల నుంచి తొలగించింది. 

నీరభ్ మెహ్రోత్రా డెలాయిట్‌లో అసోసియేట్‌ డైరెక్టర్‌, రిస్క్‌ అడ్వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, తాజాగా నీరభ్‌ ‘ఫ్రైడే ఇన్స్పిరేషన్‌’ అనే కొటేషన్‌తో అడాల్ఫ్‌ హిట‍్లర్‌ ఆకర్షణీయమైన వ్యక్తి అంటూ నియంతపై పొగడ్తల వర్షం కురిపించారు.

 

‘‘ఇటీవల నేను ది డార్క్‌ చార్మ్‌ ఆఫ్‌ అడాల్ఫ్‌ హిట్లర్‌ బుక్‌ కొనుగోలు చేశా. ఆ బుక్‌ చదివే కొద్దీ ఇంకా ఇంకా చదవాలని అనిపిస్తుంది. ముఖ్యంగా అందులో హిట్లర్‌ గురించి, వరల్డ్‌ వార్‌ 2 పై ఈ బుక్‌ నాకు సరైన అవగాహన ఇచ్చింది’’ అని మెహ్రోత్రా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్‌ చేశారు. దీంతో పాటు ఆకర్షణీయమైన అడాల్ఫ్‌ హిట్లర్‌లోని కొన్ని లక్షణాల్ని మనం ఆకళింపు చేసుకోవాలి. తన మాటలతో ప్రజల్ని ఆకర్షించే మాగ్నెటిక్‌ స్పీకర్, కాన్ఫిడెంట్‌ ఎక్కువ’అని పేర్కొన్నాడు. 

అంతే అడాల్ఫ్‌ హిట్లర్‌ను పొగుడుతావా? అంటూ నెటిజన్లు మెహ్రోత్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. నెటిజన్ల కామెంట్లపై మెహ్రోత్రా స్పందిస్తూ బహిరంగ లేఖలో ఇలా రాశారు. ‘‘నేను ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. క్షమించండి అంటూ అభ్యర్థించాడు. ‘నేను తప్పు చేస్తే దానిని అంగీకరించే ధైర్యం ఉండాలని నా గురువులు, బాస్‌లు, కోచ్‌లు నాకు సలహా ఇచ్చారు. వారి మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాను. నేను చేసిన పోస్ట్‌పై క్షమాణలు కోరుతున్నాను అని అందులో రాశాడు. 

మరోవైపు ఆ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన కొద్ది సేపటికే డెలాయిట్‌ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. మెహ్రూత్రా ఇకపై తమ కంపెనీలో పనిచేయడం లేదని పేర్కొంది. గత నెలలో మా సంస్థలో చేరిన ఉద్యోగి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు మా భాగస్వామ్య విలువలకు అనుగుణంగా లేవు.మా అంతర్గత విధానాలను ఉల్లంఘించారు. ఈ ఉద్యోగి ఇకపై డెలాయిట్ ఇండియాలో పని చేయడు’ అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు ఆ ప్రటకనలో తెలిపారు.

మరిన్ని వార్తలు